ప్రధాని మోడీ తాను మహావీరుడినని అంటూ ఉంటారు. ధైర్యానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. మరి రైతుల ఆందోళనల విషయంలో భిన్నంగా స్పందిస్తున్నారు ఎందుకు?
కేంద్రం తెచ్చినవ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళనల పట్ల ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అపరిమితంగా భయపడుతోందా? రకరకాల మార్గాల ద్వారా.. అంతర్జాతీయ ఒక ‘మోడీ అనుకూల’ ఇమేజిని నిర్మించుకుంటూ ఉంటే.. ఈ ఒక్క ఉద్యమాల పుణ్యమాని సాంతం మట్టిగలిసిపోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారా? అందుకే ఏకంగా సోషల్ మీడియా వేదిక ట్విటర్ కు నోటీసులు ఇచ్చి.. బెదిరించి.. తమకు ఇబ్బందికరమైన ప్రచారాన్ని కూడా తొక్కేయాలని తొందరపడుతున్నారా?
వాస్తవంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. రైతుల ఆందోళనకు సంబంధించి.. అంతర్జాతీయ ప్రముఖులు వ్యక్తం చేసిన సానుభూతిని కూడా.. కేంద్రప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నదంటే.. అలాంటి సానుభూతికి కూడా కత్తెర వేయాలని ఉబలాటపడుతున్నదంటే అది ఖచ్చితంగా సర్కారులో పుడుతున్న భయమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
దేశంలో ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు ప్రతికూలంగా రైతులు సాగిస్తున్న ఆందోళన హాట్ టాపిక్ గా ఉంది. రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన అవాంఛనీయ సంఘటనలను వాడుకుని.. పోరాడేవారిలో చీలికలు సృష్టించడం వరకు పాలకులు సఫలం అయ్యారు గానీ.. మొత్తంగా ఉద్యమం వీగిపోయేలా చేయలేకపోయారు. ఇప్పుడు రైతులు భారీ బహిరంగ సభలకు కూడా దిగుతున్నారు. మరింత దండిగా మద్దతు వారికి లభిస్తోంది. ఈ ఉద్యమం రోజురోజుకు మరింత ఉధృతమవుతుండడం ప్రభుత్వానికి కంగారు పుట్టిస్తోంది.
ఇదే సమయంలో అంతర్జాతీయ పాప్ గాయని రిహానా, పర్యావరణ వేత్త గ్రెటాథన్‌బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ తదితర అంతర్జాతీయ ప్రముఖులు భారత్ లో పరిణామలపై ట్వీట్లు చేశారు. దీనిగురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు అని రిహానా అంటే, రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నట్టు గ్రెటాథన్‌బర్గ్ పేర్కొన్నారు. మీనాహారిస్ ఏకంగా… ‘భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డ’దని వ్యాఖ్యానించారు. మీనాహారిస్ వ్యాఖ్య కించపరిచేలా ఉండవచ్చు గానీ.. భారత్‌లో పరిణామాల గురించి ఎవరు ఏం మాట్లాడినా.. కేంద్రం ఉలిక్కిపడుతోంది. ఈ వ్యాఖ్యలను తొలగించాలంటూ ఏకంగా ట్విటర్ కే నోటీసులు పంపింది.
రిహానా, గ్రెటాథన్‌బర్గ్ వంటి వాళ్లు భారతీయ రైతులపై సానుభూతి వ్యక్తం చేయడం కూడా తప్పే అన్నట్టుగా కేంద్రం తీరు ఉంది. వారి వ్యాఖ్యల్లో రెచ్చగొట్టే మాటలు ఏం ఉన్నాయో మనకు అర్థం కాదు గానీ.. ప్రభుత్వం అలా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడం వారిలోని భయానికి సంకేతంగా ఉంది.
రైతుల పోరాటాన్ని గౌరవించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. తమ నల్లచట్టాలను మార్చుకునే ఉద్దేశం కలగనంత వరకు.. ఈ ప్రతిఘటన ప్రభుత్వానికి తప్పదు. ఒక మెట్టు దిగడం అనేది ఓటమి కాదని నరేంద్ర మోడీ ఎప్పటికి తెలుసుకుంటారో వేచిచూడాలి.
#FARMERS #FarmersProtest #IndiaAgainstPropaganda #IndiaTogether #GretaThunbergExposed #IndiaStandsTogether #FarmersProstest #FarmersProtest
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021