సృష్టి స్థితి లయలనే మూడు క్రియలు వేర్వేరుగా ఉండేవి కాదు.. వీటి మధ్య భేదం లేదు. ఈ మూడూ కూడా ఒక్కటే అనే అభేద భావాన్ని గుర్తు చేసేది బిల్వపత్రం.. మారేడు ఆకు. శివుడికి మారేడు అంటే ఎంత ఇష్టమో భక్తులందరికీ తెలిసిందే.
బిల్వపత్రంలో ఆకులు మూడుగా ఉన్నప్పటికీ.. వాటిని జతపరిచి ఉండే కాండం ఒక్కటే! అదే అభేదభావం అని పురాణాలు చెబుతాయి. పరమశివునికి బిల్వపత్రంతో ప్రత్యేకంగా పూజ చేయడానికి కూడా ఇదే కారణంగా చెప్తుంటారు.
పూజకుడు- పూజ్యము- పూజ ఈ మూడూ ఒక్కటే అనేది బిల్వపత్రం అందించే సందేశం. పూజకుడు అంటే పూజ చేసేవాడు. పూజ్యము అంటే ఎవరిని పూజిస్తున్నామో వారు. పూజ అనేది చేస్తున్న పని. అంటే చేస్తున్న పని.. దానిని చేస్తున్న వ్యక్తి, ఫలితాన్ని పొందుతున్న వ్యక్తి ఈ మూడూ వేర్వేరుగా మనకు కనిపిస్తాయి. కానీ.. లోతుగా గమనిస్తే ఈ మూడూ కూడా ఒక్కటే. వీటి మధ్య భేదం లేదు. అందుకే మూడు పత్రాలుగా కనిపించినా.. ఒకటే కాడతో ముడిపడి ఉండే బిల్వపత్రం మారేడు ఆకు.. త్రినేత్రుడైన పరమశివునికి ప్రీతికరమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. పూజకుడు- పూజ్యము- పూజ గురించి చెప్పుకున్నట్లే.. స్తోత్ర- స్తుత్యము- స్తుతి అంటే.. కీర్తిస్తున్నవాడు, కీర్తించబడుతున్నవాడు, కీర్తన ఈ మూడూ కూడా వేర్వేరుగా కనిపించినా అభేదమైనవే. అలాగే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము గురించి కూడా చెప్తారు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు- భక్తుడు. జ్ఞేయము అంటే తెలుసుకోదగినవాడు- భగవంతుడు. జ్ఞానము అంటే తెలుసుకున్న సంగతి. ఈ మూడూ వేర్వేరు అనుకోవద్దనేది ఇందులోని అంతరార్థం.
బిల్వపత్రం- మారేడు ఆకు అందించే అంతరార్థ సందేశాన్ని త్రిపుటీజ్ఞానం అంటారు. వేర్వేరుగా కనిపించినా మూడు ఆకులు ఒక్కటే కాడకు ఉన్నాయనేది ఇందులోని అంతరార్థం. సృష్టి స్థితి లయలనే మూడింటికీ మహదేవుడైన శివుడొక్కడే అధికారి అని సూచించే శివతత్వం ఈ బిల్వపత్రంలో ఉంటుంది. పూజ చేసేవాడు- చేయించుకునే వాడు- శివుడు వేర్వేరు కాదు అనే తెలియజెప్పడమే.. ‘శివోహమ్.. శివోహమ్..’ అని అంటూ పరమశివుడికి బిల్వపత్రాలను సమర్పించడానికి నిదర్శనం.
అందుకే..
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్
అంటూ.. మూడు జన్మల పాపాలను హరించడానికి మూడు దళాలు గల బిల్వపత్రాన్ని ఒక్కటే అయినా.. త్రినేత్రునికి సమర్పించాలని అంటారు.
సకలదేవతలకు నెలవు
మారేడు ఆకును సకల దేవతలకు నెలవుగా చెబుతుంటారు. అందుకే అది శివార్చనకు విశిష్టమైనదిగా పేర్కొంటారు. బిల్వపత్రం విశిష్టత తెలియజెప్పే శ్లోకం ఒకటుంది.
వామపత్రే వసేత్ బ్రహ్మా పద్మనాభశ్చ దక్షిణే
పత్రాగ్రే లోకపాలాశ్చ మధ్యపత్రే సదాశివః
పృష్టభాగే స్థితా యక్షాః పూర్వభాగే 2మృతం స్థితమ్
తస్మాద్యై పూర్వభాగేన అర్చేయత్ గిరిజాపతిమ్
దీని తాత్పర్యం ఏంటంటే.. మారేడు ఆకులోని మూడు పత్రాల్లో ఎడమవైపు ఉన్న దానిలో బ్రహ్మ, కుడివైపున విష్ణువు, మధ్య పత్రంలో పరమశివుడు, ఆకు చివరన లోకపాలుడు ఉంటారట. అలాగే ఈ బిల్వపత్రానికి ముందువైపు అమృతం వెనుకవైపు యక్షులు వసిస్తుంటారు గనుక.. శివలింగాన్ని అర్చించేప్పుడు బిల్వపత్రం ముందువైపు భాగానే.. లింగం మీద ఉంచి పూజించాలని ఈ శ్లోకార్థం చెబుతుంది.
