ఒకే కారు క్షణాల తేడాతో రెండు ప్రమాదాలు సృష్టించింది. ఈ ప్రమాదాల్లో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ పైన ఒక కారు రెండు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఒకరు మరణించారు. బాలానగర్ సమీపంలోని ఫతేనగర్ కు చెందిన ఉదయరాజ్, తన బంధువు అనూషను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష అనంతరం వీరిద్దరూ సంఘీ ఆలయానికి బయల్దేరారు. దారిలో ఫ్లైఓవర్ పైన వేగంగా వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొనడంతో ఉదయరాజ్ గాలిలోకి ఎగిరి 20 అడుగుల కింద నున్న రోడ్డుపై పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఇదేకారు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దానిపై ప్రయాణిస్తున్న సాయిప్రియ, నగేష్ లు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఎల్బీనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకవైపు ఫ్లైఓవర్ లపైన తక్కువ వేగంగా పోవాల్సిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నా… వినకుండా వేగంగా ప్రయాణం చేస్తూ తమ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్న ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వారికి విధించే శిక్ష మరొకరు ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడానికి భయపడేలా ఉంటే మరింత మంచిది.
.
Discussion about this post