తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 20వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఆలయంలో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఇందుకోసం సెప్టెంబరు 19వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబడవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
Discussion about this post