ఇలా బిల్వవృక్షం అనేది లక్ష్మీ స్వరూపంగా, బిల్వపత్రం సకలదేవతలకు కొలువుగా చెప్తారు. మారేడు చెల్లున్న వనం కాశీక్షేత్రానికి సమానమైనదని అంటారు. మారేడు చెట్టు ఉన్న ప్రతిచోటా శివుడు నెలవై ఉంటాడంటారు. మారేడు చెట్టు మన ఇంటి ఆవరణలో ఒక్కొక్క ప్రదేశంలో ఉండడం వలన ఒక్కొక్క ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతాయి. ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యప్రాప్తి, ఆపదలుండవు. తూర్పున ఉంటే సుఖప్రాప్తి. పడమరన ఉంటే పుత్ర సంతాన భాగ్యం, దక్షిణాన ఉంటే యమబాధలుండవు అని స్కాందపురాణం చెబుతుంది.
బిల్వవృక్షం (మారేడు చెట్టు) ఎలా పుట్టిందో తెలుసా?
మారేడు చెట్టు ఎలా పుట్టిందనడానికి పురాణాల్లో ఒక ఆసక్తికరమైన దృష్టాంతం ఉంది. ఒక సందర్భంలో విష్ణుమూర్తి- లక్ష్మీదేవి ఏకాంతంగా ఉండగా.. మీకు అత్యంత ఇష్టమైనదెవరని ఆమె భర్తను అడిగింది. నాకు ఇష్టుడు శివుడు- అలాగే శివుడికి ఇష్టుడిని నేనే అని విష్ణుమూర్తి చెప్పాడు. అలాగైతే పరమశివునికి అత్యంత ఇష్టులైన భక్తులెవరు? అని లక్ష్మీదేవి అడిగింది. దానికాయన- ‘ఎవరైతే తామరపువ్వులతో ఒక సంవత్సరం పాటు శివుడిని పూజిస్తారో.. వారు అత్యంత ఇష్టు’లని చెప్పారట.
తాను గొప్ప శివభక్తురాలిగా పేరు తెచ్చుకోవాలని లక్ష్మీదేవి అనుకుంది. వెంటనే మరు రోజు నుంచి ఉదయాన్నే 108 తామరపూవులు కోసుకు వచ్చి.. శివుడిని అర్చిచండం ప్రారంభించింది. ఇలా ఒక ఏడాది గడచింది. చివరిరోజున పూజకు తామరపూవులు తేవడానికి వెళితే కొలనులో 106 పువ్వులే ఉన్నాయి. ప్రతిరోజూ 108 పూలతో అర్చించిన లక్ష్మీదేవికి ఆరోజు రెండు తామరలు తక్కువయ్యాయి. ఆ బాధలో ఉండగా.. తన భార్య అయినా లక్ష్మీదేవి స్తనాలు తామరపువ్వుల్లా ఉంటాయని విష్ణుమూర్తి అదివరలో ఒకసారి చెప్పిన సంగతి ఆమెకు గుర్తొచ్చింది. శివభక్తి ప్రేరితురాలైన లక్ష్మీదేవి ఎలాంటి సంకోచం లేకుండా శివపూజ పూర్తిచేయడానికి కోసుకున్న 106 తామరపువ్వులతో పాటు- తన స్తనాలను అర్పించి.. అర్చించదలచుకుంది. ముందుగా ఎడమస్తనం కోసి శివార్పణ చేసి.. కుడివైపు స్తనాన్ని కూడా కోయబోతుండగా.. శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు యథారూపం అనుగ్రహించి.. తనకు అర్పించిన ఆమె స్తనం బిల్వవృక్షంలా జన్మించేలా.. అది సదా శివపూజకు ప్రశస్తమైనదిగా కీర్తిదక్కేలా వరమిచ్చాడు. ఆ రకంగా శివార్పణమైన లక్ష్మీదేవి స్తనమే బిల్వవృక్షంగా అవతరించినట్లు స్కాందపురాణంలో భాగమైన శివకవచమ్ గ్రంథం చెబుతుంది.
మారేడు ఆధ్యాత్మిక విశిష్టత
మారేడు ఆకులు ఎండిపోయినా, నిల్వ చేసినవైనా శివపూజకు దోషం లేదని, వాటితో శివుడిని పూజిస్తే చాలు పాపాలు హరిస్తాడని చెబుతారు.
శుష్కైః పర్యుషి తైర్వాపి బిల్వపత్రైస్తుయో నరః
పూజయంస్తు మహాదేవం ముచ్యతే సర్వపాతకైః
మారేడు ఆకుల ఆధ్యాత్మిక ప్రశస్తిని తెలియజెప్పే మరొక శ్లోకం కూడా ఉంది.
బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్
అఘోర పాపసంహారం ఏక బిల్వం శివార్పణమ్
బిల్వపత్రాన్ని చూసినంతనే పుణ్యం లభిస్తుంది.. తాకినంతనే పాపాలు తొలగుతాయి.. ఒక్క బిల్వపత్రంతో శివుడిని అర్చిస్తే.. ఘోరపాపాలన్నీ హరించుకుపోతాయి.. అనేది శ్లోకార్థం.
.. కపిలముని
Discussion about this post