జగన్మోహనరెడ్డి తాను సంస్కరణల ప్రభుత్వం నడుపుతానని సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలు అందరికీ అర్థమయ్యేలా అవినీతిని అన్ని దశల్లోనూ నిర్మూలిస్తానని, గతంలో జరిగిన అవినీతిని కూడా లెక్క తేలుస్తానని, అవకాశం ఉన్న ప్రతిచోటా చక్కదిద్దుతానని ఇలా మాట ఇచ్చారు. ప్రభుత్వంలోని వారు కూడా.. యావత్ పాలనను సంస్కరణలకు బాసటగా నడిపించి… ప్రజల ఆదరణ చూరగొనడమే తమ లక్ష్యమని ప్రెవేటు సంభాషణల్లో కూడా చెప్పుకుంటున్నారు. ఇదంతా ప్రజలు నమ్ముతున్న రీతిగానే జరిగితే అభినందనీయమే.
అయితే ప్రస్తుతానికి… జగన్మోహన రెడ్డి సంస్కరణలు అనుకుంటున్నవి… కూల్చివేతలతోనే ప్రారంభం అయ్యేలా కనిపిస్తోంది. కృష్ణానదీ తీరంలో నది పరిధిలోకి వచ్చే స్థలంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టడం ద్వారా జగన్… చాలా హెచ్చరికలు పంపుతున్నారు.
చంద్రబాబునాయుడు విజయవాడకు మకాం మార్చగానే.. కృష్ణా తీరంలో అక్రమకట్టడం ముద్రతో ఉన్న లింగమనేని భవనాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని లీజుకు తీసుకుని తన నివాసంగా మార్చుకున్నారు. ఎప్పటికైనా చిక్కు వస్తుందని అనుకున్నారేమో గానీ.. దాని పక్కనే ప్రజావేదిక రూపంలో ఒక భారీ భవంతిని ప్రభుత్వ పరంగా కట్టించారు. ప్రభుత్వాధినేత అధికార్లతో కీలక సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా భారీ స్థాయిలో దీనిని నిర్మించారు. దీని అంచనా వ్యయం నాలుగున్నర కోట్లయితే, పని పూర్తయ్యే సరికి ఏడున్నర కోట్లకు పైగా వెచ్చించారు. భవనం ప్రభుత్వానిదే అయినప్పటికీ.. దీని నిర్మాణానికి కూడా అవసరమైన అనుమతులేమీ లేవు!!
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే.. తన ఇంటి పక్కనే జగన్ పొడ ఎందుకని భావించారేమో.. ఆ ప్రజావేదికను నాకే ఇవ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వాధినేత నిర్వహించే సమావేశాల కోసం ఉద్దేశించిన భవనాన్ని తనకు కావాలంటూ అడగడం సబబు అని చంద్రబాబు ఎలా అనుకున్నారో మరి! ఇవ్వడం కాదు కదా… అక్రమ కట్టడం అయిన దానిని కూలగొట్టించడానికి జగన్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
ఈ ప్రభుత్వ భవనాన్ని కూలగొట్టించడం.. ప్రెవేటు దురాక్రమణ దారులకు అతిపెద్ద హెచ్చరిక. ఒక్కొక్కటిగా అవన్నీ కూడా కూల్చివేతలకు గురికావచ్చు. అందులో చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ‘నెక్ట్స్ కూల్చబోయేది చంద్రబాబు నివాసమే’ అంటూ మీడియా చానెళ్లు ఒకవైపు హోరెత్తిస్తున్నాయి. కోర్టుకు పరుగెత్తికెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చుకుంటే తప్ప… అమరావతిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు నిలువ నీడ కూడా కరవవుతుంది. ‘చంద్రబాబుకు ఇవ్వవలసి వస్తుంది గనుక.. కూల్చేస్తున్నారు’ అంటూ తెదేపా నేతలు అర్థం లేని రాద్ధాంతం చేస్తున్నారు. దానికి బదులుగా ‘ప్రభుత్వ సొమ్ము వెచ్చించి కట్టిన నిర్మాణం.. ప్రజోపయోగానికి వాడుకోకుండా.. కూల్చడం అవివేకం’ అనే వాదనతో వారు పోరాడినా కాస్తంత ప్రజల సానుభూతి దక్కుతుంది. ఆ ప్రజావేదికను చంద్రబాబుకు ‘ఇవ్వవలసి రావడం’ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ సంగతి ప్రజలకు తెలుస్తోంది గానీ.. తెదేపా నేతలకు అర్థం కావడం లేదు.
జగన్ సంస్కరణలకు ఈ కూల్చివేతలు శ్రీకారం కావచ్చు. కాకపోతే.. అన్ని సంస్కరణలూ ఇలా రాజకీయ ప్రత్యర్థుల ఫోకస్ సాగేవేనా? లేదా, ఇన్నాళ్లూ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిమార్చే దిశగా సాగేవా? అనేది ఎదురు చూడాల్సిఉంది. పాలన గాడితప్పి ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఎక్కడెక్కడ దాపురించిందో.. వాటిని తన సంస్కరణలతో సమర్థంగా చక్కదిద్దగలిగితే.. సమాజానికి హితం కలుగుతుంది.
.

Discussion about this post