ఎందుకో కారణం తెలియదు… పుట్టినరోజులకుగాని, చావులకిగాని, పెళ్ళిళ్ళకుగాని, పేరంటాలకుగాని ఎక్కడికీ పోవడానికి మనస్సు అంగీకరించడంలేదు. మనస్సు, శరీరం నిశ్చింతను కోరుకుంటున్నాయి.
“ఏమున్నది మిత్రమా ఎక్కడికి పోయినా ఆ చెట్లే, ఆ గోడలే కదా ఉండేది. ఉన్నచోటునే ఉండిపోతే పోలా” అన్నాడు నాకు తెలిసిన మిత్రుడొకడు.
“నీవు వెళ్ళకపోతే ఆ కార్యక్రమం ఆగిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఏ కార్యక్రమానికి హాజరు అవ్వు” అన్నారు మా గురువుగారు. బాగా ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది నూటికి నూరుశాతం నిజమే అనిపిస్తుంది.
కానీ, బంధాలు ఉన్నాయనుకునే బంధువులకోసం, ఆపదలో ఆదుకుంటారనే ఆప్తమిత్రులకోసం ఎక్కడికైనా వెళ్ళక తప్పడం లేదు. ఆ లెక్కలోనే ఈ మధ్య మా దగ్గరి బంధువుల పెళ్ళికి అనాసక్తితోనే హాజరైనాను.
నేను కళ్యాణమండపంలోకి అడుగుపెట్టగానే…
“ఇప్పుడేనా రావడం?” అన్నాడు బంధువులలో ఒకరు. ఆ ప్రశ్న నాకు చిరాకు కలిగించింది. వచ్చిన వ్యక్తి కళ్ళెదురుగా కనిపిస్తుంటే, ఆ ప్రశ్న వేయడంలో అతని అంతరార్థం నాకు అవగతంకాలేదు. అలా అడగడం అతని తప్పుకాదు. అనాదిగా అలవాటైపోయిన అసందర్భమైన ప్రశ్నలనే మనుషులు ఇంకా వాడుతుండడం నాకు వింతగా తోచింది.
అతనిని దాటుకుని కాస్త దూరం వెళ్ళి కుర్చీలో కూర్చున్నాక…
“బాగున్నారా?” అన్నారు మరొకరు. ఈసారి నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఏదో పలకరించాలి కాబట్టి పలకరించడంలా ఉంది అతని వాలకం. అతనేకాదు అందరి పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు. త్రికరణాలు ఎవరికీలేవు. మనో,వాక్, కర్మలను ఎవరూ పాటించడంలేదు.
అందుకే పలకరింపులలో పరవశాలులేవు.
ఆదరణలలో ఆప్యాయతలులేవు.
మాటలలో మర్యాదలులేవు.
ఆ కారణంచేతనే అతని ప్రశ్నకు జవాబు చెప్పడం ఇష్టంలేని నేను చిరునవ్వుతోనే సరిపెట్టాను.
అందమైన జీవం ఉన్న నిజమైన పూలు గోడలమీద, స్తంభాలమీద…
నిజం కాని రంగుల్లో మెరిసిపోయే ప్లాస్టిక్ పూలు కొందరి అతివల అందమైన సిగలో
కనిపించడం మరీ విచిత్రంగా అనిపించింది ఆ పెళ్ళివేడుకలో.
ముహూర్తానికి ఇంకా అరగంట ఉండడంతో పెళ్ళికూతురు తరపున వాళ్ళు అందరినీ అల్పాహారానికి ఆహ్వానించారు.
అల్పాహారం అంటే అల్పులు తినే ఆహారం… అనే గురువుగారి మాట గుర్తుకొచ్చి నవ్వొచ్చింది…
లేచి డైనింగ్ హాలులోకి వెళ్ళగానే అప్పటికే ఐదారుమంది నాకంటే ముందున్నారు క్యూలో… ఇదొక్కటే ముఖ్యమైన కార్యక్రమం అన్నట్టు.
ఆహారపదార్థాలలో నాకు ఇష్టమైనవి ప్లేటులో వేసుకుని, కుర్చీలో కూర్చుని తింటుండగా…
“ఏంమామ పెళ్ళి కూతురు అమ్మానాన్నకు కనబడ్డావా?” అన్నాడు నా పక్కనే ఉన్న ఒకతను.
“మనం కనబడినా, కనబడకపోయినా మనల్ని చూసినోళ్ళు ఎవరో ఒకరు చెప్తారులేరా మనం వచ్చామని” అన్నాడు అతను. ఆ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఇప్పుడున్న మనుషుల తత్వానికి అదే సరైన సమాధానం.
