పార్టీకి సంబంధించిన కీలక కార్యకర్తలు, చిత్తశుద్ధితో పార్టీకోసం పనిచేసే వారు మరణించినప్పుడు.. పార్టీ నాయకత్వం వారి కుటుంబానికి అండగా ఉండడమూ, ఆర్థిక సహాయం చేయడమూ చాలా మామూలు సంగతి. అన్ని పార్టీలూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటాయి. తద్వారా.. పార్టీ నాయకత్వం పట్ల కార్యకర్తల్లో ఒక ప్రేమ పెంపొందేలా చూస్తుంటాయి.
సాధారణంగా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు పార్టీ తరఫునుంచి లక్ష, రెండు లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరుగుతుంది. కానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ తీరే వేరు. కార్యకర్తలంటే.. తాను ఎంత ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారో.. ఆవిషయాన్ని జనసేనాని మరోమారు నిరూపించుకున్నారు.
ఇటీవల మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు మువ్వల ఈశ్వరరావు కుటుంబానికి ఏకంగా అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం బోయపాలెం గ్రామానికి చెందిన ఈశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తూ చనిపోయారు. వారి కుటుంబాన్ని జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం పరామర్శించారు.
ఈశ్వర రావు తల్లి అర్జునమ్మ, సోదరుడు సంతోష్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్కును అందచేశారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించింది. “పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ యోగ క్షేమాల గురించి ఆలోచించే మంచి మనసున్న నేత మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు” అని అన్నారు.
మధురవాడ దోబీ కాలనీలో కూడా..
భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ దోబీ కాలనీలోని పెంటతాడి త్రినాథ్ జనసేన క్రియాశీలక సభ్యులు. నిర్మాణ కూలీగా పని చేసే త్రినాథ్ ఇటీవల ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని కూడా మనోహర్ పరామర్శించారు. త్రినాథ్ తల్లి లక్ష్మమమ్మకు రూ.5 లక్షలు చెక్కు అందచేశారు.
కార్యకర్తల కోసం పార్టీలు బీమా చేసి.. వారి ప్రమాద మరణాల సమయంలో సొమ్ము అందజేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ.. ఆ బీమా కూడా ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా.. పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికోసం.. పెద్ద మొత్తాలకే పార్టీ బీమా ప్రీమియం చెల్లించి బీమా చేసినట్లయితే.. ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది. ఆ రకంగా పవన్ కల్యాణ్ చాలా ఘనంగా తన పెద్దమనసు చాటుకుంటున్నారు.
కార్యకర్తల పట్ల పవన్ చూపించే ఈ ప్రేమను ఇతర పార్టీల నాయకులు కూడా నేర్చుకోవాలి. తమ తమ కార్యకర్తలకోసం , వారిని ఆదుకోవడం కోసం దృష్టిపెట్టాలని అందరూ అనుకుంటున్నారు.
Discussion about this post