ప్రతి ఏడాది దీపావళి పండుగ వస్తోంది అంటే అంతటా సందడి నెలకొంటుంది. కానీ ఈఏడాది దీపావళి మాత్రం అన్నింటా సందడి లేకుండా చేస్తోంది. కొత్త బట్టలు కొనాలంటే… కరోనా భయం… ! టపాకాయలు కొందామంటే… అక్కడా కరోనా భయం వెంటాడుతుండడంతో కాస్త రద్దీ తగ్గింది. దీనికితోడు సుప్రీంకోర్టు అసలు టపాకాయలే కాల్చడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీచేయడంతో పాపం టపాకాయల వ్యాపారుల గుండెల్లో బండపడింది.
దీపావళికి నాలుగు రోజుల ముందునుండే రోడ్డుకి ఇరువైపులా ఖాళీగా ఉన్న జాగాల్లో చిన్న చిన్న టపాకాయల దుకాణాలు వెలుస్తుంటాయి. కేవలం నాలుగు రోజులపాటే ఉండే ఈ దుకాణాల్లో వేలు, లక్షల రూపాయల్లో వ్యాపారాలు జరిగేవి. కానీ 2020 దీపావళి మాత్రం వారి వ్యాపారానికి గండి కొట్టిందనే చెప్పవచ్చు. ఇటు కరోనా భయం… మరోవైపు కోర్టు తీర్పు… వెరసి టపాకాయల వ్యాపారం స్థబ్దుగా ఉండిపోయింది. దీంతో ఆగ్రహించిన టపాకాయల వ్యాపారులు, మీరు కొని కాల్చడం ఏంటి… మా టపాకాయలు మేమే కాల్చుకుంటాం… అని తమ టపాకాయలు తామే కాల్చుకుని ఇలా భిన్నంగా తమ నిరసన తెలియజేశారు. మొత్తానికి ఏదేమైనా ఈఏడాది టపాకాయల సడి తక్కువేనని చెప్పాలి… !
టపాకాయలు కాల్చడం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండగా, అసలు టపాకాయలు కాల్చడం వల్ల ఊపిరితిత్తులకు, శ్వాసకోసం సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కోర్టులో కేసు వేయడం, అది సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, చివరికి పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చుకోవచ్చని సుప్రీం తీర్పు ఇవ్వడంతో టపాకాయల దుకాణాలు వెలవెలబోతున్నాయి.
Discussion about this post