తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమందిరానికి రాజ్యసభ సభ్యుడు పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అయిదు కోట్ల రూపాయల విరాళం అందజేశారు. ధ్యానమందిరం నిర్మాణానికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామిరెడ్డి, ఆయన సతీమణ దాక్షాయణి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు.
తిరుమలలో చాలాకాలం పాటు ఆమె ధ్యానం చేశారని, ధ్యానం చేస్తూనే శ్రీవారిలో ఐక్యమయ్యారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దాత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి చైర్మన్ కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఇఇ శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

.