జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది పన్నెండవది.
ఒకరోజు బూదరాజు రాధాకృష్ణ ఫోను చేశారు.
‘‘నేను ఈనాడు జర్నలిజం స్కూల్ బాధ్యతలనుంచి తప్పుకున్నాను. నాదగ్గరున్న ఈనాడు సమీక్షలను పట్టుకెళ్లు. ఎకడమిక్ లైనులో ఉన్నావు కనుక నీకు ఉపయోగపడతాయి’’ అని చెప్పారు.
అంతకంటె భాగ్యమా! సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ఫోను పెట్టేశాను. ఫోను పెట్టిన మరుక్షణమే నాకో ఆలోచన మెరిసింది.
ఈనాడు సమీక్షల్లో బూదరాజు వారు ఈనాడులో దొర్లిన తప్పులను ఉదహరిస్తూ జర్నలిస్టులకు పనికివచ్చే వ్యాసాలను క్రమం తప్పకుండా రాస్తూ వచ్చారు. ఆ వ్యాసాలను మీడియా హౌస్ పబ్లికేషన్స్ తరపున ప్రచురిస్తే అన్ని పత్రికల్లోని జర్నలిస్టులకు ఉపయోగపడతాయని అనిపించింది. వెంటనే ఫోనుచేసి బూదరాజు వారికి ఈ ప్రతిపాదన చెప్పాను.
‘‘నీఇష్టం. అలాగే కానీ..’ అంటూ లైన్ క్లియర్ చేశారు బూదరాజు.
సమీక్షల్లో రాసిన మొదటి వ్యాసం శీర్షిక- జర్నలిస్టు కావాలంటే.. దానికి ముందు ‘మంచి’ అనే విశేషణాన్ని చేర్చి పుస్తకం పేరు పెడదామని అంటే అంగీకరించారు. ఇలా రెండువేల సంవత్సరంలో ‘మంచి జర్నలిస్టు కావాలంటే..’ పుస్తకం ప్రచురితమైంది.
ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్, బూదరాజు వారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కవర్ మీద బొమ్మ గీసి, కలర్ సూచనలు కూడా చేసి ఇచ్చారు. శ్రీధర్ సూచించిన రంగులోనే కవర్‌ను ప్రింట్ చేయమని బూదరాజు చెప్పారు. కవర్ విషయంలో ఆ కవర్ డిజైన్ చేసిన ఆర్టిస్టు సూచనలను రవ్వంత జవదాటనిచ్చేవారు కాదు బూదరాజు. ఆయన చెప్పినట్లే శ్రీధర్ సూచించిన నీలంరంగు లోనే ఈ పుస్తకం కవర్ ప్రింటయింది.
మంచి జర్నలిస్టు కావాలంటే.. పుస్తకంలో రెండు మాటలు శీర్షికతో రాసిన పరిచయ వాక్యాల్లో బూదరాజు ఇలా పేర్కొన్నారు:
‘‘1991 నుంచి 1999 ఆగస్టు దాకా జర్నలిజం బోధిస్తూ సమీక్షలు రాస్తూ వచ్చాను. ఆ వ్యాసాలు పత్రికా రచనా పద్ధతులు నేర్చుకోదలచిన విద్యార్థులకు కొంతవరకయినా తోడ్పడగలవని ఆకాంక్షించాను. వాటిలో ప్రదర్శించిన, సవరించిన తప్పులు కేవలం ఆ పత్రికలోనే ఉన్నవి కావు. తెలుగు పత్రికలన్నింటిలో కనిపించే సాధారణ దోషాలే. ఈనాడు జర్నలిజం విద్యార్థుల కోసం రాసిన పాఠాలు నాకు తెలియకుండానే ఇతర సంస్థలకు చేరాయి. ఆ విషయం తెలిసిన తరువాత వాటిని గ్రంథరూపంలో పెట్టి పాత్రికేయ ప్రపంచానికి బహిరంగపరిచాను. ఈ వ్యాసాలను అదే దృష్టితో వెలువరిస్తున్నాను.’’
ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ సంపాదకులు కోటంరాజు రామారావుకు అంకితమిచ్చారు. చీరాలలో కోటంరాజు వారితో బూదరాజుకు పరిచయం ఏర్పడింది. థామ్సన్ ఫౌండేషన్ వారు రూపొందించిన ది న్యూస్ మిషన్ పుస్తకాన్ని కోటంరాజు రామారావు, బూదరాజుకు బహూకరించారు. ఈ పుస్తకం మూడు దశాబ్దాల తర్వాత ఈనాడు జర్నలిజం స్కూలులో ఆయనకు ఎంతో ఉపకరించింది. ‘నా భావిజీవిత విధానాన్ని కోటంరాజువారు నిర్దేశించినట్లనిపించిందని బూదరాజు పేర్కొన్నారు. ఆ కృతజ్ఞతా సూచనగానే కోటంరాజు రామారావుకు ఈ పుస్తకాన్ని అంకితం చేశారు.
కొసమెరుపు :
బూదరాజు రాధాకృష్ణ అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా దశాబ్దాలపాటు కృషి చేసి అనేక ప్రామాణిక గ్రంథాలను రచించారు. బూదరాజుకు ప్రత్యేకంగా అభిమాన పాఠక శ్రేణికూడా ఉంది. ఆయన రాసిన ఏ పుస్తకమైనా బాగానే అమ్ముడవుతుంది. పైగా ఒకప్పుడు మీడియాపై రాసిన పుస్తకాలకు మంచి డిమాండ్ ఉండేది. ఆరకంగా ఈ పుస్తకం పాఠకాదరణ పొందింది.
రానురానూ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మీడియాపై వచ్చే పుస్తకాలను ఈ కాలపు కుర్ర జర్నలిస్టులెవరూ చదవటానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు.
పత్రికా రచన అనేది నైపుణ్యంతో కూడిన వృత్తి అనీ, ఈ రంగంలో రాణించాలంటే నిరంతరం నైపుణ్యాలను సానబెట్టుకుంటూ ఉండాలని, అధ్యయనం అందుకు చక్కటి సాధనమనే భావన ఈతరం జర్నలిస్టుల్లో ఏ కోశానా కనపడదు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
జర్నలిజం వృత్తిలో పైకి ఎదగటానికి రచనా నైపుణ్యాలు, మెళకువలు అవసరం లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు.
ఎవరిని ఎలా కాకా పట్టాలి, ఎలా ప్రసన్నం చేసుకుని పైకి ఎదగాలి, ఎలా గ్రూపు రాజకీయాలు నడపాలి- ఇవే కుర్ర జర్నలిస్టుల సక్సెస్ మంత్రాలు.
అక్షరమ్ముక్క రాయలేని వారుకూడా జర్నలిస్టులుగా ఎగబాకి వస్తున్నందున వారు ఎంచుకున్న మార్గమే శరణ్యమేమోననిపిస్తోంది.
జర్నలిజంలో ఇదొక విషాదపర్వం.
– డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం గురువు
Discussion about this post