బాల్య వివాహాల నియంత్రణకు బోలెడు చట్టాలున్నాయి. అయినా సరే మారుమూల పల్లెల్లో గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి వ్యవహారాలు జరిగిపోతూనే ఉన్నాయి. బయటపడితే సరే.. లేకపోతే.. ఇలాంటి దుర్మార్గాలకు పసిమొగ్గలు నలిగిపోతూనే ఉన్నాయి.
మైనారిటీ తీరని బాలికకు రహస్యంగా వివాహం చేసిన నేపథ్యంలో ఈ విషయం బయటకు పొక్కడంతో బాలిక మెడలోని తాళిని అత్త తెంచేసింది. అసలు వివాహమే జరగలేదని బుకాయించడానికి అత్త ఈ పనికి ఒడి గట్టగా బాలిక ఎదురు తిరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలు ఇవీ..
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన 34 సంవత్సరాల రాజశేఖర్ రెడ్డికి ఇచ్చి బంధువులు రహస్యంగా వివాహం జరిపించారు. ఈనెల 10వ తేదీ రాత్రి శ్రీకాళహస్తి వద్ద ఒక ఆలయంలో వివాహం నిర్వహించారు. ఈ వివాహం బాలికకు ఇష్టం లేదు.
దీంతో గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు గురువారం సమాచారం అందించారు. ఆ శాఖ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు గ్రామానికి విచారణ నిమిత్తం వస్తున్నారని తెలుసుకుని బాలిక మెడలోని తాళిని అత్త తెంచేసింది.
చివరకు ఆ బాలిక జరిగిన తతంగాన్ని పోలీసులకు వివరించింది. దీంతో బాలిక ఫిర్యాదుతో వివాహాన్ని జరిపించిన బంధువులతోపాటు వరుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన తల్లి తదితరులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మైనారిటీ తీరని బాలికకు వివాహం జరిపించిన అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
బాల్యవివాహాలను నిషేధిస్తూ ప్రభుత్వం 2006లో ప్రత్యేకంగా చట్టం తీసుకువచ్చింది. ఇలాంటి వివాహాల నియంత్రణకు ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేసి, ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్న వారికి శిక్ష పడేలా చేస్తే తప్ప సమాజంలో అకృత్యాలకు తెరపడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.

Discussion about this post