జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది తొమ్మిదవది.
రాంభట్ల కృష్ణమూర్తి జగమెరిగిన జర్నలిస్టు. పత్రికలలో కొత్త ఒరవడులు తెచ్చిన ఈనాడు జర్నలిజం స్కూలు స్థాపించినప్పుడు దానికి ప్రిన్సిపాల్. బడికెళ్లి నేర్చుకున్న చదువు లేకపోయినా.. పుస్తకాలను- సమాజాన్ని జమిలిగా చదివి తనలోనికి ఇంకించుకున్న జ్ఞానం ఆయన సొంతం. ఆయన జీవితానుభవాల సంకలనమే.. ఈ ‘సొంత కథ’.
ఫోటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని హైదరాబాద్ బర్కత్ పురలోని శివశక్తి అపార్ట్‌మెంట్స్‌కు వెళ్లాను. రాంభట్ల కృష్ణమూర్తి అందులోనే ఉండేవారు.
‘‘మీ ఆటోబయోగ్రఫీ సొంతకథ కవర్ పై మీ ఫోటోనే వాడదాం. అందుకే ప్రత్యేకంగా ఫోటో తీయించడం కోసం ఫోటోగ్రాఫర్ ను వెంటబెట్టుకుని వచ్చాను’’ అని చెప్పాను.
‘మీ ఒంటిమీదున్న ప్లెయిన్ షర్టుకంటె మరింకేదైనా కలర్ ఫుల్ షర్ట్ వేసుకుంటే బావుంటుంది’ అని చెప్తే వెంటనే లోపలికి వెళ్లి ఇంకా ప్యాక్ కూడా విప్పని గళ్ల షర్ట్ తెచ్చి – ‘ఇది మా అబ్బాయి పంపాడు’ అన్నారు.
అలా చెప్తూ ఆ చొక్కా వేసుకుని రావటమూ ఫోటో సెషన్ పూర్తి చేయటమూ జరిగింది.
రాంభట్ల కృష్ణమూర్తి ఆత్మకథను ‘సొంతకథ’ పేరుతో రాశారు. అలాగే బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ ‘విన్నంత కన్నంత’. ఈ రెండు ఆత్మకథలను నేను ప్రచురించటం ద్వారా నా ప్రచురణ సంస్థ స్థాయిని పెంచగలిగానని చెప్పుకోవాలి. ఎన్ని పుస్తకాలు ప్రచురించామని కాదు, వాసిగల పుస్తకాలు, పదికాలాలపాటు నిలిచే పుస్తకాలు ఎన్ని ప్రచురించామన్నది ముఖ్యం.
రాంభట్ల కృష్ణమూర్తి ఈనాడు జర్నలిజం స్కూల్ లో మాకు ప్రిన్సిపల్ గా ఉండేవారు. రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) మా అధ్యాపకులు. సాయంత్రం వేళల్లో రాంభట్ల హుషారుగా క్లాసులోకి ప్రవేశించి అప్పటికి తోచిన కబుర్లేవో చెప్పేవారు. వాటిలో విధిగా గురజాడవారి కన్యాశుల్కం ప్రస్తావన కూడా ఉండేది.
రాంభట్ల కృష్ణమూర్తి అమలాపురం దగ్గరలోని అనాతవరం అగ్రహారంలో 1920 మార్చి 24న జన్మించారు. స్కూలుకు వెళ్లి చదువుకున్నదేమీ లేదు. గ్రంథాలయాలనే పాఠశాలగా చేసుకుని చదివారు. మీజాన్, విశాలాంధ్ర, ఈనాడు పత్రికల్లో పనిచేశారు. తెలుగులో పొలిటికల్ కార్టూనింగ్‌కు రాంభట్ల శ్రీకారం చుట్టారు.
రాంభట్ల 81వ పుట్టినరోజు కానుకగా 2001లో సొంతకథను ప్రచురించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే ఇరవై ఏళ్లు గడిచిపోయాయని అనిపిస్తుంది. 2020లో అభ్యుదయ రచయితల సంఘంవారు రాంభట్ల శతజయంతిని నిర్వహించారు. ఆయన రాసిన పుస్తకాల్లో కొన్నింటిని రీప్రింట్ చేశారు. నేను ప్రచురించిన సొంతకథను కూడా రీప్రింట్ చేస్తామని ఆర్.వి.రామారావు అడిగారు. నేను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. సొంతకథ అరసం ఆధ్వర్యంలో రీప్రింట్ కానుంది.
కమ్యూనిస్ట్ ఉద్యమాలతో మమేకమై గడిపిన రాంభట్ల కృష్ణమూర్తి ‘ఆత్మకథ’ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు. పుస్తకం ప్రచురించి ఇరవై ఏళ్లు అయినా ఇంకా కొన్ని కాపీలు మిగిలే ఉన్నాయి. బహుశ పాతతరం వారికి తప్పించి యువతరానికి రాంభట్ల ఎవరో తెలియకపోవటం ఒక కారణమై ఉంటుంది.
