దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందజేసిన పట్టు వస్త్రాలను ధరించి గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి గజ వాహనం పైనా… జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనం పైనా అధిరోహించి పెండ్లి మండపానికి బయలు దేరారు. ఆదిదంపతుల కల్యాణం కోసం పెండ్లిమండపం ముస్తాబైంది. ఈ కల్యాణ వేడుకలు తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం వేకువ జామున 3గంటల ప్రాంతంలో ఆది దంపతుల కల్యాణం నిర్వహించాలని ఆలయ పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి గంగాభవానీ సమేత పరమశివుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలో స్వర్ణాహరణాలతో అలంకరించారు.
ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం రాత్రి 11గంటల ప్రాంతంలో గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని గజ వాహనం పైనా.. జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని సింహ వాహనం పైనా అధిష్టింప చేసి పెండ్లిమండపం వద్దకు తీసుకొచ్చారు. స్వర్ణాభరణాలు ధరించి.. గజ. సింహ వాహనాలపై ఊరేగుతూ విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ధగధగ లాడుతున్న శివపార్వతులను చూసి భక్తులు పరవశించి పోయారు.
మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు మోగుతుండగా.. పదాతి దళాలు ముందు నడుస్తుండగా స్వామి, అమ్మవార్లు పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి తరువాత శివపార్వతుల పెళ్లితంతు ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్ల కల్యాణ ఘడియలో పెళ్లి చేసుకునేందుకు పలు జంటలు తరలి వచ్చాయి.
కాగా వందల సంవత్సరాలుగా ఈ కల్యాణ మహోత్పవానికి ఉభయదారులుగా కైకాల వంశస్తులే ఉంటూ వస్తున్నారు.
ఈ వంశానికి చెందిన నెల్లూరు జిల్లా చెంబేడు గ్రామంతో పాటు 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఉభయదారులు. అలాగే తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి సెంగుందర్, కులవెళ్తుత్తూరు, మరబినార్ కులాలకు చెందిన వారు అమ్మవారి తరపున ఉభయ దారులుగా ఉంటున్నారు.
.

Discussion about this post