గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వగచి ప్రయోజనమేమిటి? పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానళ్లు ఈ స్థాయికి దిగజారటానికి కారణం రాజకీయ పార్టీలే. సొంత ఎజండాలతో పార్టీలే మీడియాను నడుపుతూ ప్రత్యర్థులపై నీచాతినీచంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి.
మీడియాలో ఇప్పుడు సత్యనిష్ఠ అనే జర్నలిజం మౌలిక సూత్రం భూతద్దం పెట్టి వెతికినా కన్పించదు. ఒక సంఘటననో, ఒక ప్రసంగాన్నో తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా పత్రికలు టీవీలు రాస్తున్నాయి. పత్రికలు, టీవీలను అధికారికంగా నిర్వహించుకోవడంతో పాటు బినామీలతో టీవీ చానళ్లను టేకోవర్ చేయిస్తున్నారు. ఏ మీడియా అధిపతి ఎవరు? అతడు ఏ పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తాడన్నది ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇంతటితో ఆగకుండా వివిధ పార్టీలు యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తూ ప్రత్యర్థి పార్టీలను నేతలను దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎగతాళి చేస్తున్నాయి.
ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తినా ప్రజలేమీ నిజమని నమ్మటం లేదు. ఘాటుగా విమర్శించినా విశ్వాసంలోకి తీసుకోవటం లేదు. ఆ పత్రిక అలా రాయకుండా ఎలా ఉంటుంది? ఆ టీవీలో ఆ నేత గురించి అలాగే చెప్తారు అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతున్నారు.
మీడియా విశ్వసనీయత పూర్తిగా అడుగంటిపోయింది. నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నా ఆ రాతలను నమ్మించలేని విషాద పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది.
జర్నలిస్టులు కూడా ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు. ఏ పత్రికలో పనిచేస్తే ఆ పత్రిక యజమాని ప్రయోజనాల కోసం ఎడిటర్ల నుంచి కిందిస్థాయి రిపోర్టర్ వరకు ఎంతకైనా దిగజారటానికి సిద్ధపడుతున్నారు. అధికార పార్టీని ఘాటుగా విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుడిని తూలనాడుతూ ‘బట్టేబాజ్ గాడు’ వంటి పదప్రయోగాలతో ఎడిటర్‌లే దిగజారుతూ నియంత్రణ కోల్పోతున్నారు.
మరో విషాదమేమిటంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజంలో తలపండిన యోధులనుకుంటున్న వారంతా అధికార పార్టీలను ఆశ్రయించుకుని సలహాదారుల పదవుల్లోనో, అకాడమీ ఛైర్మన్ హోదాల్లోనో ఊరేగుతున్నారు. వీరంతా పాలకపార్టీ అధినేత అడుగులకు మడుగులు ఒత్తుతూ పబ్బం గడుపుకుంటున్నారు. మీడియా ప్రక్షాళన అనేది అధికార పార్టీ మీడియాతోనే మొదలుపెట్టాలి. పాలకపక్షం తన మీడియాను దారిలో పెట్టుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. తమ చాపకిందకు నీళ్లొచ్చాక విలువల గురించి, దిగజారుడుతనం గురించి మాట్లాడి ఉపయోగమేమిటి?
యూట్యూబ్‌లలో హద్దుమీరి వ్యవహరిస్తున్న వారెవరూ జర్నలిస్టులు కాదని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తేల్చేశారు. వారికెవరికీ అక్రిడేషన్లు కూడా లేవన్నారు. నిజానికి ఇతర వృత్తుల మాదిరి కనీస విద్యార్హత ఏదీ జర్నలిజానికి లేదు. లాయర్‌గా ప్రాక్టీసు చేయాలంటే, న్యాయశాస్త్రం చదివి, బార్ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకోవాలి. వైద్యవృత్తికీ ఇలాంటి ప్రమాణాలే ఉన్నాయి. జర్నలిస్టులకు కనీస విద్యార్హత మొదటినుంచీ లేదు. సామాజిక సేవలో భాగంగా జర్నలిజంలోకి వచ్చారు. దేశ స్వాతంత్ర్య పోరాటానికి అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు. వీరి విద్యార్హతలను ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికీ కంట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్న వారిలో టెన్త్, ఇంటర్‌మీడియట్ చదివిన వారనేక మంది ఉన్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
మీడియా అకాడమీలు పెద్దఎత్తున శిక్షణలు నిర్వహించి హద్దు దాటితే ఎదురయ్యే విపరిణామాల గురించి, పత్రికా చట్టాల గురించి తెలియజెప్పాలి. వివిధ రాజకీయ పార్టీలు విశాల దృష్టితో ఆలోచించి తమ ఆధ్వర్యంలోని మీడియాలో రాతలను కట్టడి చేయాలి. తాము చేజేతులారా కూచున్న కొమ్మను నరుక్కుంటున్నామన్న సత్యాన్ని గుర్తించి మేల్కోవాలి. తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ తన ఛానల్ వేదికగా కేటీఆర్ కుమారుడిపై చేశారన్న వ్యాఖ్యలపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఉచితానుచితాలు మరచి కలాలనే కత్తులుగా దూయటానికి మరింతగా విజృంభిస్తారు.
యూట్యూబ్ వార్తా ఛానళ్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని సంకల్పించటం మంచిదే. అయితే ఈ ‘కట్టడి చేసే’ వ్యవహారం.. ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది గనుక.. తమ లోపాలను ఎత్తిచూపించే వారిని, తమ ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉంటారని అనుకుంటున్న వారినంతా ఏరిపారేసే దురాగతాలకు పాల్పడకుండా ఉండాలి. రాజకీయ పార్టీల నాయకుల ప్రసంగాలను కట్టడి చేయటానికి కూడా చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసే వేదికలుగా మీడియాను దుర్వినియోగపరచకుండా చూడాలి.
అధికారమే సర్వస్వం అని తెగబడుతున్న ఈ పార్టీల వల్ల మీడియాలో అభిలషణీయ మార్పులు వస్తాయనుకోవడం భ్రమే.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం గురువు
Discussion about this post