దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం అనూహ్యంగా పెరుగుతున్నదని అనుకుంటున్న నేపథ్యంలో.. ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి తేవడానికి రిజర్వ్ బ్యాంకు సన్నాహాలు చేస్తున్నట్లుగా కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. పాలిమర్, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కరెన్సీని వినియోగంలోకి తెస్తారని అంటున్నారు అయితే దేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపా సర్కారు రాజ్యమేలడం ప్రారంభమైన తర్వాత అనూహ్యంగా అనేక విభాగాలలో ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకున్న అపర కుబేరుడు గా అదానీ ముద్రపడ్డారు. మోడి, అమిత్ షా ద్వయం ప్రతి వ్యవహారంలోనూ అధా నీకే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు సరికొత్త సంకల్పం కూడా ఆదానికి లబ్ధి చేకూర్చడానికి అనే విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. అదా నీకు చెందిన పాలిమర్స్ కంపెనీకి కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చే ఆలోచనతోనే ప్లాస్టిక్ కరెన్సీ అనే మాయాపూరితమైన ముసుగులో కేంద్రం ఈ కసరత్తు ప్రారంభించిందనే నిందలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నిందలు నిజం కాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట అనూహ్యంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్లాస్టిక్ నోట్ల తయారీ విషయంలో కొన్ని అంశాలు గమనించాలి. ఇందుకోసం సాధారణ ప్లాస్టిక్ కాకుండా Bi-axially Oriented Polypropylene అనే పాలిమర్ ఫిల్మ్‌లను వాడుతారు. ఇదే పలువురి అనుమానాలకు కారణం. అదానీ గుజరాత్‌లోని ముంద్రా వద్ద ‘ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్’ పేరుతో 2021 లో అతిపెద్ద పీవీసీ, పాలిమర్ ప్లాంట్‌ను రిజిస్టర్ చేయించారు. దాదాపు రూ.35వేల కోట్లతో నిర్మించే ప్రతిపాదన ఇది. పాలిమర్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికే ఈ పాక్టరీ పెడుతున్నారనే అనుమానం పలువురిలో మొదలైంది.
మన దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పాలిమర్ డిమాండ్ కంటే చాలా తక్కువ. అందువల్లే అదానీ ఇంత పెద్ద ప్లాంట్ ప్లాన్ చేసినట్టుగా అంటున్నారు. పైగా దానికి పర్యావరణ అనుమతులన్నీ వేగంగా వచ్చేశాయి. బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.14వేల కోట్లు మంజూరైనట్టు సోషల్ మీడియా చెబుతోంది. గతంలో విమానాశ్రయాలు, పోర్టులు, కోల్, సోలార్ కాంట్రాక్టులు కట్టబెట్టినట్టే.. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రతిపాదన కేవలం అదానీ పాలిమర్ వ్యాపారంకోసమేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ ప్లాస్టిక్ నోట్ల నిర్ణయం పార్లమెంటులో చర్చ లేకుండానే కేవలం రెండు ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లోనే క్లియర్ కావడం కూడా ఎత్తిచూపిస్తున్నారు. అయితే ఒక విషయం కీలకంగా గమనించాలి. సోషల్ మీడియా రకరకాల నిందలు వేసినంత మాత్రాన అన్నీ నిజం కావాలని రూలు లేదు. అక్కడ కనిపించే ఆధారాలు కూడా ఫ్యాబ్రికేటెడ్ అయిఉండే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ నిజమేమిటో నిలకడ మీద తేలుతుంది. కొన్నాళ్ల తర్వాత అయినా సరే.. ప్లాస్టిక్ కరెన్సీ తయారీ మొదలయ్యే నాటికి.. అదానీ కంపెనీల పాత్ర ఎంతో స్పష్టమౌతుంది. ఈ ఆరోపణల్లో సగం నిజం ఉన్నా కూడా.. అదానీకి దోచిపెట్టడం కోసం మాత్రమే మోడీ సర్కారు రాజ్యమేలుతున్నదనే నిందలను ప్రజలు నమ్ముతారు. ఈ నిందలు నిజం కాకపోతే మాత్రం.. మోడీ ప్రతిష్ఠ చెప్పుకోదగ్గంతగా పెరుగుతుందని గుర్తించాలి.
..కృష్ణమోహన్ దాసరి,
సీనియర్ పాత్రికేయుడు, డల్లాస్

.
Discussion about this post