కర్నూలులో రోజురోజుకూ రాజకీయ వివాదం వేడెక్కిపోతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో మతాలను రెచ్చగొట్టి జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలిచినట్టు ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలని చూస్తే సహించేది లేదని శ్రీశైల నియోజక వర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు సవాలు విసిరారు. రాజాసింగ్ ఎప్పుడు వస్తారో చెబితే అప్పుడు శ్రీశైలం లో పెద్దల సమక్షంలో చర్చకు కూర్చుందామని, అప్పుడు రాజాసింగ్ చేసిన ఆరోపణలు నిజమని తేలితే తాను రాజీనామాకు సిద్ధమేనని, ఒకవేళ అబద్ధమని తేలితే రాజాసింగ్ రాజీనామా చేయడానికి సిద్ధమేనా అని ఆయన సవాలు విసిరారు.
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి హిందూ మతం అడ్డుపెట్టుకొని పైకి రావాలని చూస్తుందని, అది అంత తేలిక కాదని, అసలు శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తాము ఎవరు అని ఆయన ప్రశ్నించారు. వాళ్లంతా గత 40 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారని ఈ విషయంలో వాళ్లు సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారని ఆయన వివరించారు. ఈ నేపధ్యంలో రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తాను తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్నానని, అలాంటిది అతను నాకు బినామీ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.
అతను పార్టీ కార్యకర్త మాత్రమేనని, అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదని శిల్పా చక్రపాణిరెడ్డి హెచ్చరించారు. తన .హిందుత్వం గురించి మఠాధిపతులు, పీఠాధిపతులని అడిగితే తెలుస్తుందని, ఎన్నో దేవాలయాలకు ఆర్థిక సహాయం చేశానని, అలాంటి తనను పట్టుకొని హిందు ద్రోహి గా ముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వున్న బీజేపీ పార్టీలో కార్యకర్తలందురూ పెయిడ్ ఆర్టిస్టులేనని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీశైలం నియోజకవర్గంలో 10 ఓట్లు కూడా పడని బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కి బీజేపీ లో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడి పదవులు కట్టబెట్టారని ఆయన అన్నారు. బీజేపీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బుడ్డా శ్రీకాంత్ రెడ్డిలు చీడపురుగులుఃలాంటి వారని, ఇలాంటి వారిని తక్షణమే పార్టీనుండి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు.
.
Discussion about this post