సిగరెట్లు రేట్లు పెరిగితే సిగరెట్ కాల్చే అలవాటు ఉన్న వాళ్ళే బాధ పడతారు. వారి ఇంట్లో వాళ్ళు గానీ, ప్రజలు గానీ సానుభూతి చూపించరు. ఆ పెంచడం గురించి ప్రశ్నించడానికి సిగరెట్ అలవాటు ఉన్న వారికి సపోర్టుగా ఎవ్వరూ ఉండరు.
పైగా వెధవ సిగరెట్లు మానెయ్యచ్చుగా అని అంటారు. అలాగే మద్యం ధరలు పెరిగినా, తాగుడుకు బానిస అయినవాడు పడే బాధను ఎవ్వరూ పంచుకోరు. ఈ రకంగా అయినా వీడు తాగుడు మానేస్తాడేమో అని ఆశ పడతారు. సరిగ్గా ఇదే ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే అంశం. అందుకని ప్రభుత్వాలు సిగరెట్లు, పాన్ లు, గుట్కా, మసాలా, మద్యం ధరలు ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ పోతాయి. ఆదాయానికి ఆదాయం వస్తుంది, పైగా ప్రజలలో వ్యతిరేకత రాదు.
కొన్ని ప్రభుత్వాలైతే మరింత ప్రజల మన్ననలు పొందడానికి, సిగరెట్లు, మద్యం ధరలు పెంచడానికి కారణం, తాగేవారు మానేయ్యాలనే ఉద్దేశ్యమే అని చెప్పి గొప్ప చెప్పుకుంటారు. అమాయక ప్రజలు తమ వాళ్ళ ఆరోగ్యం కోసమే ప్రభుత్వం ధరలు పెంచి తమకు మంచి చేస్తోందని నమ్ముతుంటారు.
కానీ ప్రభుత్వం పూర్తిగా మద్యపాన నిషేధం చెయ్యదు, సిగరెట్ల కంపెనీల లైసెన్సు రద్దు చేయదు. ప్రభుత్వాలకు తాగుబోతులు తాగడం కావాలి. కానీ అలా చెప్పకూడదు కనుక ధరలు పెంచుతూ ఆదాయం పెంచుకుంటూ, ప్రజలలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటూ ఉంటుంది.
అలాగే కొత్త సినిమాకి మొదటి వారం రేట్లు పెంచడానికి అనుమతించడం. ఇది ఏ చట్టం ప్రకారం, ఏ రూలు ప్రకారం, ఏ కారణంగా, ఇలా మొదటి వారం రేట్లు పెంచడానికి అనుమతి ఇస్తారో తెలియదు. ఇది కొందరు హీరోల సినిమాలకు మాత్రమే ఇవ్వడం, మరి కొందరు హీరోల సినిమాలకు ఇవ్వకపోవడం వివాదాస్పదం అవుతూ ఉంటుంది. కానీ ఈ బాధ, గొడవ, అంతా ఆ నిర్మాతలది, సినిమా అభిమానులది మాత్రమే. సాధారణ ప్రజలు ఏమి పట్టించుకోరు. పైగా సినిమా వారం తరువాత చూడొచ్చు, ఎందుకు ఎగబడి మొదటి వారం లోనే చూడడం, డబ్బు దండగ చేసుకోవడం అని అంటారు.
డబ్బు లెక్క లేనివాడు, సినిమా పిచ్చోడు, హీరో అభిమానులు, మొదటి వారం అధిక రేట్లు పెట్టి టిక్కెట్లు కొని సినిమా చూస్తున్నప్పుడు, దాని గురించి మనకెందుకు అని కూడా అంటారు. ఇక్కడ కూడా ప్రజలు ప్రభుత్వాలను తప్పు పట్టరు. అది ప్రభుత్వాలకు, ఆ సినిమా నిర్మాతలకు కలిసి వచ్చే అంశం.
సిగరెట్లు, మద్యం ధరలు పెంచడం ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమం.
మొదటి వారం సినిమా రేట్లు పెంచడానికి అనుమతించడం ప్రభుత్వం అనుమతి ఇచ్చి చేయించే గాంబ్లింగ్, జూద వ్యసనం.
అయినప్పటికీ ప్రజల వ్యతిరేకత లేకుండా ప్రభుత్వాలు అటువంటి అవినీతి, అక్రమం, జూదం, చేసుకుంటూ పోతున్నాయి.
ఇవన్నీ ప్రజలలో ఉన్న బలహీనతల మీద ప్రభుత్వం చేసే అరాచకం.
వీటిని ప్రశ్నించక పోవడమే కాకుండా, తమను తాము బుద్ధి మంతులు, నీతిమంతులు అనుకునే ప్రజలలోని మేధావులు, మంచివాళ్ళు, సంఘ సంస్కర్తలు, ప్రభుత్వాలకు కొమ్ము కాస్తుంటారు.
ప్రజలు అమాయకంగా, బలహీనతల వలన, నష్ట పోయే వాటిని ప్రజా శ్రేయస్సు దృష్ట్యా నిషేదించడం ప్రభుత్వం చేయవలసిన పని. అందుకే లాటరీలు, గుర్రపు పందాలు, పేకాటలు, క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల బెట్టింగులు, వ్యభిచారం, అశ్లీల చిత్రాలు, అశ్లీల సినిమాలు, మొదలైన వాటిని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ వ్యక్తులు తమ వ్యక్తిగత ఆనందం, ఆహ్లాదం, వినోదం, కోసం చేసేవే. కానీ వాటిమీద ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది. ప్రజలు కూడా వాటిని అమోదించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తారు.
అవే కోవకి చెందిన సిగరెట్లు, మద్యం, సినిమా రేట్ల విషయంలో ప్రజలు ఉదాసీనంగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజల బలహీనతల మీద జరిగే జూదం వంటివే.
పరోక్షంగా ప్రజల ఆస్తులను, ఆరోగ్యాన్ని దోచుకుంటున్న దురవ్యసనాలే.
ప్రజలు వివేకం తెచ్చుకొని, ఆలోచనతో సిగరెట్లు రేట్లు పెంచడాన్ని, మద్యం ధరలు పెంచడాన్ని, సినిమా మొదటి వారం రేట్లు పెంచడాన్ని వ్యతిరేకించాలి.
తమ బలహీనతల మీద ప్రభుత్వం వ్యాపారం చేయడానికి ప్రజలు అనుమతించకూడదు.
– పి. పి. శాస్త్రి,
ఏలూరు.
Discussion about this post