సంక్రాంతి పండుగ వస్తోంది అంటే.. అందరికీ గుర్తుకు వచ్చేది కోడి పందేలు.. గాలిపటాల సంబరాలు.
‘‘రేయ్ సమరసింహా.. ఆణ్ని గట్టిగా కొట్టరా.. ఎగర్రా.. ఎగిరి దూకు.. ఆణ్ని గట్టిగా కొట్టు.. ఆడి మెడమీదెయ్య దెబ్బ.. ఆణ్ని పడగొట్టావంటే.. నీకు మసాలా జీడిపప్పు ఫ్రై పెడతారా..’’ ఇలాంటి ఆవేశపూరితమైన డైలాగులు మనకు ఎక్కడ కనిపిస్తాయి. సినిమాలో విషయాన్ని పక్కనపెట్టండి. నిజజీవితంలో.. ఎక్కడ అంటే ఎక్కువగా కోడి పందేల్లో..
కోడి పందేల్లో నిలబెట్టే కోళ్లకు ఇలా సమరసింహారెడ్డి, ఆది, ఇంద్రసేనారెడ్డి లాంటి సినిమా పేర్లను పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం.. వింటూకూడా ఉంటాం.
అయితే ఇప్పుడు ఇలా సమరా.. అంటూ ముద్దుగా పిలుచుకునే కోడి స్థానాన్నే వరాహాలు కనిపిస్తాయి.. బహుశా వరాహాలకు ఇలాంటి పేర్లు పెట్టకపోవచ్చునేమోకానీ.. పందేలు మాత్రం షురూ.. కోడికి బదులుగా పంది.. అంతే పెద్ద తేడా ఏంలేదు.. ఫీల్డు అదే.. పోటీదారులు, బరిలో దిగి పోరే జీవులు వేరే అంతే తేడా..
కుక్కుటానికి బదులుగా వరాహం వచ్చిందే.. అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి.. ఏదైతేనేంలే అనుకుంటూ చూడ్డం ప్రేక్షకుల వంతు అయింది.
కోడి పందేల్లో లక్షలు చేతులు మారేవంటే ఆశ్యర్యపోన్నక్కర్లేది. అయితే ఈ పందేల వల్ల ఇలా కొందరు చేతులు కాల్చుకున్నవారు ఉండగా.. మరికొందరు చక్కగా పండుగనాడు ఓడిన కోడితో విందులు చేసుకునేవారుకూడా కద్దు.
అయితే ఇలా కోళ్లమీద పందేలు కాయడం ఏంటంటూ ప్రభుత్వం వారు కోడి పందేలను బ్యాన్ చేశారు. దీంతో పబ్లిక్ గా కాకుండా ప్రైవేటుగా కోడి పందేలు జరుగుతుండేవి.
వీటి గురించి పోలీసులకు తెలిసినా.. తెలియనట్టు ఉండేవారు. దీంతో ఊర్లల్లో సంక్రాంతి సంబరాలు అలా జరుగుతుండేవి. అయితో కోడి పందేలను గవర్నమెంటు వారు బ్యాన్ చేయడంతో ఏదైతేనేంలే అని అనుకున్నారో ఏమో పందేలరాయుళ్లు తాజాగా పందులతో పందేలు కాయడం ప్రారంభించారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కృష్ణా నదీతీరంలో మాత్రం కోడి పందేలు కాకుండా పందుల పందేలు జరిగాయి. ఆదివారం నాడు పందేల రాయుళ్లు ఊరపందులను పందేలకు ఉసిగొల్పి, చక్కగా ఎంజాయ్ చేశారు.
కొందరు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పందులను తీసుకునివచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. తొలిరోజు పన్నెండు వరాహ పోటీలు జరిగాయి. మొత్తానికి ఏదేమైనా కోళ్లేనా… పందులతో కూడా పోటీ నిర్వహించొచ్చు అనుకున్న పందేలరాయుళ్లు ఇప్పుడు ఊరపందులతో పోటీకి రెడీ అవుతున్నారు. కోడైనా… పందైనా.. ఏదైనాసరే.. పందేని రెడీ.. అంటున్నారు పందేలరాయుళ్లు. చూసేవారుమాత్రం ఆకారం కాస్త పెద్దదయింది.. అంతే అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
Discussion about this post