రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి అని తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నేతలు ఆరోపించారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మైనార్టీ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై రోజు రోజుకూ దాడులు పెరిగి పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కూడా కాల రాస్తోందని వారు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఆగడాలకు చివరకు పాఠశాల విద్యార్థులు కూడా బలి కావాల్సి వస్తోందన్నారు.
పలమనేరు పట్టణంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. పలమనేరు పట్టణానికి చెందిన నసీర్ అహ్మద్, నసీమా అనే నిరుపేద దంపతుల కుమార్తె మిస్బా అనే విద్యార్థిని స్థానికంగా బ్రహ్మశ్రీ అనే పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఉండేదన్నారు. అదే పాఠశాలలో పలమనేరు పట్టణానికే చెందిన ఓ వైసీపీ నేత కుమార్తె కూడా చదువుతోందన్నారు.
మిస్బా తరగతిలో మొదటి ర్యాంకులో ఉండటంతో… వైసీపీ నేత కుమార్తె ఓర్చకోలేక పోయిందన్నారు. మిస్బా ఇదే పాఠశాలలో ఉంటే త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో తనకు మొదటి ర్యాంకు రాదని భావించి.. పాఠశాల ప్రిన్సిపాల్ సాయంతో వేరే పాఠశాలకు వెళ్లే విధంగా చేశారన్నారు.
ఇందుకు మనోవేదనకు గురైన మిస్బా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ సమాజంలో పేదోళ్ల పిల్లలు బాగా చదవడం కూడా వైసీపీ వారు నేరంగా పరిగణిస్తున్నారని వారు ఆరోపించారు.
వైసీపీ నేత కుటుంబం కారణంగానే పలమనేరులో పదవ తరగతి విద్యార్థి మిస్బా ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆ భాలిక రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు మాయం చేయడం చూస్తుంటే అధికార పార్టీ నేతల తీరుపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
మిస్బా కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండు చేశారు. ఇటీవల నంద్యాలలో అబ్దుల్ సలాం చనిపోవడానికి కారణం కూడా అధికార పార్టీ వారే నన్నారు.
పలమనేరు ఘటనకు సంబంధించి బ్రహ్మశ్రీ పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్, వైసీపీ నేతను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండు చేశారు. లేదంటే మైనార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటరీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి జిలానీ బాషా, మాజీ మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యులు షాకీర్ అలీ, తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మస్తాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్మత్, సెక్రటరీ బషీర్, పట్టణ మైనారిటీ అధ్యక్షులు షఫీ, మీర్జా, 20వ వార్డు మీర్జా, ఐటీడీపీ పట్టణ కో-ఆర్డినేటర్ ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
.