అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు తిరువేంకట గిరినాధుడు.. గరుడారూఢుడైన తిరుమాడ వీధులలో ఊరేగాడు. భక్తులకు నయనానందకరంగా, హృదయానందకరంగా పౌర్ణమి చంద్రుని వెన్నెల వెలుగులలో స్వామివారు ఊరేగారు.
తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు.
గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ నాడు లక్షలాది మంది భక్తులు స్వామివారిని ఉత్సవమూర్తిగా తిలకించి తరించడానికి తిరుమలకు పోటెత్తుతారు. బ్రహ్మోత్సవాలు మాత్రమే కాకుండా.. ప్రతి నెలా పౌర్ణమి నాడు పున్నమి గరుడసేవ నిర్వహిస్తారు.
కరోనా కారణంగా గత ఏడాది ఏకాంతంగా సాగిన బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో జరగనున్నాయి.
.

Discussion about this post