గత ఇరవై, ముప్ఫయి రోజులుగా తెలంగాణ లో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న ఏకైక అంశం-“కాంగ్రెస్ వస్తుందా? లేకపోతే, కేసీఆర్ మళ్ళీ వస్తాడా?”
ఎక్కడ చూసినా ఎన్నికల మీద చర్చ రంజుగా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో దేవుళ్ళు అయిన ఓటర్లు రేపు (నవంబర్ 30, 2023) తీర్పు ఇవ్వబోతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు చివరి అస్త్రాలను ప్రయోగించి ఓటరును సమ్మోహితుడిని చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బు, మందు, ఫుడ్డు సూత్రాన్ని నమ్ముకున్న వారంతా అధికారులకు కంట పడకుండా పంపిణీ చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇరవై దాకా వచ్చిన స్పాన్సర్డ్, ప్రొఫెషనల్ సర్వేలు జనాలను గందరగోళంలోకి నెట్టాయి.
అన్నేసి ఏళ్ళు జర్నలిజంలో ఉన్నపాపానికి-“ఏమిటి బాస్… నీ అభిప్రాయం ఏమిటి?” అన్న ప్రశ్నతో చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంతవరకూ మన ఎన్నికల జోస్యం ఒక్కసారైనా తప్పకపోవడంతో ఈ ఎక్వయిరీలు ఎక్కువ అయ్యాయి. రేపు పోలింగ్ నేపథ్యంలో నేను ఏమనుకుంటున్నానో అది ఇక్కడ రాస్తున్నా, రాగ ద్వేషాలకు అతీతంగా. అభివృద్ధి అజెండా లేకుండా వన్ మ్యాన్ షో తో రాష్ట్రాన్ని ఆగం పట్టించారు, మరీ దురహంకారం పెరిగింది, వెయ్యి మంది బలిదానాలు వేస్ట్ అయ్యాయి, ప్రొఫెసర్ పోస్టులు వేయలేదు, క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న బాధ, ఆవేదన, నిస్పృహ తప్ప నాకేమీ ఈ ప్రభుత్వంపై భయంకరమైన వ్యతిరేకత లేదు.
నేను జూన్ 2021 లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిట్ లో రాసిన వ్యాసం లో పేర్కొన్నట్లు పోకదలకాలం వస్తే ఏమి చేయాలని పుర్రెకు అనిపిస్తుందో అవన్నీ తెలంగాణ జాతిపితకు గట్టిగా అనిపించాయి. కమ్మగా తిని కడుపులో చల్ల కదలకుండా ఒక మూల కూర్చున్నా, నన్ను కన్సల్టెంట్ గా పెట్టుకుని నా మాట విన్నా హాయిగా హ్యాట్రిక్ ధీమా ఉండేది. పక్కా ప్రణాళికలు లేని పథకాలు, పైసల్తో జనాలను మభ్యపెట్టే స్కీం లు, నిరుద్యోగులు-ఉద్యోగుల పట్ల ఉదాసీనత, అధికారం మత్తు తలకెక్కిన తాలూకు మితిమీరిన ధీమా వంటి సవాలక్ష కారణాలకు తోడు పార్టీ పేరులో ‘టీ’ తీసి ‘బీ’ పెట్టి దేశవ్యాప్తంగా చెలరేగిపోవాలన్న పిచ్చి సంకల్పం కారు ప్రయాణాన్ని దెబ్బతీశాయని అనిపిస్తోంది. మనల్ను దేశంలో నమ్మేది ఎవరు? నమ్మనిది ఎవరు? అన్న కనీస అంచనా లేకుండా చిమ్మచీకట్లో హెడ్ లైట్లు ఆఫ్ చేసి నేషనల్ హైవే మీద బంపర్ స్పీడ్ తో పోయినట్లయ్యింది. సొంత మీడియాలో రిపోర్టర్లు, ఎడిటర్లు చూపించే జిందాబాద్ అభివృద్ధి చూసి నిజ్జంగానే కండపట్టామని అనుకోవడం ఎంత పిచ్చితనం! గత వారం రోజులుగా సాగిన డిఫెన్స్ ప్రచారం కొద్దిగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. వారికి పీఆర్ అండ్ కమ్యూనికేషన్ టీమ్ ఉన్నదో లేదో, ఉన్నా అది చచ్చుదో పుచ్చుదో, లేదా వాళ్ళు చెప్పినా పెద్దాయన వింటాడో వినడో గానీ అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మక ప్రసంగాలు చేయలేదు. నోటికొచ్చింది మాట్లాడారు. చాలా చోట్ల అధికార పార్టీ వీరులు ఇంటి ముఖం పట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి మిత్రులు చెబుతున్నది వింటే, చాలా షాకులు తగిలేట్టు ఉన్నాయి. అయినా, ఎన్నికల క్రీడా క్షేత్రంలో తలపండిన జాతిపిత ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడున్న నాయకుల్లో ఆయనే ఎవరెస్టు అంత పెద్ద! ముచ్చటగా మరోసారి పదవి ఇద్దామని జనం అనుకుంటే…తప్పేమీ లేదు. తెలంగాణ కు వారి అవసరం నిజానికి ఉంది. హంగ్ లాంటి స్థితి వచ్చినా కార్ హుషార్ అన్నట్లే.
