ఒకప్పటి మిత్రులు, చిరకాలంగా శత్రువులు గంటా శ్రీనివాసరావు- అవంతి శ్రీనివాసరావు మధ్య విభేదాలు చల్లారలేదా? ఇటీవల ఒక కార్యక్రమంలో ఇద్దరు నాయకులూ కలిసి కనిపిస్తే.. ఇద్దరి మధ్యనా ‘సెట్’ అవుతున్నట్లుందని అంతా అనుకున్నారు. కానీ.. అదే వైషమ్యాలు ఇంకా కొనసాగుతున్నట్టుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరకుండా తొలినుంచి మోకాలడ్డుతున్న అవంతి శ్రీనివాసరావు.. తాజాగా.. గంటా అనుచరుడు వచ్చి పార్టీలో చేరినా కూడా గుర్రుమంటున్నారు.
విశాఖపట్టణం మునిసిపల్ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల్లోనూ అంతర్గత విభేదాలను రేపుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు రోడ్డుకెక్కి.. నాయకుల మీద నిందలు వేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం ముద్ర ఉన్న వారిని పార్టీని చేర్చుకునే విషయంలో వైసీపీ నాయకులు కూడా అలుగుతున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు.
అయితే, కాశీ విశ్వనాథ్ పార్టీలోకి రావడం పట్ల అవంతి శ్రీనివాస్ అలకపూనారు. ఆయన పార్టీలో చేరిన కార్యక్రమానికి కూడా మంత్రి అవంతి హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి కేవలం ఉత్తర నియోజకవర్గ ఇన్ చార్జ్ కెకె రాజు, మంత్రి కన్నబాబు, ఎంపి ఎవివి సత్యనారాయణ మాత్రమే హాజరయ్యారు.
దీనిని బట్టి.. రెండు అంశాలు అర్థమవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు టెక్నికల్‌గా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నంత మాత్రాన.. అక్కడ ఆయన అనుచరులకు, వర్గానికి విలువ లేకుండా పోయింది. అలాగని.. గంటాకు వైసీపీలోకి ఎంట్రీ దొరకడం లేదు. చివరికి ఆయన అనుచరులు వచ్చినా కూడా.. పార్టీలో మండిపడుతున్నారనేది తెలుస్తోంది.
.
Discussion about this post