మన నోరు మంచిదైతే ఊరుమంచిది అని సామెత. అలాగే మీ మనసు మంచిదైతే మీ చుట్టూ వున్న ప్రపంచం కూడా మంచిదిగానే కనిపిస్తుంది. వుంటుంది. అలాకాకుండా మీరు అత్యాశకు పోయారంటే అది తప్పకుండా అనర్థానికి హేతువుగా మిగులుతుంది తప్ప మరేమీ కాదు… మీ ఆశ నిజమైనదే అయితే దానికి పరిస్థితులు కూడా సహకరిస్తాయి.
ఇప్పుడు అందరికీ ఏదోరకంగా డబ్బు సంపాదించాలనే ఆశ పెరిగిపోయింది. మరీ ఈ కరోనా వచ్చిన నేపధ్యంలో డబ్బు సంపాదన ధ్యాస మరీ పెరిగిపోయి, ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేయాలి అనే కోరికి జనాల్లో విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కోరిక తోబాటు మరికొందరిలో ఏదో ఒక విధంగా ఇలాంటి వాళ్లను బకరాలుగా చేసి తాము కోట్లకు పడగలెత్తేయాలని ఉవ్విళ్లూరుతుంటారు.
ఈ నేపధ్యంలో ఊరికొక బహుళజాతి కంపెనీలు, సందుకొక చిట్ ఫండ్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే వుంటాయి. ఈ కంపెనీలు తాము అనుకున్నంత దండుకోగానే చల్లగా బోర్డు తిప్పేస్తుంటాయి. దీంతో లబోదిమో మనడం దాంటో పెట్టుబడి పెట్టిన వారి వంతు అవుతోంది.
కేవలం ఒకే ఒక ల్యాప్ ట్యాప్ తో 2500మందిని బురిడీ కొట్టించి వాళ్లవద్దనుంచి ఏకంగా ఏడుకోట్ల రూపాయలను వసూలు చేసిన కొందరు యువకులు చివరికి అందరికీ టోపీ పెట్టి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ ఐదుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఒక యూకే కంపెనీ పేరు పెట్టుకుని అందులో పెట్టుబడి పెడితే మూడురెట్టు అధిక లాభం వస్తుందంటూ ఇలా పెద్ద సంఖ్యలో జనాలను నమ్మించారు. ఏడు కోట్ల రూపాయలు వరకూ వసూలు చేసుకుని చివరికి మొత్తం సర్దేశారు. మొన్నటికి మొన్న క్లిక్స్ చేస్తే డబ్బులు వస్తాయంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గోల్ మాల్ గురించి ఇంకా సద్దుమణగక ముందే మళ్లీ ఈ కంపెనీ సంఘటన బయటపడింది.
అయితే టిఎస్ఎస్ పీడీసీఎల్ లో పనిచేసే ఏఈ ఒకరు ఈ మాయాజాలంలో ఇరుక్కుని 1.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజులకు అటువేపు నుండి ఫొనులో సమాధానం కూడా రాకుండడంతో అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ యూకే (!) ముఠా గుట్టు రట్టయింది.
అయినా మనలోని అత్యాశే అవతలి వారికి మనల్ని మోసం చేసే అవకాశం కల్పిస్తోంది. అదే వాళ్లకు పెట్టుబడి. అదే వాళ్లకు లాభాలను అందిస్తోంది. ఇకనైనా మనలోని ఈ అత్యాశను కాస్తైనా కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి మోసగాళ్లు, కొత్త కంపెనీలు పుట్టుకొస్తూనే వుంటాయి. మనలాంటి వాళ్లను ఎరగా చేసుకుని, మోసం చేస్తూనే వుంటాయి. తస్మాత్ జాగ్రత్త!
.

Discussion about this post