‘‘ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించండి. లక్షణాలు ఉన్నవారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించండి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’’- ప్రభుత్వం పైకి చెప్పే మాటలివి.
‘‘ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు పదికి మించి పరీక్షలు చేయొద్దు. ప్రధాన ఆస్పత్రులైతే 20కి మించొద్దు. ఇది ఉన్నతాధికారుల ఆదేశం. ఈ ఆదేశం ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే.’’- ఇది జిల్లా స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు.
ఇలా అయితే ఏం చేయాలి. పైకి ఏమో పరీక్షలు చేయాలని గాండ్రిస్తారు. లోపలేమో తగ్గించండని వారే చెప్తారు. ఈ రెండింటి నడుమ ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బంది నలిగి పోతున్నారు. కరోనా మూడవ దశ ఉధృతంగా ఉంది. క్రియాశీలక కేసుల్లో కానీ.. రోజు వారీ కేసుల్లో కానీ.. మరణాల సంఖ్యలో కానీ చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది.
వైద్యశాఖ నివేదికల ప్రకారం తాజాగా ఆదివారం మరో 1,198 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ కేసులతో జిల్లాలో ప్రస్తుతం 12,171 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 2,66,149కి చేరింది. కొవిడ్ మృతులు 1964 మంది. ఇంత మంది రాష్ట్రంలో ఏ జిల్లాలో మృతి చెందలేదు. ఈ గణాంకాలను బట్టి చిత్తూరు జిల్లాలో కరోనా ఉధృతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి అధికారిక గణాంకాలు చెప్పే సత్యం. అయితే వీరి లెక్కల్లో లేకుండా కరోనాతో మృత్యువాత పడిన వారు మరో వెయ్యి మంది ఉంటారు. ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.
కొవిడ్ మూడవ దశ జిల్లాలో చాలా తీవ్ర ప్రభావం చూపుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా జనం జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం రాగానే జనాన్ని కరోనా భయం వెంటాడుతోంది. వారు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి కరోనా పరీక్షలు చేయాలని వైద్యులను వేడుకుంటున్నారు. అయితే తమ వద్ద ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో లేవని.. రోజుకు పదికి మించి పరీక్షలు చేయొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ.. పరీక్షల కోసం వచ్చిన వారిని వెనక్కు పంపుతున్నారు. ఇలా చేయడంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శుక్రవారం, శనివారం వరుసగా ధర్నా చేశారు. తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద కూడా ఇదే తరహాలో జ్వర పీడితులు నిరసన తెలియచేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కానీ.. ఇదే పట్టణంలో ఉన్న మరో మూడు ఆరోగ్య కేంద్రాల్లో కానీ.. శనివారం కనీసం ఒక్క కరోనా పరీక్ష కూడా చేయలేదు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఇలా చేయించుకున్న వారిలో 17మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కరోనా పరీక్షలు లేకుండానే ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయాలంటూ ప్రజలు ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు చలించడం లేదు.
జిల్లాలో 9 రోజుల వ్యవధిలో 13,210మంది కొవిడ్ బారిన పడ్డారు. అదీ పరీక్షలు తక్కువ చేసినా. అదే పరీక్షలు రెండవ దశలాగా చేస్తే ఇంతకు రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తాయి. ఇలా వస్తే జిల్లా అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణ ఇచ్చుకోకుండా ఉండాలంటే కరోనా పరీక్షలు తగ్గించడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఉద్దేశ్య పూర్వకంగా కరోనా పరీక్షలు తగ్గించారనే విమర్శ బలంగా ఉంది. మరోవైపు ఆర్టీపీసీఆర్ కిట్ల కొరత కూడా వేధిస్తోంది. అవసరమైనన్ని కిట్లు ఆస్పత్రులకు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు ల్యాబ్ ల వారు కరోనా పరీక్షల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అవసరమైన వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయాల్సి ఉంది.
.

Discussion about this post