స్వామి వివేకానంద తండ్రిగారైన విశ్వనాధ దత్త ఓ సందర్భంలో తన కుమారునితో ఇలా అన్నాడు – “దేనికీ ఆశ్చర్యపడకు”
ఈ వాక్యమే భవిష్యత్తు కాలంలో వివేకానంద ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడింది. ఇది పరిమిత వాక్యమే అయినా ఇందులో అపరిమితమైన తత్వసారం దాగుంది.
సమాజంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు తారసపడినప్పుడు వెంటనే “దేనికీ ఆశ్చర్య పడకు” అనే వాక్యం నేను జ్ఞప్తికి తెచ్చుకోవడంచేత ఆ సంఘటనలు నా మనసుకు అంటవు.
కానీ, ఎందుకో ఈ మధ్య కొన్ని విచిత్రమైన సంఘటనలు నాకు తారసపడ్డాయి. అవి నా మనసు పొరను దాటుకుని హృదయాంతరాలలోకి వెళ్ళి కలవరపెట్టాయి.
ఎప్పుడైనా మనకు బాధ కలిగినప్పుడుగాని, కలవరపాటుకు గురైనప్పుడుగాని ఆ బాధను ఇతరులకు చెప్పుకుంటే మనసు కాస్త కుదుటపడుతుందని పెద్దలు చెప్తుంటారు.
కానీ, ఇందులో చాలా స్వార్థం దాగుంది. ఎందుకంటే తన బాధను ఇతరులపైకి తోసేస్తే చెప్పినవాడు రిలాక్స్ అయిపోతాడు. విన్నవాడు, వాటి గురించే ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటుంటాడు.
కాబట్టి, చెప్పిన వాడు స్వార్థపరుడని నా ఉద్దేశం. నేను కూడా ఆ స్వార్థతోనే నన్ను కలవరపాటుకు గురిచేసిన సంఘటనలు నాలో ఉంచుకోలేక మీ పైకి నెట్టేసి నేను రిలాక్స్ అవ్వాలని దురుద్దేశంతో ఇప్పుడు ఆ విషయాలను మీ ముందుకు తెస్తున్నాను.
ఈ మధ్య బంధువులలో వరుసకు మామయ్య అయ్యే అతను వాళ్ళ పాపకు పుట్టినరోజని రమ్మని పిలిచాడు. కోవిడ్ నేపధ్యంలో నేను రాలేనని చెప్పాను. ‘ఎవరినీ పిలవడంలేదు నిన్ను మాత్రమే పిలుస్తున్నాను. మా ఇంటివరకే చేసుకుంటున్నాము’ అని చెప్పడంతో కాదనలేకపోయాను. ‘నిన్ను చూసి చాలారోజులైంది కేక్ కట్ చేసేది సాయంత్రమే అయినా నీవు మాత్రం ఉదయమే వచ్చేయ్’ అని చెప్పడంతో ఉదయమే వెళ్ళాను.
కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని తెలియజేయుటకు సంకేతంగా నేను వెళ్ళి సోఫాలో కూర్చోగానే ప్లాస్టిక్ కప్పులో ‘టీ’ ఇచ్చింది అత్తమ్మ.
మా మామయ్య అమ్మగారు టీవీలో ఏదో సీరియల్ చూస్తోంది. పుట్టినరోజు జరుపుకుంటున్న పాప, వాళ్ళ తమ్ముడు చెరో సెల్ ఫోను చూస్తూ లీనమైపోయున్నారు.
ఆ పాపకు నేను విషేష్ చెప్పినా నా వైపు చూడకుండానే ఫోనులో గేమ్స్ ఆడుతూనే “థ్యాంక్స్ అంకుల్” అని చెప్పింది.
మామయ్య నన్ను పలకరించిన కాసేపటి తర్వాత ఆర్డర్ ఇచ్చిన బర్తడే కేక్ తీసుకురావాలని బయటకు వెళ్ళాడు.
అత్తమ్మ నా క్షేమ సమాచారాలు విచారించిన తర్వాత నా పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చుని ఫోనులో ఏదో చూసుకుని తనలోతానే నవ్వుకుంటూ అప్పుడప్పుడు నా వైపు చూస్తోంది నేనేమైనా అనుకుంటానని.
