వారిద్దరిదీ కాటికి కాలు జాచిన వయసు. కటిక పేదరికం. పొట్ట కూటి కోసం ప్లాస్టిక్ కాగితాలు… బాటిళ్లు సేకరించే వారు. అలా సేకరించే వాటిని తమ పూరి గుడిసెలోనే దాచి… ఆ తరువాత విక్రయించే వారు. పొట్ట నింపే ప్లాస్టిక్ కాగితాలే వారి ప్రాణాలు తీస్తాయని వారు కలలో కూడా ఊహించి ఉండరు.
చివరకు వాటి కారణంగానే వృద్ధ దంపతులు ఆహుతయ్యారు. హృదయ విదారకర సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం రాత్రి పొద్దు పోయాక జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తి పట్టణ శివారులో లంకమిట్ట గిరిజన కాలనీలో వెంకటముని(85), లక్ష్మమ్మ (75) అనే వృద్ధ దంపతులు ఓ పూరి గుడిసెలో నివసించే వారు. వీరిది చాలా నిరుపేద కుటుంబం. వయసు మీద పడటంతో కూలీ పనులు చేయలేక పోయేవారు. ఈ నేపథ్యంలలో పొట్ట కూటి కోసం ప్లాస్టిక్ కాగితాలు.. సీసాలు సేకరించే వారు. అలా సేకరించే వాటిని విక్రయిస్తూ.. వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకునే వారు.
ఈ దంపతులు కొన్నేళ్లుగా ఇదే వృత్తితో జీవనం సాగించే వారు. ఇదిలా ఉండగా వెంకటముని, లక్ష్మమ్మ దంపతులు సోమవారం కూడా ప్లాస్టిక్ కాగితాలు సేకరించి ఇంటికి తీసుకొచ్చారు. వాటిని తమ నివసించే పూరి గుడిసెలో భద్రపరిచారు. రాత్రి భోజనం వండుకుని తిన్నారు. అయితే పొయ్యిలో నిప్పులు ఆర్పడం మరచి పోయారు. బాగా పొద్దు పోయాక నిప్పులు రగులుకుని మంటలు రేగాయి.
ఈ మంటల కారణంగా పూరి గుడిసెలో ఉంచిన ప్లాస్టిక్ కాగితాలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పూరి గుడిసె అంటుకుంది. వృద్ధ దంపతులు ఇద్దరూ గాఢ నిద్రలో ఉండటం… లేచి పరుగులు తీయడానికి శరీరం సహకరించక పోవడంతో… ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు.
ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పే లోపే వెంకటముని, లక్ష్మమ్మ దంపతులు దహనమయ్యారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన శ్రీకాళహస్తిలో విషాదం నింపింది.
.

Discussion about this post