కార్తీక మాసం పరమశివుడికి ఎంతో పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.. శివాలయాలన్నీ ఈ పవిత్ర కార్తీకమాసంలో శివనామస్మరణతో హోరెత్తిపోతాయి. కార్తీక మాసం సందర్భంగా ప్రతి చోటా వారి వారి శక్తి మేరకు అనేకానేక సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరుగుతుంటాయి. కార్తీక దీపోత్సవాలు, ఇతర ఉత్సవాలు శివుడికి సంబంధించి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో నే జరుగుతుండడం చాలా సాధారణం.
అలాంటిది దక్షిణ కాశిగా పేరు గాంచిన శ్రీకాళహస్తిలో మాత్రం.. కార్తీక మాసోత్సవాలకు చిన్న అపచారం జరిగింది. ప్రశస్తమైన ఈ వాయులింగ క్షేత్రంలో కార్తీక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిందిపోయి.. ఎక్కడో మారుమూల బ్రహ్మగుడి ప్రాంతంలో ఈ ఉత్సవాలకోసం వేదికను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం పొడవునా.. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కార్తీకం గడవకుండానే.. వాటికి అంతరాయం కూడా కలిగింది.
ఆలయం నుంచి విసిరేసినట్టు దూరంగా ఉండే బ్రహ్మగుడి ప్రాంతంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజల స్పందన తక్కువైంది. పైగా ఈ ఉత్సవాల గురించి నామమాత్రపు ప్రచారం కూడా నిర్వహించలేదు. కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు గానీ.. జనస్పందన లేకుండా వేదిక వెలవెలపోయింది. లక్షల రూపాయలు ఇలాంటి కార్తీక మాసోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఖర్చుచేసే అధికారులు ఆ ఉత్సవాలకు ప్రజలు కూడా బాగావచ్చేలా ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. నిజానికి ఆలయానికి ఇతర వేదికల సదుపాయం కూడా ఉన్నప్పటికీ ప్రశస్తమైన ఉత్సవాలను అంత మారుమూల పెట్టడమే సబబు కాదని పలువురు అంటున్నారు.
మధ్యలో కార్తీకమాసోత్సవాలకు అంతరాయమా?
ఈ వేదిక మీద నెలరోజుల పాటు కార్తీక మాసోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రెండు రోజుల పాటు ఆ ఉత్సవాలకు అంతరాయం వచ్చింది. కేంద్రప్రభుత్వపు సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు రెండు రోజులు ఈ వేదికను కేటాయించేశారు. తంజావూరు కేంద్రమైన సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇతర కార్యక్రమాలు ఆ రెండు రోజులూ జరిగాయి. శివుడి సన్నిధిలో కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలకు కేటాయించిన వేదిక రెండు రోజులు పరాధీనం కావడం భక్తులకు బాధ కలిగించే విషయమే.
కేంద్రప్రభుత్వపు సంస్కృతిక మంత్రిత్వ శాఖకు నిధుల కొరత ఉండదు. వారి కార్యక్రమాలను ఎంత గొప్ప వేదికమీదనైనా ఏర్పాటు చేసుకోగలరు. ఆలయం ఆధ్వర్యంలోనే ఉండే ఇతర వేదికలను కేటాయించి ఉండొచ్చు. అలా చేయకుండా.. కార్తీక మాసోత్సవాల వేదికను భగ్నం చేసి.. మద్యలో ఆ కార్యక్రమానికి ఇవ్వడం మంచి పద్దతి కాదని భక్తులు అంటున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
.

Discussion about this post