తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వచ్చే నెల 13 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆదివారం ఆవిష్కరించారు.
ఆహ్వానపత్రికలకు మొదట మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కార్య నిర్వహణాధాకారి కేవీ సాగర్ బాబు ఈ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీ సాగర్ బాబు మాట్లాడుతూ… మహాశివరాత్రి
వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బుల్లెట్ జయశ్యామ్, సాధన మున్నా రాయల్, ఆలయ అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ఆలయ అధికారులు నాగభూషణ్ యాదవ్, సుదర్శన్, సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్యెల్యే, ఛైర్మన్ లేకుండానే…
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు సాధారణంగా స్థానిక శాసనసభ్యులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది వీరిద్దరూ లేకుండానే ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సమయానికి వీరిద్దరూ స్థానికంగా అందుబాటులో లేరు.
ఈ కారణంగా తామే ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించామని అధికారులు అంటున్నారు. ఇలా చేయడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అందుబాటులో ఉన్న సమయంలో ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
.

Discussion about this post