ఏ భాషకైనా అక్షరం ప్రధానం.
భాష నేర్చుకోవడానికి ముందుగా అక్షరాలు దిద్దాలి.
చేతిని పట్టుకొని అక్షరాలు నేర్పించిన వారు తొలిగురువు.
ఆ అక్షరాలు మాలగా పేర్చుకుంటూ పదాలు, వాక్యాలు, పద్యాలు, వ్యాసాలు నేర్చుకుంటాము.
అది తప్పు లేకుండా నేర్చుకుంటే నడవడిక బాగుంటుంది.
‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు‘ అని అంటారు దేవరకొండ బాలగంగాధర తిలక్.
అక్షరాలను ఆయుధాలుగా చేసుకున్నారు శ్రీశ్రీ,, గద్దర్, నగ్నముని, జ్వాలాముఖి మొదలగు వారు.
అక్షరాలతో ప్రయోగాలు చేసారు ఆరుద్ర, కాళోజీ, జాషువా వంటి కవులు.
ఆత్రేయ, సినారే, సముద్రాల, వేటూరి, వంటి ఎందరో అక్షరాలతో ఆటలాడుకున్నారు.
ఇంకా ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, వాగ్గేయకారులు, అక్షరాలతో గొప్ప కావ్యాలను, గ్రంథాలను, కథలను రచించారు.
అక్షరం నేర్చిన మానవుడు గొప్ప పరిశోధనలకు శాస్త్ర గ్రంథాలను రచించి విజ్ఞానాన్ని విశ్వాంతరాలకు వ్యాపింపచేసారు.
అక్షరమే లేకపోతే మానవ మేధస్సు విస్తరించేది కాదు.
అక్షరమే నేర్చుకోకపోతే మానవ సంబంధాలు ఉండేవి కావు.
అక్షరం అనే ఆయుధమే విజ్ఞానానికి మార్గం సుగమం చేసింది.
అటువంటి అక్షరానికి ఇటీవల ఆదరణ తగ్గింది.
ఆదరించేవారు తక్కువయ్యారు.
చీత్కరించే వారు ఎక్కువయ్యారు.
అక్షరం సొగసును దిగుణీకృతం చేస్తున్నవారు ఎందరో మహానుభావులు ఉన్నారు.
కానీ దురదృష్టవశాత్తు వారి కృషి మరుగున పడిపోతుంది.
అక్షరాన్ని అవమానిస్తూ భాషను భ్రష్టు పట్టించే వారి వలన అక్షరానికి అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో అక్షరాన్ని అవహేళన చేస్తూ భాషను కించపరుస్తూ మాట్లాడడం, రాయడం, వీడియోలు చేయడం ఎక్కువగా జరుగుతోంది.
సినిమాలలో, సీరియల్స్ లో, రాజకీయ ఉపన్యాసాలలో, చట్ట సభలలో, సోషల్ మీడియాలో, దిగజారుడు భాష, పరుషమైన భాష, అసభ్యకరమైన భాష, ఇతరులను కించపరిచే భాష, మాట్లాడటం ఎక్కువయింది.
ఏ రకమైన భాష, ఏ యాస, ఏ పద ప్రయోగం, ఎక్కడ ఉపయోగించాలో తెలియకుండా పోవడం ఈనాటి దౌర్భాగ్యం.
కొన్ని మాటలు నాలుగు గోడల మధ్య వరకే పరిమితం.
మరికొన్ని మాటలు పరిమిత స్థాయి సమావేశం వరకే మాట్లాడాలి.
అటువంటి మాటలు సమాజంలో, సమావేశాలలో, ప్రజలందరికీ చేరే మాధ్యమాలలో మాట్లాడడం సరికాదు.
భాష సంస్కారాన్ని, సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించాలి.
నీ భాష నీ ఇష్టం కాదు.
నీ భాష సమాజ అమోదం కావాలి.
అందుకని ఇప్పుడు అందరూ అక్షరం దిద్దాలి.
– పి. పి. శాస్త్రి,
ఏలూరు.
Discussion about this post