శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం వేకువ జామున లింగోద్బవ దర్శనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందిసేవ ఆలస్యం కావడంతో ఈ ఏడాది బుధవారం వేకువజామున 3గంటల తరువాత పరమశివునికి శుద్ధి అభిషేకం చేశారు. ఆ తరువాత లింగోద్భవ అభిషేకం నిర్వహించారు.
ఈ అభిషేకం పూర్తయిన తరువాత సర్వదర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లింగోద్భవానికి మహాలఘు దర్శనం ఏర్పాటు చేశారు. మహాలఘు దర్శనం ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులు ఆనంద పరవశులయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లింగోద్భవ కాలంలో స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని భక్తులు ఆనంద పరవశులయ్యారు.
లింగోద్బవ దర్శనం ప్రశాంతంగా ముగియడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రేపు శివపార్వతుల కల్యాణం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 10గంటల తరువాత గజ వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు… సింహ వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బయలుదేరి పెండ్లిమండపం వద్దకు చేరుకుంటారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శుక్రవారం వేకువ జామున స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు.
కల్యాణం సందర్భంగా బాల్య వివాహాలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్వామి, అమ్మవార్ల కల్యాణం పురస్కరించుకుని గురువారం తిరుమల తిరుపతి దేస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
.

Discussion about this post