అభ్యర్థుల ప్రకటన విషయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒక రకంగా ఆయన ఎవ్వరూ పల్లెత్తు విమర్శ చేయడానికి వీల్లేని విధంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి గురుమూర్తి పేరును ఖరారు చేశారనే మాట వినిపిస్తోంది. బల్లి దుర్గా ప్రసాద్ మరణం కారణంగా అనివార్యమైన ఉప ఎన్నికలో ఆయన కుటుంబానికే టికెట్ దక్కుతుందని అంతా అనుకున్నారు. ఎలా ఎదుర్కోవాలో ఎవరి వ్యూహరచనలో వారున్నారు. సాధారణంగా ఇలాంటి ఉపఎన్నికలో వారి కుటుంబంలో ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్లారు.
అదే సమయంలో బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఎలాంటి అసంతృప్తి లేకుండా జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్లాన్ చేశారు. గురువారం నాడు ఆయన పార్టీ నాయకులతో తిరుపతి ఎంపీ ఎన్నిక గురించి భేటీ కావడానికి ముందే.. వారు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని కలిసి.. పార్టీ అధినేత మనోగతాన్ని వివరించి.. వారికి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. ఆయన భార్య సరళమ్మ పోటీకి విముఖంగానే ఉండగా.. ఎమ్మెల్సీ చేస్తాననే హామీకి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ ఒప్పుకున్నారు. అటు అభ్యంతరాలు లేకుండా చేసిన తర్వాతే.. గురుమూర్తి పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా జగన్ మనసులో ఉన్న పేరును గుంభనంగా ఉంచారు.
గురుమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడం అనేది అనూహ్యమైన సంగతి. జగన్ వెన్నంటి ఉండి.. పాదయాత్రలో ఆయనకోసం పనిచేసిన గురుమూర్తి ఇప్పటిదాకా రాజకీయాల్లో లేరు. కళంకాలు లేవు. రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పించడానికి ఎలాంటి అవకాశమూ లేదు. నిజానికి చాలా పేదరికపు నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో మన్నవరం గ్రామ దళితవాడ నుంచి ఎదిగి, తిరుపతిలో ఫిజియో థెరపిస్టుగా ఉన్న యువకుడు.
మన్నవరం గ్రామం.. మారుమూల కుగ్రామం లెక్క. గ్రామానికి వెళ్లడానికి బస్సు సదుపాయం కూడా ఉండదు. రోడ్డు మీదనుంచి నడిచి వెళ్లాల్సిందే. ఒకప్పట్లో చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో ప్రాబల్యం కలిగిఉన్న కాళంగి భూపతి నక్సల్ దళం నాయకుడు భూపతి ఆ గ్రామానికి చెందిన వాడే.
ప్రస్తుతం జగన్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన గురుమూర్తి, పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన వాడు కావడంతో.. ఆయన ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాల వారెవ్వరూ అభ్యర్థి గురించి కించిత్ మాట అనడానికి వీల్లేకుండా పోయింది. అలా వైరిపక్షాలను ఇరకాటంలో పెట్టడం ద్వారా.. అభ్యర్థిని ఎంపిక చేయడంతోనే జగన్ పైచేయి సాధించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.