జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పోరాటంలోకి అడుగుపెట్టబోతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రెవేటీకరించడం అనేది.. తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఆలోచనే అయినప్పటికీ.. ప్రజాహితమే తన లక్ష్యంగా, ప్రజల ఆశలే తన పోరాటమార్గంగా భావించే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కుకోసం బరిలోకి దిగుతున్నారు.
విశాఖ ఉక్కు పోరాటానికి తొలినుంచి కూడా పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారు. అయితే కొన్ని వారాల కిందట.. పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ విశాఖలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కార్మికులకు ఒక హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ త్వరలోనే ఈ పోరాటంలోకి స్వయంగా హాజరు అవుతారని అన్నారు. అప్పటినుంచి బీజేపీ ఇష్టానికి వ్యతిరేకమే అయినా.. ప్రజలకోసం పవన్ పోరాటంలోకి వస్తారనే మాట వినిపిస్తోంది. తాజాగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించబోతున్న సభకు ఒక కీలక అతిథిగా పవన్ కల్యాణ్ హాజరు కాబోతున్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తమ పోరాటానికి అండగా ఉండాలని, సభలో పాల్గొనవలసిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులు వచ్చి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అక్టోబరు 31వ తేదీన పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్ళి పరిరక్షణ సమితి ప్రతినిధులను కలసి వారు నిర్వహించే సభలో పాల్గొంటారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఉక్కు పరిరక్షణ సమితి పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అంశంపై తొలిదశలోనే స్పందించిన పవన్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని కేంద్రానికి తెలియచేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు.
అంతే తప్ప.. విశాఖలో జరుగుతున్న ప్రత్యక్ష పోరాటంలోకి రాలేదు. ఇప్పుడు పోరాటసమితి నిర్వహిస్తున్న బహిరంగసభకు రావడం చూస్తోంటే.. ఆయన ఇక ప్రత్యక్ష కార్యచరణలోకి దిగుతున్నారని అర్థమవుతోంది. అయితే ఎంత దూరం ఆయన ఈ పోరాటానికి దన్నుగా నిలుస్తారో.. ప్రెవేటీకరణ పట్ల చాలా పట్టుదలగా ఉన్న కేంద్రలోని బీజేపీతో సబంధాలను పణంగా పెట్టగలరో లేదో వేచిచూడాలి.
Discussion about this post