గుంటూరు జిల్లా పెదపరిమిలోని మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన వృద్ధాలయాన్ని.. రాజ్యసభ ఎంపీ అయోధ్యరామిరెడ్డి గురుపూజోత్సవం నాడు ఘనంగా ప్రారంభించారు.
సెప్టెంబరు 5వ తేదీన వృద్ధాలయ ప్రారంభోత్సవం కన్నులపండువగా జరిగింది. సరిగ్గా ముహూర్తం సమయానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి భవనం ప్రధాన ద్వారానికి బిగించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆఫీసు, గ్రంథాలయం, ధ్యానమందిరం, 4 ఏసీ గదులు, 2 నాన్-ఏసీ గదులు మరియు డార్మిటరీలను అతిథులు ప్రారంభించారు. ట్రస్టీలు, గ్రామపెద్దలు తరలివచ్చి అతిథులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం సభ ప్రారంభమైంది. ట్రస్టు ఉపాధ్యక్షుడు మున్నంగి శ్రీనివాసరెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. సభకు అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు సారథి ఎమ్వీ రామిరెడ్డి మాట్లాడుతూ ట్రస్టు ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, పాతికేళ్లుగా అందించిన సేవల గురించి ప్రస్తావించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు, అందిన ప్రశంసలను గుర్తు చేసుకున్నారు. ట్రస్టు అధ్యక్షుడు వంగా సాంబిరెడ్డి గారు, కటికెల తిరుపతిరెడ్డి గార్లు గుర్తించిన భూమిని తన తమ్ముడు మువ్వా సతీష్‌రెడ్డి సహకారంతో కొనటం దగ్గర్నుంచి భవన నిర్మాణం పూర్తయ్యేదాకా సాగిన మజిలీలను వివరించారు. ఈ క్రమంలో అయోధ్యరామిరెడ్డి, దాక్షాయణి గార్ల నుంచి రామ్‌కీ గ్రూపు తరఫున అందిన విలువైన సహకారానికి మరియు ఎంతోమంది దాతలకు కృతజ్ఞతలు చెప్పారు.
ముఖ్య అతిథిగా హాజరైన అయోధ్యరామిరెడ్డి గారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా అటు యువతనూ, వృద్ధాలయం ద్వారా ఇటు పెద్దలనూ ఒకేచోట చేర్చటం అభినందనీయమన్నారు. సేవాభావమనేది మనసులోంచి స్వచ్ఛమైన ధారలా రావాల్సిందే తప్ప, అది కేవలం మెదడులోంచి ఊడిపడదన్నారు. పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా పెద్దలకు ఒక ఉమ్మడి వేదిక అవసరమన్నారు. అక్కడ ఒకరికొకరు తోడుగా ఉంటారని, తమ అనుభవజ్ఞానాన్ని కలబోసుకుంటారని అన్నారు. ఆ సంకల్పంతోటే ఏర్పాటైన ఈ ఉమ్మడి వేదికకు వృద్ధాశ్రమం అని కాకుండా, వృద్ధాలయం అని పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు.
ప్రసిద్ధ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్, ‘ఆరా’ సర్వే సంస్థ సారథి మస్తాన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పాలకసభ్యుడు కటికెల సాంబిరెడ్డి, విశాఖ ఫార్మా లిమిటెడ్ సీవోవో మోదుగుల వాసుదేవరెడ్డి, ‘గ్రీన్‌స్పేస్ హౌసింగ్ అండ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎం.డి. అల్లు గోవిందరెడ్డి, గ్రామపెద్ద నంబూరు బాబూరావు గార్లు మాట్లాడుతూ ట్రస్టు సేవల్ని ప్రశంసించారు. ట్రస్టు అధ్యక్షుడు వంగా సాంబిరెడ్డి, ట్రస్టీ మువ్వా సాంబిరెడ్డి గార్లు ముఖ్య అతిథిని ఆత్మీయంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు, ఉద్యోగం పొందినవారికి ఆఫర్ లెటర్లు అయోధ్య రామిరెడ్డి గారు అందించారు.
వృద్ధాలయం ప్రారంభోత్సం దృశ్యాలు
Discussion about this post