కాంగ్రెస్ విరాట్ కోహ్లీ రేవంత్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. రేవంత్ రొమ్ము విరిచి కొమ్ములు తిరిగిన సీనియర్లు విసిరే బౌన్సర్లు, గూగ్లీ ల మధ్య సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరు పెంచుతున్న సమయంలోనే కర్ణాటక ఫలితాలు కొత్త ఊపుతెచ్చాయి. అప్పటిదాకా ఒక రకంగా ఉన్న స్కోరు బోర్డు జాతి గుఱ్ఱంలాగా దూసుకుపోయింది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తిరిగి వచ్చేయడంతో ఊపు పెరిగింది. గాంధీలు అమ్మ, అబ్బాయి, అమ్మాయి చేసిన ప్రచారం బాగుంది. ఒక పక్క రేవంత్ తనదైన భాషతో కుమ్ముతుంటే, తెలంగాణ ఇచ్చింది ఎవరు? వచ్చాక ఏమి వచ్చి చచ్చింది? అన్న అంశాలను వారు బాగా చెప్పారు. ఆరు సూత్రాలు కూడా పనిచేశాయి. స్వతహాగా కాంగ్రెస్ బంధువులతో పాటు ఏ బంధూ అందని బీదాబిక్కీ కూడా కారు మీద కోపంతో ఊగిపోతూ కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కాంగ్రెస్ కు రేవంత్ గాలి కొట్టి లేపితే కర్ణాటక ఫలితాలు ప్రభంజనం సృష్టించాయి. హంగ్ వస్తే గిస్తే తమ పార్టీ వాళ్ళను కాకి ఎత్తుకుపోకుండా చేయడం మీద కాంగ్రెస్ నాయకులు దృష్టిపెట్టాలి.
బీజేపీది హిట్ వికెట్ కేసు. మరో రెండు పరుగులతో సెంచరీ అనుకున్న బ్యాట్స్ మాన్ అటూ ఇటూ చూసి తన బ్యాట్ తో తానే వికెట్ కు కొట్టుకుని అంపైర్ తో సంబంధం లేకుండా తనకు తనే అవుట్ అని ప్రకటించుకుని పెవిలియన్ మొఖం పట్టి తమ డగౌట్ లోకి కాకుండా వైరి పక్షం స్టాన్డ్ లోకి వెళ్లి లీనమై కూర్చున్నట్లు ఉంది. ఇది అమాయకత్వమా? ఉన్మాదమా? వెఱ్ఱితనమా? సిరీస్ ఆఫ్ పాద యాత్రలతో మాంచి ఊపు తెచ్చిన బండి సంజయ్ ను పక్కన పెట్టిన రోజు నుంచి కమలం వాడడం మొదలయ్యింది. వడ్ల కొనుగోలు వ్యవహారం తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది. కెసిఆర్ తప్పులన్నీ కలిసి వచ్చి కమల వికాసానికి తోడ్పడడంతో స్థానిక బీజేపీ నాయకులకు కన్నూ మిన్నూ కానరాలేదు. తమకు కేబినెట్ లో కనీసం ఐటీ మినిస్టర్ పదవి వస్తుందా? అని కూడా కొందరు నిజమైన మేధావులు లెక్కలు కట్టుకున్నారు. తప్పేమీ లేదు. నేల విడిచి సాము చేస్తే కిందపడి నడ్డి విరగదా! లిక్కర్ స్కాం లో కవితక్కను అన్ని మాటలన్న వాళ్ళు చర్యలు తీసుకోకపోవడంతో జనం నమ్మకం వమ్మయ్యింది. వామ్మో…. రెండూ ఒకటే అన్న మాట బాగా ప్రచారమయ్యింది. కాంగ్రెస్ కు అవకాశం ఉన్నచోట్ల జనసేనను పట్టుకొచ్చి ఓట్లు చీల్చి కారు జర్నీకి సహకరించడమేమిటి? అన్న అపవాదూ వచ్చింది. కాంగ్రెస్ గెలుస్తూందో లేదో తెలవదు కానీ, బీజేపీ ఇంకో పదేళ్ల లోపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తెలంగాలో పొలిటికల్ సునామీ తెచ్చిన సీఎం మెటీరియల్ ఈటెల రాజేందర్, కాస్త చదువుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువన గిరిలో కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకుడిగానే ఉండి పోయి అనవసరంగా బీజేపీ లో చేరిన గూడూరు నారాయణ రెడ్డి లాంటి వాళ్ళను చూస్తే అయ్యో…ఆగమైపోతున్నారే అనిపిస్తున్నది. అందివచ్చిన చారిత్రక అవకాశాన్ని జారవడుచుకుని దివాలా తీయడం కమలనాథులకె చెల్లింది.
ఎంతో ఉత్సాహంగా పదవికి రాజీనామా చేసి చాలా ముందుగానే కదనరంగంలోకి దూకిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బర్రెల్లక్క లాంటి వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం బతికిన ఫీలింగ్ వస్తుంది. కెసిఆర్, రేవంత్, కిషన్ లకు బెస్ట్ విషెస్. ఈ విల్ హావ్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్.
అయ్యా/ అమ్మా…. సెలవు దొరికింది గదాని ఇంట్లో ఎంజాయ్ చేయకుండా ఒక గంట కేటాయించి ఓటేసి రండి. బడ్లు, సన్నాసులు, దొంగలు, దోపిడీ దార్లు, అందరూ అందరే…అన్న నిస్పృహ వీడి మంచీ చెడు చూసుకుని అలోచించి ఓటు వేయండి. ఓటు కు 10 వేల కు పైగా ఖరీదు కట్టిన పుండాకోర్లను ఓటుతో హుస్సేన్ సాగర్ లో ముంచండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి.
అల్ ద బెస్ట్.
డాక్టర్ ఎస్ రాము
సీనియర్ జర్నలిస్ట్
Discussion about this post