కేంద్రప్రభుత్వం ప్రకటించిన పది “ఉత్తమ గ్రామాల” జాబితాలో పదికి పదీ తెలంగాణ క్లీన్ స్వీప్ చేసిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల వేదిక చప్పట్లతో మారుమోగింది.
‘తెలంగాణ దేశానికే రోల్ మోడల్. అద్భుతమైన పరిపాలనతో ముందుకు సాగుతున్నాం. మనకు వస్తున్న రివార్డులు, అవార్డులే అందుకు తార్కాణం. దేశంలోని టాప్ 10 అత్యుత్తమ గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. పదికి పదీ తెలంగాణకు చెందినవే. 20 ఉత్తమ గ్రామాల జాబితాలో తెలంగాణకు చెందినవి 19 ఉన్నాయి. మన పనితీరుకు ఇది మచ్చుతునక,’’ అని కేసీఆర్ చెప్పడంతో కార్యకర్తలు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.
కేసీఆర్ పేరు వెల్లడించలేదు గానీ, అయన ప్రస్తావించింది అక్టోబర్ 2014లో కేంద్రప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణాభివృద్ధిప్రాజెక్టు అయిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (ఎస్ ఏ జీ వై). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రీతిపాత్రమైన ఈ పథకం కింద ఎంపీలు అభివృద్ధి కోసం గ్రామాలను దత్తత తీసుకోవచ్చు.
పార్టీ వేడుకలకు ఒక రోజు ముందుగానే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే టీ రామారావు ఈ ఘనత సాధించినందుకు తన తండ్రికి ట్విట్టర్‌లో అభినందనలు తెలియజేశారు. “సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలోని మొదటి 10 గ్రామాలలో మొత్తం 10 తెలంగాణకు చెందినవి. అంతేకాకుండా, టాప్ 20 గ్రామాలలో 19 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయన్న సమాచారం పంచుకోవడం గర్వంగా ఉంది. గౌరవనీయులైన సిఎం కెసిఆర్ గారి విజన్, ముఖ్యంగా ‘పల్లె ప్రగతి’కి హృదయపూర్వక అభినందనలు,’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు కేటీఆర్ ఆ గ్రామాల జాబితా ఉన్న పట్టికను కూడా షేర్ చేసుకున్నారు. తెరాస శ్రేణులు వెంటనే అభినందలు తెలియజేయడం మొదలు పెట్టారు.
ఇది ఉద్దేశపూర్వక ప్రయత్నమో కాదో తెలియదు కానీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దత్తత తీసుకున్న రంగారెడ్డి జిల్లా గుమ్మడవెల్లి గ్రామాన్ని ఆయన ట్వీట్ చేసిన జాబితాలో లేదు. కేటీఆర్ రెండు రకాలుగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. అందులో ఒకటి, ఈ గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ‘పల్లె ప్రగతి’ నిధులతో అభివృద్ధి చేశామని చెప్పడం. రెండు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివృద్ధి చేసిన గుమ్మడవెల్లిని మినహాయించడం. ఈ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ లో రెండో స్థానంలో ఉన్న గుమ్మడివెల్లి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేసుకున్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ ‘ఘనత’ సాధించినందుకు పొంగిపోయిన తండ్రీకొడుకులు తెలియక చెప్పలేదో లేక తెలిసీ దాచారో గానీ, ఈ ఉత్తమ గ్రామాల అభివృద్ధి జరిగింది కేంద్ర పథకం కింద, కేంద్ర నిధులతో, ప్రధానంగా బీజేపీ ఎంపీల సారధ్యంలో. ఉత్తమ గ్రామాల్లో మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ నియోజకవర్గం కరీంనగర్ లోనివి కాగా, ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనివి నాలుగు గ్రామాలు ఉన్నాయి. ముందుగా చెప్పినట్లు గుమ్మడవెల్లిని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దత్తత తీసుకున్నారు. మిగిలిన రెండు గ్రామాలు కాంగ్రెస్‌కు చెందిన కె.వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ గ్రామాలు ఏవీ టీఆర్‌ఎస్ లోక్ సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో లేవని గమనించాలి.
రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరికీ ఈ కేంద్ర పథకం అందుబాటులోకి వచ్చినా.. బీజేపీ ఎంపీల మాదిరిగా టీఆర్‌ఎస్ ఎంపీలు దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. గ్రామాలపై మక్కువ, శ్రద్ధతో బీజేపీ ఎంపీలు ప్రతికూల రాజకీయ అధికార వాతావరణం మధ్యన ఈ మంచి పనిచేసి జాతీయ స్థాయిలో ఆ గ్రామాలకు గుర్తింపు తెచ్చారు.
కేంద్ర పథకాలైన పీఎం ఆవాస్ యోజన, గ్రామ్ సడక్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ వంటి వాటి నుంచి నిధులను ఉపయోగించి ఈ గ్రామాలను అభివృద్ధి చేయాలని పథకం నిర్దేశిస్తుంది. ఎంపీలు ఎంపీ లాడ్స్ నుంచి కూడా తమ కోటాను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేట్స్ నుంచి సీఎస్ ఆర్ నిధులు వినియోగించవచ్చు.
ప్రజాప్రతినిధులు సమర్థంగా, నిబద్ధతతో పనిచేస్తే అభివృద్ధి సాధించవచ్చని బీజేపీ ఎంపీలు ఈ పథకం ద్వారా స్పష్టంగా నిరూపించారు. బీజేపీ ఎంపీల అద్భుత పనితనాన్ని కేసీఆర్, కేటీఆర్ నిర్లజ్జగా సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.
కేసీఆర్ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ‘నిరుపయోగం’ అని కొట్టిపారేయడం గమనార్హం. 2015 ఆగస్టు 20న జగిత్యాలలోని తుంగూరులో విలేకరులతో మాట్లాడుతూ- ఎస్‌ఎజివై కింద గ్రామాన్ని దత్తత తీసుకోవడం భారంగా మారిందన్నారు. “ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా దత్తత తీసుకున్న గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తాం?” అని ఆమె ప్రశ్నించారు. సహజంగానే, మేడమ్ గారు నిధులతో సంబంధం లేని ఏ పనిపైనా పట్టించుకునే అవకాశం లేదనుకోండి.
ఆశ్చర్యకరమైన అబ్బురపరిచే విషయం ఏమిటంటే- కుమార్తె అసహ్యించుకున్న పథకం క్రెడిట్ ను ఆమె తండ్రి, సోదరుడు కొట్టేయడం. కూతురు ఎగతాళి చేసిన ఈ పథకాన్ని బీజేపీ ఎంపీలు సమర్థంగా వాడుకుని గ్రామాలను అభివృద్దిచేస్తే ఆ మంచి పనికి తండ్రీ కొడుకులు క్రెడిట్ తీసుకున్నారు. ఇంకా విడ్డూరం ఏమిటంటే-‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం వల్లనే ఎస్ ఏ జీ వై లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పడం.
ఎస్ ఏ జీ వై పథకం కింద అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మొదటి పది గ్రామాలకు, భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన పది గ్రామాలకు మధ్య తేడా తెలంగాణ ప్రజలకు తెలియదని అయన భావించి ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు.
కేసీఆర్ ప్రసంగంలోని మరో గమనించదగిన కోణం ఏమిటంటే- ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, రివార్డుల పట్ల గర్వంగా ఫీలవుతూనే మరో పక్క కేంద్ర ప్రభుత్వం డర్టీ (గలీజ్) రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించడం ఏమిటో!
రచయిత తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి

Discussion about this post