శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ రథంపై అధిరోహించి స్వామి వారిని అనుసరించారు.
సూర్యప్రభ వాహనంపై పరమశివుడు విహరిస్తుండగా… మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై స్వామి, అమ్మవార్ల వెంట అనుసరించారు. మిరుమిట్లు గొలిపే రంగుల వలె కొత్త గొడుగులు, పదాతి దళాలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, కోలాటాలు, భజన బృందాలు ముందు నడుస్తుండగా… స్వామి, అమ్మ వార్ల పురవిహారం జనరంజకంగా సాగింది.
పురవీధుల్లో ఊరేగుతున్న పార్వతీ పరమేశ్వరులను భక్తులు దర్శించుకున్నారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ఈవో పెద్దిరాజు, డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post