ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనునిత్యం పునరధికారం కోసం తపిస్తూ ఉంటారు. తదనుగుణమైన వ్యూహరచనలోనే నిమగ్నమై ఉంటారు. కానీ.. మళ్లీ తన చేతికి అధికారం రావాలంటే.. ప్రజల కోసం పరితపించే, ప్రజల పక్షాన నిరంతరాయంగా పనిచేస్తూ ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలి. అలాంటి గుర్తింపు ఆయనకు కొత్త అభిమానుల్ని కూడా తయరుాచేస్తుంది. అలా చేయకుండా.. ఇంకా, ప్రజల్లో తన మీద సానుభూతిని విత్తడం ద్వారా మాత్రమే మళ్లీ అధికారంలోకి రాగలనని ఆయన అనుకుంటే.. ఆ పాచిక పారదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును హంతకుడిగా, హత్యలను ప్రోత్సహించిన వాడిగా ప్రొజెక్టు చేసేందుకు జగన్ పడుతున్న తపన, చేస్తున్న ప్రయత్నంలో అర్థం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన ఒకటిన్నర దశాబ్దం తర్వాత కూడా చిత్ర విచిత్రమైన కొత్త వాదనలను తెరమీదకు తీసుకురావడం ద్వారా.. వైఎస్ జగన్, కొత్తగా ఎవరినీ మభ్యపెట్టడం సాధ్యం కాదు! ఈ విషయం ఆయనకు- ఆయన వ్యూహకర్తలకు తప్ప అందరికీ అర్థమయ్యేదే!
వైఎస్ఆర్ కాంగ్రెస్ ను గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ అధికార కూటమి చాలా దూకుడు ప్రదర్శిస్తోంది. అభివృద్ధి పనులకు అడ్డు పడుతున్నారంటూ.. పాలక పక్షపు పెద్దలనుంచి ఆ పార్టీని ఇదే పదంతో వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి ఆ పార్టీ అధినేతగా వైఎస్ జగన్ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. తన పార్టీ మీద పడుతున్న నింద గురించి, అందులో అసంబద్ధత ఉందని ఆయనకు అనిపిస్తే దాని గురించి ఆయన చెప్పుకోవాలి. ప్రజలను నమ్మించాలి. కానీ.. జగన్ భిన్నంగా.. చంద్రబాబునాయుడునే హత్యారాజకీయాలు చేసే వ్యక్తిగా ప్రొజెక్టు చేయడానికి ఆరాటపడ్డారు. అందుకు ఆయన చరిత్ర పుటల్లోకి దశాబ్దాల వెనక్కు వెళ్లారు. ప్రధానంగా తన కుటుంబంలోని మూడు హత్యలను ప్రస్తావించి.. ఏ ఒక్క ఆరోపణను కూడా తటస్థ ప్రజలు నమ్మలేని పరిస్థితిని కల్పించుకున్నారు.
జగన్ ది అసంబద్ధ వాదన!
వైఎస్ కుటుంబం రాజకీయ నేపథ్యం తెలిసిన అందరికీ కూడా వైఎస్ రాజారెడ్డి పేరు చిరపరిచితమే. రాజారెడ్డి హత్యకు గురై దశాబ్దాలు గడిచాయి. అయినా సరే.. జగన్ పాలన కాలంలో.. ఆయన విధానాలను రాజారెడ్డి రాజ్యాంగంలోని అంశాలుగా ఎద్దేవా చేయడం ద్వారా.. అప్పటి విపక్షాలు రాజారెడ్డి గురించి నవతరం కుర్రకారుకు కూడా అవగాహన కల్పించారు. రాజారెడ్డి జీవితంలో ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆ ఫ్యాక్షన్ ధోరణులకు దూరంగా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకో తరహా రాజకీయ ప్రస్థానం సాగించినట్టు కూడా చెబుతుంటారు. రాజారెడ్డి కేవలం ఫ్యాక్షన్ ప్రతీకారాల నేపథ్యంలోనే హత్యకు గురయ్యారు. ఈ విషయం రాష్ట్రంలో రాజారెడ్డి పేరు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ హత్యలో చంద్రబాబు పాత్ర ఉన్నట్టుగా ఇన్నేళ్ల తర్వాత జగన్ కొత్త పాట పాడితే ఎవరు నమ్ముతారు?
