పత్రికలు, టెలివిజన్, యూట్యూబ్ ఛానళ్లు- ఈ మూడింటి స్వరూప స్వభావాలను వైనాలను అర్థం చేసుకోవటం ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో తప్పనిసరి.
పత్రికలు- ఇవి సంప్రదాయంగా వస్తున్నవి. ఇంట్లో పెద్ద ముత్తయిదువులా ఒకప్పుడు పత్రికలు నడుచుకునేవి. ఇంటిపెద్దగా కుటుంబం మంచీ చెడు చూసినట్లే, పత్రికలు కూడా సమాజమే కుటుంబంగా భావించి ఆయా కాలాల ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు దీటుగా నడుచుకునేవి. అందుకే బ్రిటిషు వాడిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టడంలో పత్రికలు కీలక భూమికను నిర్వర్తించాయి. సమాజంలో మూఢనమ్మకాలను, దురాచారాలను తరిమికొట్టి చైతన్యం కలిగించడంలోనూ ముందు నిలిచాయి.
ప్రజలకు ఉత్తమ అభిరుచులు, అభిలాషలు కలిగించి, సంస్కారాన్ని, సమున్నత వ్యక్తిత్వాన్ని చేకూర్చేందుకు సాహిత్యాన్ని పత్రికలు విరివిగా ప్రచురించేవి.
నాటి పత్రికలు విశాల ప్రజాహితమే శిరోధార్యంగా దీక్షబూనాయి. నిన్నటిదాకా పదుగురి మంచిని కోరుకున్న పెద్ద ముత్తయిదువు కాలంతోపాటు మారి గడసరి అత్తగా మారింది. పత్రికలు కూడా గడసరి అత్తలా మారిపోయాయి. అత్తగారు నోరు పెట్టుకుని కోడళ్ల మీద దాష్టీకం చేసినట్లే, ఈ కాలం పత్రికలు ప్రత్యర్థులను ఆడిపోసుకుంటున్నాయి. ఉచ్ఛం నీచం మరిచి దుమ్మెత్తి పోస్తున్నాయి.
టీవీల రాకతో..
కోడలిగా ఇంట కాలుమోపి కాలం గడిచే కొద్దీ కుటుంబ పెత్తనమంతా చేతుల్లోకి తీసుకుని అత్తగారిని కట్టడిలో పెట్టినట్టే, టీవీలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్ వార్తలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముసలి అత్తగారు మోకాళ్ల నొప్పులతో చకచకా ఇంటిపనులు చక్కబెట్టలేనట్లే టీవీ వార్తల కవరేజీ ముందు పత్రికలు వెనకబడిపోయాయి. సంప్రదాయ కట్టుబొట్టుకు భిన్నంగా లేటెస్ట్ వస్త్రధారణలతో కోడలు చలాకీగా మెలగినట్టే ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో జెట్‌స్పీడ్‌తో అందిస్తున్నాయి.
అత్తగారి పద్ధతులు కోడలు పిల్లకు పాత చింతకాయ పచ్చడిలా సరిపడనట్లే పత్రికలు ఒకప్పుడు పాటించిన ప్రమాణాలను మార్గదర్శకాలను విలువలను టీవీలు కాలరాసి సంచలనాలతో, వివాదాస్పద విషయాల వాడీవేడీ డిబేట్లతో రేటింగ్స్ కోసం పరుగులు తీస్తున్నాయి.
యూట్యూబ్ ఛానళ్లు
యూట్యూబ్ ఛానళ్లు వచ్చాక మీడియా సీన్ పూర్తిగా మారిపోయింది. ఎంత ఎక్కువ మందిని ఆకట్టు కోవాలి? ఎన్ని వేల వ్యూస్ సాధించాలి అన్నదే యూట్యూబ్ చానళ్ల నిర్వాహకుల ఏకైక లక్ష్యమైంది. యూట్యూబ్‌లో కూడా వార్తా విశ్లేషణలను, వార్తలను అందించే ఛానళ్లు ఉన్నాయి. అలాగే వివిధ ఆసక్తులు, అభిరుచులకు తగ్గట్లుగా వంటలు, సంగీతం, ఆధ్యాత్మికం వంటి విషయాలకే పరిమితమై కూడా యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నారు.
వ్యూస్ బాగా ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌ను యూట్యూబ్ నిర్వాహకులు పోస్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ బతికి బట్టకట్టాలంటే వలువలను జారవిడిచేయక తప్పదని కొందరు భావిస్తున్నారు. ఈ వెంపర్లాటలో ఎంతకైనా తెగించేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వారు థంబ్‌నెయిల్స్‌ను కట్టిపడేసేలా తయారు చేస్తున్నారు. కంటెంట్‌తో సంబంధం లేకుండా థంబ్‌నెయిల్స్‌లో శీర్షికలు ఇస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
వారకాంత వాకిట నిలిచి పైట జార్చి కన్నుగీటి కవ్విస్తే గానీ విటుడు ఆమె వలలో పడడు. నిష్ఠూరంగా, అభ్యంతరకరంగా కొందరికి తోచినా కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వారు కవ్విస్తూ, కన్నుగీటుతూ లోపలకు ఆహ్వానం పలకటానికి వారకాంతలా నానా కసరత్తులు చేస్తున్నారు.
కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వారి శీర్షికలు ఇలా ఉన్నాయి.
(1) ఉపాసన క్రిస్మస్ డ్రెస్ ఖరీదు తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
(2) బికినీలో సమంత.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ అక్కడేనా!?
(3) సుకుమార్! నగ్నంగా చూపించాలనుకున్నా..
(4) టీవీతో కలిపి ఇవి తింటే చాలా డేంజర్.. అవేంటంటే..?
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇంతకంటె శ్రుతిమించిన శీర్షికలూ రాస్తూ తమ సృజనాత్మకతకు ఎల్లలు లేవని నిరూపించుకుంటున్నారు కొందరు ఘనులు.
(1) ఆ హీరోయిన్ సైజెంతో తెలిసింది (హీరోయిన్ గారి చెప్పుల సైజు కొచ్చిన తిప్పలు)
(2) జగన్‌కు చేరువైన రకుల్ ప్రీత్ సింగ్ (హైదరాబాద్‌లో జగన్ ఇంటికి దగ్గరలో ఇల్లు కొనుక్కున్న నేరానికి రకుల్ ప్రీత్‌ను ఇలా బద్నాం చేయచూశారు)
వీక్షకులను మాయలో పడేయటానికి చేసే ఇలాంటి సర్కస్ ఫీట్లు ఎంతోకాలం సాగవు. శీర్షికల్లో చేస్తున్న గిమ్మిక్కులే కానీ కంటెంట్‌లో ఏమీ ఉండదన్న వాస్తవాన్ని వీక్షకులు గుర్తిస్తున్నారు.
వారకాంతలుగా ఉన్న యూట్యూబ్ ఛానళ్లు వరకాంతలుగా, వరాలిచ్చే పదుగురు మెచ్చే ఛానళ్లుగా ఎంత త్వరగా మళ్లితే అంత మంచిది.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం గురువు
Discussion about this post