ఇప్పుడు ఆస్వాదన అనేది ఒక భావన. అనుభవంకాదు. మల్లెపూలు పరిమళాలు వెదజల్లే పుష్పాలని అందరికీ తెలుసు. కానీ మగువలు సిగలో పెట్టుకోవడానికి మక్కువ చూపకపోవడం వల్ల అది మగాళ్లకు అనుభవంగాక భావనగానే మిగిలిపోతోంది.
వర్షం పడితే కమ్మనైన మట్టి వాసన గతంలో అందరికీ అనుభవమే. కానీ ఇప్పుడు అది ఓ భావన. నాగరికత అనే ముసుగులో వీధి, వీధికి సిమెంటు రోడ్డులు వేసి మట్టి వాసనను భూస్థాపితం చేయడం వలన ముక్కు పుటాలకు కాంక్రీట్ కంపు అనేది ఇప్పుడు అనుభవం. మట్టి వాసన ఓ భావన.
అరుగు అనేది అప్పుడు అందరికీ అందమైన అనుభవం. ఇప్పుడు అది ఓ భావన. గతంలో పెద్దా, చిన్నా అందరూ తమ కష్ట, సుఖాలను చెప్పుకోవడానికి అది ఓ చక్కని వేదిక. ఇప్పుడు తమ కష్ట, సుఖాలను చెప్పాలన్నా వినే ఓపిక, టైం ఎవరికీ లేదు. చివరకు ఇంట్లో మనుషులు కూడా సంతోషాలను, సుఖాలను, బాధలను పంచుకోవాలనే ధ్యాస, ఆసక్తి లేదు. అందుకే సుఖ, దుఃఖాలనేవి ఇప్పుడు భావనలు. అనుభవాలు కాదు.
గతంలో మనుషులు జీవించడానికి సంపాదించేవారు. ఇప్పుడు సంపాదించడానికే జీవిస్తున్నాను. అందుకే అప్పుడు జీవితమనేది సజీవమైన అనుభవం. ఇప్పుడు జీవితమనేది జీవంలేని భావన.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికీ తెలుసు. అందుకే మన ముందు తరాల వారు దానికి విలువిచ్చి అందరూ అరటి ఆకులలో, విస్తరాకులలో కలిసి, మెలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. అందువల్ల అందరికీ ఆరోగ్యాలు బాగుండేవి. ఇప్పుడు ఏదో తినాలి కాబట్టి తినాలనే భావనతో కల్మషమైన మనస్సులతో, కృత్రిమమైన
ప్లాస్టిక్ ప్లేట్లల్లో పాశ్చాత్యుల వంటకాలైన పిజ్జా, బర్గర్ వంటి చెత్త పదార్థాలను ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ తినడం వల్ల అసలైన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు భోజనం అనేది అనుభవంకాదు. అది ఒక భావన.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే..
ఇప్పుడు ఎవరూ జీవితాన్ని అనుభవించి ఆస్వాదించాలనుకోవడంలేదు. ఊహా ప్రపంచంలో ఊగిసలాడుతూ, భావనల పరంపరలలో కొట్టుమిట్టాడుతూ అప్రయత్నంగా, అనాయాసంగా సుఖాలను పొందాలకుంటున్నారు. అందుకే ఇప్పటి జీవితాలు రసమయంగా ఉండడంలేదు.
ఏదైనా కష్టంగాని, సమస్యగాని వచ్చినప్పుడు దానికి ఎదురేగి, దానిలోని లోటుపాట్లు తెలుసుకుని అనుభవించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏదైనా సమస్యగాని, కష్టంగాని వస్తే బెంబేలెత్తిపోతూ, దానికి దూరంగా తప్పించుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అందుకే జీవితం నరకప్రాయంగా తయారవుతోంది.
కాబట్టి..
కష్టాలు వస్తే రాని కలబడుతాం.
నష్టాలు వస్తే రాని నలగగొడుతాం.
దుఃఖాలు వస్తే రాని దుమ్ము దులుపుతాం.
బాధలు వస్తే రాని భరించేస్తాం.
ఏదైనా రాని ఎదురేగుతాం.
అసలు జీవితంలో అందరూ భయపడేది మరణానికే అనేది జగద్విదితం. అది ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. కాబట్టి దాన్ని గురించి బాధ పడాల్సిన అవసరంలేదు. ఇక కష్టాలు, నష్టాలు అనేవి వస్తూ,పోతూ ఉంటాయి. ఇక దేనికీ బాధ.
“ప్రకృతి రసాస్వాదనమే గొప్ప తపస్సు” అని చలం చెప్పినట్లు జీవితాన్ని కూడా క్షణక్షణం ఆస్వాదిస్తూ అనుభవ పాఠాలు నేర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవడమే రసమయ జీవితం.
..దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
కొసమెరుపు:
ఇవాళ సాయంత్రం వర్షంపడుతోంది. వర్షాన్ని చూద్దామని వెళ్ళి వసారాలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను. అప్పుడే “ఆస్వాదన” అనే పదం నా మదిలో మెదిలింది.
అంతే ఈ ఆర్టికల్ రాయడానికి ఉపక్రమించాను వర్షాన్ని ఆస్వాదిస్తూ. ఆర్టికల్ రాయడం పూర్తైంది. సరిగ్గా అప్పుడే నేను కూర్చున్న కుర్చీ పళపళమని విరిగిపోవడంతో దబేల్ మని కింద పడ్డాను. కుడివైపు నడుము నొప్పి పట్టుకుంది. మా ఆవిడ మువ్ తెచ్చి రుద్దింది. అయినా నొప్పి తగ్గలేదు. హాస్పిటల్ కి వెళదామంది. వద్దన్నాను. మెడికల్ షాపుకి వెళ్ళి ట్యాబ్లెట్స్ అయినా తెచ్చిస్తానంది. అవసరంలేదన్నాను.
ఎందుకంటే..
ఆర్టికల్ రాసి నేనే ఈ కష్టాన్ని భరించకపోతే ఎలా? అనే ఉద్దేశంతో ఆ నొప్పిని ఆస్వాదిస్తూ నేనే నడుచుకుంటూ వెళ్ళి మందులషాపులో మాత్రలు తెచ్చుకున్నాను.
Discussion about this post