నిద్ర ఆరోగ్యానికి అవసరం కావచ్చు.
జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవును
అతి నిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు, అని కూడా అన్నారు.
చక్కని నిద్ర పోయిన వాడు ఆరోగ్యవంతుడు అని అంటారు గానీ టైము ప్రకారం నిద్ర పోయిన వాడు ఏమైనా సాధించినట్లు చరిత్రలో లేదు.
ఎక్కడైనా నిద్రాహారాలు మాని అది కనిపెట్టాడు, ఇది సాధించాడు, అని అనడం విన్నాము గానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా హాయిగా టైము ప్రకారం నిద్ర పోయి,
వేళకు తిండి తిని ఎవరైనా ఏదైనా సాధించారని చెప్పడం విన్నామా? గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ రోజుకు 18 గంటలో, 20 గంటలో పని చేస్తూ కష్ట పడిన వారే.
ఆ మాత్రం కాలం వెచ్చించక పోతే ఏదైనా గొప్పగా సాధించడం సాధ్యం కాదు.
అయినా టైముకు పడుకోవాలి, వేళకి బాగా తినాలి అని చెప్తారు. చాలా మంది పాటిస్తారు, పాటిస్తామని గొప్పగా చెప్తారు. కానీ దాని వలన ఇది సాధించాము అని చెప్పిన వారు తక్కువ. టైముకి నిద్ర పోయి, తెల్లవారుజామునే లేచి, సంధ్యావందనాలు గావించి, భక్తితో పూజించి, వేళకు భోజనం చేసి, నిండు నూరేళ్ళు జీవించి ఏమి సాధించిక పోతే ఎందుకు?
ప్రతి మనిషికి ఒకే రకమైన, ఒకే పరిమాణంలో, ఒకే టైముకి , ఒకే లాగ తిండి, నిద్ర సరిపోదు. ఎవరి శరీరతత్వం బట్టి ఎవరికి ఎంత నిద్ర కావాలో, ఎటువంటి ఆహారం, ఎంత ఆహారం, ఎటువంటి వ్యాయామం, కావాలో నిర్ణయించుకోవాలి. మనం మన శరీరానికి ఏ విధమైన జీవన విధానం అలవాటు చేస్తామో, మన శరీరం దానికి తగ్గట్టుగా తయారవుతుంది. వ్యాయామం చేసి హాయిగా తిని పడుకోవాలో, మితంగా ఆహారం తీసుకుని, అవసరమైన నిద్ర పోయి, అందుకు తగిన వ్యాయామం చేసే జీవన శైలి పాటించాలో, ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
బ్రతక డానికి అవసరమైన నిద్ర, శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చే ఆహారం, తనకి, పొరుగు వాడికి, దేశానికి ఉపయోగపడే పని, ఏదైనా సాధించిన తృప్తి, పొందగలగడమే జీవిత పరమార్ధం కావాలి. మితంగా తిని, మితంగా నిద్రపోయి, మితంగా వ్యాయామం చేసి, ఆరోగ్యం మితంగా ఉంచుకుని, ఏదో సాధించిన, సాధిస్తున్న వారికి అంకితం.
మిగిలిన ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య స్పృహ ఉన్న వారు అపార్థం చేసుకోవద్దని (క్షమాపణలతో) మనవి.
– పి. పి. శాస్త్రి,
న్యాయవాది, ఏలూరు
Discussion about this post