అల్పాహారం అయిన తర్వాత వెళ్ళి కళ్యాణమండపంలో కుర్చున్నాను. పెళ్ళితంతు ప్రారంభమయింది. పురోహితుడు ఏవో కొన్ని కార్యక్రమాలు చేసాక సహ పురోహితుడి ద్వారా మంగళ సూత్రాన్ని, అక్షింతలను ప్రేక్షకులలోకి పంపించాడు అందరి ఆశీర్వాదంకోసం. అందరూ మంగళ సూత్రాన్ని తాకి కళ్ళకద్దుకున్నాక వాళ్ళ చేతుల్లోకి అక్షింతలు అందించిన తర్వాత మళ్ళీ కళ్యాణ వేదికపైకి వెళ్ళిపోయాడు సహ పురోహితుడు.
కళ్యాణఘడియలు సమీపించగానే పురోహితుడి సైగలతో జోరందుకున్నాయి మంగళ వాయిద్యాలు.
పురోహితుని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ వరుడు వధువుమెడలో తాళి కట్టగానే, అప్పటివరకు కుర్చీలలో కూర్చుని ఉన్న ప్రేక్షకులు ఒక్క ఉదుటున లేచి వేదిక వద్దకు వెళ్ళి ,ఈ క్షణం నుంచి మీ సుఖశాంతులకు చరమగీతం పాడినట్లే అన్నట్లు…
మీ చావు మీరు చావండి అన్నట్లు…
నవదంపతులపై అక్షింతలు విసిరిగొట్టారు.
అలా విసిరికొట్టడం ఇష్టంలేని నేను వేదిక మీదకు వెళ్ళి ఇద్దరిమీద అక్షింతలు వేసి నిండుగా ఆశీర్వదించాను. ఆ క్షణంలో నవదంపతులు నా వైపు కృతజ్ఞతగా చూశారు. కానీ, మిగిలిన బంధువర్గం, ప్రేక్షకులు వింతగా చూశారు నా వైఖరికి.
వివాహానంతరం గిఫ్టులు ఇస్తూ కొందరు ఫోటోలు దిగారు. ఆ తర్వాత తమతోపాటు ఫోటోలు తీసుకోవడం కోసం సమీప బంధువులను, మిత్రులను ఆహ్వానిస్తున్నారు నవదంపతులు.
ఆ పిలుపులో అలసత్వం కనిపించింది నాకు. మొదట బాగా ఆర్థికంగా పరిపుష్టి చెందిన బంధువులను పిలిచారు వేదికమీదకు.
ఇక పిలవపోతే బాగుండదు అనుకున్నారేమో చివర్లో మిగిలిన చిన్నా, చితకా మనుషులను పిలిచారు.
ఆ వెనకబడిన మనుషులు అప్పటికే దూరంగా అనాదుల్లా కూర్చుని ఉన్నారు.
పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదనుకుని వేదికపైకి వెళ్ళారు ఆ అభాగ్యులు.
వేదికమీద ఆ అభాగ్యులు ఫోటో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో నిర్జీవం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఇక్కడ మనం ఎవరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే మామూలు చెప్పులు వేసుకున్నప్పుడు నడక ఒకవిధంగా ఉంటుంది. బూట్లు వేసుకున్నప్పుడు మరొకవిధంగా ఉంటుంది. అలాగే డబ్బు లేనప్పుడు మనిషి జీవితం ఒకవిధంగా ఉంటుంది. డబ్బు చేరాక తమకు తెలియకుండానే తమ జీవితాల్లో మార్పులు కూడా అలాగే చేరిపోతాయి.
ఇక కళ్యాణతంతు చివరిదశకు చేరుకుంది. అదేనండి అరుంధతి నక్షత్ర దర్శనం. ఇప్పుడున్న కాలుష్య ప్రభావంవల్ల రాత్రులలోనే నక్షత్రాలు కనపడడంలేదు. ఇక పట్టపగలు ఏమి కనిపిస్తాయి. అయినా సాంప్రదాయపరంగా అరుంధతి నక్షత్రాన్ని పెళ్ళి కూతురుకి చూపించమని పెళ్ళి కుమారుణ్ణి పురమాయించాడు పురోహితుడు.
“అదిగో అరుంధతి” అని పెళ్ళికొడుకు పైకి చేయి చాపుతూ చూపించగానే, ఆ నవవధువు
“అవును కనిపించింది” అని సిగ్గుపడుతూ చెప్పింది.
ఓ అబద్ధంతో పెళ్ళితంతు ముగిసింది.
అబద్ధంతోనే వైవాహిక జీవితం మొదలవ్వడం అసలైన విచిత్రం..!
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
Discussion about this post