ఆ ఇంటి పరిస్థితి చూశాక నాకు చాలా చిరాకేసింది. కాసేపు ఇంటిని తేరపార చూశాను. నాకు ఎదురుగా ఉన్న బుక్ షెల్ఫ్ లో ‘ప్రశాంతంగా జీవించడం ఎలా?’ అనే పుస్తకం కనిపించింది. బహుశా ఇంట్లో ప్రశాంతత లేకపోవడంవల్లే మామయ్య ఈ పుస్తకం కొనుంటాడని అనిపించింది. వెళ్ళి ఆ పుస్తకాన్ని చేతికి తీసుకుని మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుని పుస్తకం ఓపెన్ చేశాను చదువుతామని.
అంతలో…
“దాన్ని చెప్పుతో కొట్టినా పాపంలేదు. ఇంతకు బరితెగించిన దాన్ని తెగనరికినా దోషంలేదు” అని మామయ్య అమ్మగారు టీవీలో వస్తున్న దృశ్యాన్ని చూసి గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డాను.
టీవీలో సీరియల్స్ మనుషులను ఇంతలా ప్రభావితం చేస్తున్నాయా? అని ఆవేదన కలిగింది. వెనువెంటనే ఫోను చూస్తున్న పాప తమ్ముడు “నేనే గెలిచా” అని కేక పెట్టడంతో పక్కనే ఉన్న వాళ్ళ అక్క, తను చూసే గేమ్ డిస్ట్రబ్ అయిందని వాళ్ళ తమ్ముడిని లాగి చెంపమీద కొట్టింది.
అంతే.. చర్యకు, ప్రతిచర్య అన్నట్లు వాడు వాళ్ళ అక్కని వీపు మీద బాదాడు. పర్యవసానంగా పిల్లలు ఇద్దరూ ఏడుపు ఎత్తుకున్నారు. అది భరించలేని మా అత్తమ్మ పిల్లల్ని చితకబాదింది.
అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న మా మామయ్య అమ్మగారు “మేమూ పిల్లల్ని సాకినాము. ఎప్పుడూ అలా కొట్టిందిలేదు. చీటికిమాటికి అట్లా కొడితే దేనికి పనికొస్తారు వాళ్ళు. ఏమైనా అంటే కోపాలు మాత్రం పొడుచుకొస్తాయి” అని విసుర్లు విసిరింది కోడలి పైకి.
అంతే విసురుగా లేచి నావెనుకనే వున్న ప్లగ్ లో ఫోనుకి చార్జింగ్ పెడుతూ..”ఈ వయసులో వేసింది తినక పెత్తనాలు ఎందుకో ఈ ముసలిదానికి” అని నసుగుతూ వంటగదిలోకి వెళ్ళింది అత్తమ్మ.
కానీ, ఫోనుకి మెసేజ్ వచ్చినట్లు శబ్దం వినిపించినప్పుడల్లా వంటగదిలోంచి పరుగున వచ్చి కాసేపు ఫోను చూసుకుని మళ్ళీ వంటగదిలోకి వెళ్తోంది అత్తమ్మ. ఆమె వంటచేయడం కంటే ఫోను చూసుకోవడానికే ఎక్కువ టైం కేటాయిస్తోంది.
వ్యవహారం ఇంట్లో ఇలా నడుస్తుండగా బర్త్ డే కేకుతో ఇంట్లోకి ప్రవేశించాడు మామయ్య. కేక్ టేబుల్ మీద పెట్టి వాష్ బేసిన్ వద్ద సబ్బుతో చేతులు కడుక్కుని వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మామయ్యకు తన ఇంట్లో రోజూ జరిగే తంతు ఇదే కాబోలు అనుకోవడంచేతనేమో ఇంట్లో మనుషులందరూ ముభావంగా ఉన్నా ఏమీ పట్టిచ్చుకోకుండా నాతో కబుర్లలో మునిగిపోయాడు.
