అసలే.. అనాదిగా భారతదేశం ఉత్తర- దక్షిణ ప్రాంతాల మధ్య వివక్ష ఉన్నదనే ప్రచారంతో సతమతం అవుతున్నది. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. ఆయన పరిపాలన.. ‘మనల్ని మరింత నీచంగా చూస్తున్నారు’ అనే భావనను దక్షిణాది వాసుల్లో పెంచుతోంది. ఆయన పాలన దేశాన్ని చాలా స్పష్టంగా రెండు ముక్కలు చేసేస్తున్నది అని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఈ దేశాన్ని మరిన్ని ముక్కలు చేయదలచుకున్నట్టుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక వ్యవహారం సాగింది.
నిజానికి తూర్పు ప్రాంతానికి మోడీ పెడుతున్న కిరీటం కాదు.. ఈ నిర్ణయం. పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ జమానాలో ప్రణబ్ ముఖర్జీ ఈ బాధ్యతలు చూశారు. ‘‘తూర్పు- గిరిజన’’ పదాల మీద మోడీకి అంత ప్రేమ, ఆయనలో నిజాయితీ ఉంటే.. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఒకరికి అవకాశం ఇచ్చి ఉన్నా బాగుండేది. కానీ అలా జరగలేదు. మొత్తానికి దేశాన్ని ఎక్కువ ముక్కలుగా చూస్తున్న నిర్ణయం ఇది.
స్వతంత్ర భారతం ఏర్పడిన నాటినుంచి ఉన్న సాంప్రదాయాన్ని ఎన్డీయే సర్కారు ఎందుకు తుంగలో తొక్కింది అనే అంశం మాత్రం.. తెలుగుజాతి కడుపు మండిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నిక సమయానికి అధికార పార్టీకే చెందిన ఉపరాష్ట్రపతి ఉన్నట్లయితే.. వారికే రాష్ట్రపతి పదవిని కట్టబెట్టడం ఆనవాయితీ, సాంప్రదాయం. ఎస్టీల మీద, తూర్పు ప్రాంతాల మీద అంత వల్లమాలిన ప్రేమ పొంగిపోతూ ఉంటే.. వారిని అదే ఉపరాష్ట్రపతి పదవిలోకి తీసుకువచ్చి ఉండొచ్చు. కానీ.. ఆయన ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారు.
మోడీ పెత్తందారీ పోకడలకు తలొగ్గని పార్టీ ప్రముఖుల్ని నెమ్మదిగా ఆయన పక్కకు తప్పిస్తున్నారనే వాదన చాలాకాలంగా ఉంది. ఆ క్రమంలోనే.. కేంద్ర మంత్రిగా ఎంతో చురుగ్గా క్రియాశీలంగా, స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునేంత దూకుడుగానూ వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడును అప్పట్లో ఉపరాష్ట్రపతి చేశారు. సాంప్రదాయం పాటిస్తూ.. ఆయననే ఇప్పుడు రాష్ట్రపతి చేస్తారని రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగుజాతి ఎదురుచూసింది. కానీ మోడీ వారి ఆశలను నీరుగార్చారు.
తెలుగురాష్ట్రాల మీద మోడీ తొలినుంచి కక్ష కట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారనడానికి ఇది మరొక ఉదాహరణ. విభజన నాటినుంచి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదగకుండా మోడీ సర్కారు ఎన్ని రకాల వంచనలకు పాల్పడుతున్నదో అందరికీ తెలుసు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా.. రాష్ట్ర ప్రగతికి మోకాలడ్డిన మోడీ రాజనీతి అందరికీ తెలుసు!
ఆ క్రమంలోనే వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాకుండా అడ్డం పడ్డారని ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. హైదరాబాదు కార్యక్రమంలో ఉన్న వెంకయ్యనాయుడును అర్జంటుగా ఢిల్లీ పిలిపించి.. దేశ ప్రజల్లో ఆయననే రాష్ట్రపతి చేయబోతున్నారనే భావన కలిగించి.. తీరా తుస్సుమనిపించారు. వెంకయ్యనాయుడు తెలుగుప్రాంతానికి చెందిన వ్యక్తి కావడమే ఆయనకు శాపమా! మోడీకి తెలుగు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎందుకంత కక్ష! ప్రత్యేకహోదా దక్కితే గనుక.. పారిశ్రామికీకరణ విపరీతంగా పెరిగి.. అతిపొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ర్టం కూడా కాబట్టి.. గుజరాత్ కంటె ప్రగతిలో ముందంజలోకి దూసుకుపోతుందని ఆయనకు అసూయా? అని అనుమానించే వారు ఇప్పుడు మోడీని మరింతగా దూషిస్తున్నారు.
వెంకయ్యనాయుడు తరహాలో స్వతంత్రించి వ్యవహరించే వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే.. తాను అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమర్థించక పోవచ్చుననే ఆలోచన కూడా ప్రధానిలో ఉండి ఉండవచ్చు. మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం అనేది.. తెలుగు జాతికి మోడీ చేసిన ఒక వ్యూహాత్మక ద్రోహంగానే చరిత్రలో మిగిలిపోతుంది.
.. కృష్ణమోహన్ దాసరి
డల్లాస్

.

Discussion about this post