రాంభట్ల ఈ ఆత్మకథను బాల్యంతో మొదలిడి జీవిత ప్రధాన ఘట్టాలను, తన సాహితీ కార్యకలాపాలను ఆసక్తిగా చదివించేలా 26 చాప్టర్లలో రాశారు. ఈనాడు సమ్మె అధ్యాయంలో పేర్కొన్న కొన్ని విషయాలు వివాదాస్పదమయ్యాయి. ఎం.రాజేంద్ర సూచనతో తెలుగు ఇండియా టుడేలో రాంభట్ల ఇంటర్య్వూను పుస్తక నేపథ్యంలో చేసి ప్రచురించారు.
చలసాని ప్రసాదరావు తన గురించి రాసిన కొన్ని విషయాలపై అభ్యంతరం ప్రకటించారు. తాను విశాలాంధ్ర పత్రికలో తొలినాళ్లలో బాయ్ గా పనిచేశానని రాంభట్ల రాసిన విషయం సత్యదూరమని నాకు చలసాని లేఖ పంపారు. దాన్ని రాంభట్ల దృష్టికి తేగా, నాకు గుర్తున్నంత వరకూ రాశానని, ఇప్పుడా విషయాలను తవ్వి తీయలేనని చెప్పారు.
సొంతకథలో తృణజలూకాన్యాయం అనే శీర్షికతో ఒక అధ్యాయం రాశారు. పుస్తకం చేతిలోకి తీసుకోగానే ఆ చాప్టర్ గుర్తుకు వస్తుంది. తృణమంటే గడ్డి, జలూకమంటే జలగ. తృణజలూకం నెత్తురు పీల్చదు. నీటి జలగ మాదిరే తృణజలూకం కూడా శరీరాన్ని సాగదీస్తుంది. ఒక గడ్డిపరకమీద నిలిచి శరీరాన్ని సాగదీసి ముందున్న పరకను అందుకుంటుంది. ఇలా దాని ప్రయాణం సాగుతుంది. తన విద్యార్జనకూడా తృణజలూకాన్యాయ పద్ధతిలో జరిగిందని అంటారు రాంభట్ల. తలకు తగిలిన విషయాన్ని తెలుసుకునేదాకా ఆరాటం. తెలుసుకున్న తరవాత తృణజలూకంలాగా మరో విషయంపై అధ్యయనం సాగించినట్లు రాంభట్ల పేర్కొన్నారు.
తృణజలూకాన్యాయాన్ని తన అధ్యయన కోణంలో వివరించినా దాన్ని పలు ఇతర అంశాలకూ అన్వయించుకోవచ్చని అన్పిస్తుంది. గతాన్ని వదిలి ముందుకు సాగాలి అనే జీవన దృక్పథం అందులో ఇమిడి ఉంది. నిరంతర పరిశ్రమకూ ఆ గడ్డి జలగ సంకేతం.
ఈ పుస్తకానికి సంబంధించి పబ్లిషర్‌గా ఇప్పటికీ పశ్చాత్తాపపడే విషయం ఒకటి ఉంది. పేజీల నిడివి పెరిగిపోతోందని, పేజీల సంఖ్య పెరిగితే పుస్తకం ధర కూడా ఎక్కువగా నిర్ణయించాల్సి వస్తుందని చెప్పి, చిన్న సైజు ఫాంట్లో ముద్రించాను. ఆ రూపేణా ఒక ముఫ్పై పేజీలను కుదించగలిగాను. చివరలో 8పేజీలలో ఫోటోలను ప్రత్యేకంగా అందించాను. 228 పేజీల ఈ పుస్తకాన్ని రూ.80కి అందించాను. ఆ తర్వాత మాత్రం ఈ పొరబాటు మరే పుస్తకం విషయంలో దొర్లకుండా జాగ్రత్త పడ్డాను. పాఠకులు కంటికి ప్రయాస లేకుండా చదువుకునేలా పుస్తకాలు ఉండాలి.
రాంభట్ల కృష్ణమూర్తి కన్నుమూశారనే విషాదవార్త తెలియగానే ఆయనతో సన్నిహితంగా మెలిగిన మోటూరి వెంకటేశ్వరరావుకు ఫోను చేసి చెప్పాను. ఇద్దరం కలిసి రాంభట్ల ఇంటికి వెళ్లాం. నిర్జీవంగా ఉన్న రాంభట్లను చూసి మోటూరి దుఃఖం ఆపుకోలేకపోయారు.
సొంత కథలో ప్రచురించిన ఫోటో సెక్షన్ కాపీలు కొన్ని మిగిలితే వాటిని తీసుకెళ్లి విజిటర్స్ బుక్ దగ్గర ఉంచాను. ఆసక్తి ఉన్నవారు వాటిని తీసుకెళ్లారు.
సొంతకథ తర్వాత మరో స్ర్కిప్టును ఇచ్చారు. వివిధ కులాలకు సంబంధించిన విశ్లేషణాత్మక రచన. అయితే ఎంత ప్రయత్నించినా ఆసక్తిగా ముందుకు వెళ్లటం లేదాస్ర్కిప్టు. నా అంచనా సరికాదేమోనని కాకాని చక్రపాణికిచ్చి అభిప్రాయం అడిగాను. ఆయనా అదే మాట చెప్పడంతో స్ర్కిప్టు తిరిగి ఇచ్చాను.
..డాక్టర్ గోవిందరాజు చక్రధర్.
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం గురువు
Discussion about this post