‘చేరడమూ, చేర్చుకోవడమూ’ అనే రెండు పదాలకు కేవలం వ్యాకరణ పరమైన, ఒకే పనికి రెండు భావాలను ధ్వనించే వ్యత్యాసమే తప్ప మరొకటి లేదని మనకు తెలుసు! కానీ వర్తమాన రాజకీయాల్లో ఆ రెండు పదాల మధ్య చాలా చాలా తేడా కనిపిస్తోంది.
భారత రాష్ట్ర సమితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే ప్రయత్నాలను ప్రారంభించిన కేసీఆర్ ఆ సందర్భంగా మరో విషయం ప్రకటించారు. ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారని, త్వరలోనే చేరికలు ఉంటాయని సెలవిచ్చారు. ఇప్పుడే చేరితే.. ఫిరాయింపు చట్టంకింద పదవులు పోతాయి గనుక.. ఎన్నికలు ఇంకాస్త దగ్గరపడిన తర్వాత.. ఉప ఎన్నిక రాకుండా ఉండే వాతావరణం ఏర్పడ్డాక అలాంటి వారు ఉన్నట్లయితే భారాసలో చేరుతారని అనుకోవచ్చు.
అయితే కేసీఆర్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే అవుతున్నాయి. మహారాష్ట్రలో ఏక్ నాధ్ శిండే ప్రభుత్వం ఏర్పాటును ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఏపీలో ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
నిజం చెప్పాలంటే రాజకీయ ఫిరాయింపుల పుణ్యమా అని ఈ పదాలకు అర్థాలు మారిపోయాయి. ‘చేరడం’ అంటే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చి చేరడం లాగానూ.. ‘చేర్చుకోవడం’ అంటే ప్రలోభపెట్టి, తాయిలాలు చూపి, బెదిరించి చేర్చుకోవడం లాగానూ అర్థాలు స్థిరపడుతున్నాయి. అయితే రాజకీయ నాయకులు మాత్రం.. ఎలాంటి ప్రలోభాలు అవకతవకలకు పాల్పడినప్పటికీ.. ఏక పక్షంగా.. ఏది నైతికమని గుర్తింపులో ఉంటుందో తాము చేసినది అదే పని అని సమర్థించుకుంటారు.
అసలే తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర అనే ఎపిసోడ్ హాట్ హాట్ గా ఉండి ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇలాంటి నేపథ్యంలో బిజెపి చేసినట్టుగా చెబుతున్న ప్రయత్నాన్ని ప్రలోభాలతో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంటూ బోలెడు నీతులు వల్లిస్తున్న కేసీఆర్, గతంలో తెలుగుదేశం ఎమ్మెుల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అనుసరించిన పద్ధతిని ఏమంటారు? అనే ప్రశ్న ప్రజల నుంచి వినవస్తోంది.
ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. అయిదేళ్ల పదవీకాలం పూర్తవకుండా మరో పార్టీలోకి చేరడం అనేదే అనైతికమైన చర్య. వారు స్వచ్ఛందంగా వచ్చి చేరినా, వీరు ప్రలోభపెట్టి చేర్చుకున్నా.. అనైతికతలో మార్పు ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ‘చేరడమూ’, ‘చేర్చుకోవడమూ’ అనే జమిలి పదాల చుట్టూ… పరస్పర నిందారోపణల తాజా రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Discussion about this post