రాజారెడ్డి హత్య తర్వాత మళ్లీ ప్రతీకార దాడులు జరగలేదంటే.. ఆ ఘనత- తన తండ్రి హత్యతో ఆ ఫ్యాక్షన్ లను ముగించాలని అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుంది గానీ.. అది తన మంచితనమే అని ఇప్పుడు జగన్ చెప్పుకుంటే ఎలా కుదురుతుంది. రాజారెడ్డి హత్య మరకలను చంద్రబాబు చేతికి పులమడానికి జగన్ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయింది. పేర్ల పార్థసారధి రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. జగన్ మాటల్ని ఖండిస్తూ తన మీద జరిగిన హత్యాప్రయత్నానికి ప్రతీకారంగానే.. తన అనుచరులే రాజారెడ్డిని హత్య చేశారని స్వయంగా చెప్పుకున్నారు. ఈ ప్రకటన చంద్రబాబును మరింత నిష్కళంకుడిగా ప్రజల ముందు నిలబెట్టింది. మరి జగన్ వేసిన నింద సాధించిందేమిటి?
వైఎస్ఆర్ హత్య విషయంలో..
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం విషయంలో జగన్ అనేకసార్లు అవకాశవాద ధోరణిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. తనకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా కారణాల్ని చెబుతుంటారు. రిలయన్స్ వారే వైఎస్ ను హత్య చేయించారనే ఆరోపణతో రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థలమీద తన అభిమానులతో దాడులు చేయించిన జగన్.. తన చేతికి అధికారం రాగానే.. రిలయన్స్ ఎదుట సాగిలపడ్డారు. తన మనుషులతో ప్రత్యేకంగా గూఢచర్యపనులు చేయించి మరీ రిలయన్స్ హత్య చేయించినట్టుగా అప్పట్లో జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతుంటారు. కానీ.. అధికారం దక్కాక.. ఆ పగ మొత్తం పక్కకు పోయింది. రిలయన్స్ వారి రిక్వెస్టు వంటి డీల్ లను శిరసావహిస్తూ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ పదవి కట్టబెట్టారు. తీరా ఇప్పుడు.. వైఎస్ మరణం .. చంద్రబాబు చేయించిన హత్య అన్నట్టుగా రంగు పులుముతున్నారు.
ఇన్నేళ్లలో వినిపించని కొత్త వాదన ఇది. వైఎస్ మరణం ద్వారా సానుభూతిని ఇంకా జగన్ ఆశిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. కానీ, అందుకు చేస్తున్న ప్రయత్నమే సహేతుకంగా లేదు. ‘సభలో ఎలా అడుగుపెడతావో చూస్తా’ అని చంద్రబాబు అన్నారట. ఆ తర్వాత వైఎస్ మరణించారట. అందుచేత చంద్రబాబే హత్య చేయించినట్టు చాటే ప్రయత్నం కామెడీగా ఉంది.
ప్రతికూల వాతావరణాన్ని ఖాతరు చేయకుండా.. వైఎస్ సాహసించి హెలికాప్టర్ లో ప్రయాణించారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన మరణానికి కారణం కేవలం ప్రకృతి విపత్తు. ఎవ్వరూ కాదనలేని ఈ విషయంలో గతంలో పసలేని ఆరోపణలతో నవ్వులపాలు అయిన జగన్.. మరోమారు అదే పని చేశారు.
వివేకా హత్యను కూడానా..
తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాను అంటూ.. చావుల విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ వివేకాను తన ఆత్మీయుడిగా చాటుకుంటున్నారు. వివేకాను రాజకీయంగా సోపానంగా వాడుకుని, ఆ తర్వాత కూడా ఆయనను లూప్ లైన్లో పెట్టి క్షోభకు గురిచేసింది జగనే. వివేకాహత్య ఎవరు చేశారనేది సీబీఐ, న్యాయస్థానాలు తేల్చకపోయినా.. రాష్ట్ర ప్రజలందరూ కరెక్టుగానే అర్థం చేసుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నారు గనుక.. చంద్రబాబే ఆ హత్య వెనుక ఉన్నారని ఇప్పుడు జగన్ ఆరోపించడం అథమస్థాయి రాజకీయ ఆరోపణ.
జగన్, రూటుమార్చిన తన కొత్త నిందలతో కొత్తగా అభిమానుల్ని సృష్టించుకోలేరు. ఎటూ ఆయన వీరాభిమానులుగా ఉన్న వారు.. ఆయన ఏం చెబితే అదే సత్యం అంటూ.. దానినే పునఃప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది స్థిరమైన ఓటు బ్యాంకే. వారిని మళ్లీ మళ్లీ ఆకర్షించినా ఉపయోగం లేదు. తటస్థంగా ఉండే సమాజంలో.. కొత్త ఆలోచన పుట్టించగలిగితేనే.. జగన్ ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. కానీ.. అలా కొత్తగా ఒక్క వ్యక్తి కూడా నమ్మే అవకాశం లేనిరీతిలో జగన్ ఈ అసందర్భపు నిందలను ప్రచారంలో పెట్టారు. దీనివల్ల ఆయన సాధించేది సున్నా. ఈ సత్యం అర్థం చేసుకుంటే జగన్ ముందు ముందు అయినా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగగలరు.
.