కాసేపటి తర్వాత భోజనానికి అత్తమ్మ పిలవడంతో అందరమూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. తినే సమయంలో కూడా టీవీ రన్ అవుతూనే ఉంది. పిల్లలు ఫోను చూసుకుంటూనే తింటున్నారు. అత్తమ్మ అప్పుడప్పుడు మాకు కావల్సింది వడ్డిస్తూనే ఫోనుకి వచ్చే మెసేజ్ లను చూసుకుంటూనే ఉంది. మామయ్యకు, అత్తమ్మ చేసే పని ఇష్టంలేక ఆమె వైపు కోపంగా చూస్తున్నా అవేవీ పట్టిచ్చుకోకుండా తన పాటికి తాను ఫోను చూసుకుంటూనే ఉంది.
భోజనాలు అయిన తర్వాత నన్ను అక్కడ ఉంచడం ఇష్టంలేక “రేయ్ నీవు మేడ మీద రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం వచ్చి పిలుస్తాను” అని చెప్పి తాళంచెవి నా చేతిలో పెట్టాడు. ‘బతికానురా దేవుడా’ అనుకుంటూ రూంలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాను. మామయ్య ఫోనుతో నిద్రలేచిన తరువాత రూంలోనే ఫ్రెష్ అప్ అయ్యి కిందకు దిగి వచ్చాను.
అప్పటికే అందరూ ష్రెష్ అప్ అయ్యి పాప దగ్గర కేక్ కట్ చేయించటానికి సిద్ధంగా ఉన్నారు. కేక్ కటింగు, గిఫ్ట్ ప్రజంటేషన్, ఫోటో షెషన్ అయిన తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పేసి బయట బైక్ దగ్గరకు వచ్చాను. మామయ్య నాతోపాటే బైకు దగ్గరకు వచ్చాడు వీడ్కోలు చెప్పడానికి.
బైక్ స్టార్ట్ చేసి మామయ్యకు మళ్ళీ బై చెప్పి ముందుకు వెళ్తున్నా, మామయ్య ఇంట్లో జరిగిన సంఘటనలు నా మదిలో సుడులు తిరుగుతూ నన్ను కలవరపెడుతున్నాయి.
ప్రపంచంలో ఎందరో వ్యక్తులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తుంటే మన చుట్టూ ఉన్న మనుషులు మాత్రం దేనికీ ఉపయోగపడని, హింసను ప్రేరేపించే సీరియల్స్ పట్ల, ఎవరో విసిరి పారేసిన చెత్తను, అపహాస్యాన్ని, అశ్లీలతను ఫోను ద్వారా మళ్ళీ మళ్ళీ ఫార్వాడ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ సమయాన్ని వృధా చేసుకుని అశాంతితో, అసహనంతో కుచించుకుపోయి వెనుకకు అడుగులు వేస్తూ అథఃపాతాళంలోకి నెట్టబడుతున్నారు.
అందుకే…
మనుషులమైన మనం ఒకసారి పునరాలోచించి, మనం చూసే సీరియల్స్ లోగాని, ముఖ్యంగా మనం ఫోనుల్లో ఫార్వాడ్ చేసే మెసేజ్లోగాని ఏదిమంచి? ఏది చెడు? అది నిజంగా మనకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి, అది మంచి సందేశమే అయితే అది ఎందుకు నచ్చిందో వ్యాఖ్యానం రాసి ఫార్వార్డ్ చేయగలిగితే అందరికీ మేలు చేసినవాళ్ళు అవుతాం. అట్లా కాకుండా ఫేస్ బుక్ లోనో, వాట్సప్ లోనే వచ్చే అడ్డమైన మెసేజ్ లను ఇతరులపైకి నెట్టేస్తే అందరి దృష్టిలో అపహాస్యానికి గురై వెధవలుగా మిగిలిపోతాం.
మరి నలుగురికి మంచి చేసే మంచివాళ్ళుగా ఉంటామా? లేక ఇతరులను ఇబ్బంది పెట్టే వెధవలుగానే మిగిలిపోతామా? అనేది ఎవరికివారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళది ఏంచేస్తాం!
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post