ఇవాళ గురుపూర్ణిమ. గురువులను పూజించుకోవాల్సిన, కనీసం స్మరించుకోవాల్సిన రోజు. మన జీవన శైలిలో గురువుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గురువు ప్రాధాన్యతను తెలియజెప్పే శ్లోకాలు మనకు అనేకం ఉంటాయి. అందరికీ తెలిసినది.. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ’ అనేది. అంటే తల్లి, తండ్రి ఆ తరువాత గురువు దేవుడితో సమానం అని ఆ వాక్యం చెబుతుంది. అంతకంటె గొప్పగా.. ‘గురుః బ్రహ్మా గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః’ అనే పాదం మరింత గొప్పగా త్రిమూర్తులతో సమానమైన ముఖ్యుడు గురువు అని కూడా చెబుతుంది. కానీ అంతకంటె గొప్పగా గురువు ప్రాధాన్యత గురించి ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ శ్లోకం చూడండి..
తాతే రుష్టే నృపః త్రాతా,
నృపే రుష్టే చ దైవతం
దైవే రుష్టే గురుః త్రాతా,
గురౌ రుష్టే న కశ్చనః
తాతః అని సంస్కృతంలో అంటే అర్థం తండ్రి అని! త్రాతః అంటే అర్థం రక్షించడం అని. రుష్టః అంటే కోపం. నృపుడు అంటే రాజు అనే సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం.
‘‘తండ్రి కోప్పడితే రాజు రక్షిస్తాడు. రాజు కోప్పడితే దేవుడు రక్షిస్తాడు. దేవుడే కోప్పడితే గురువు రక్షిస్తాడు. కానీ గురువే నీ మీద కోపగించుకుంటే ఇక రక్షించడానికి ఎవ్వరూ ఉండరు..’’ అనేది భావం.
గురువుకు ఉన్న ప్రాధాన్యం అదీ అని తెలుసుకోవాలి మనం.
Discussion about this post