సిఎం జగన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఏకపక్షంగా జరిపేందుకు కుట్ర పన్ను తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.
గురువారం జరిగిన మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ 175 స్థానాలలో గెలవాలని చెప్పడమే ఇందుకు తార్కాణమన్నారు.
స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు స్తృష్టించి, అడ్డదారిలో గెలిచి నట్టే ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవాలని భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో కూడా మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించనట్టే నియోజకవర్గంలోనూ గెలవాలని జగన్ చెప్పడం వెనుక ఆంతర్యం ఇదే అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి జగన్ ఆటలు సాగవని చెప్పారు. పైగా వైకాపా దౌర్జన్యాలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎదుర్కోవడానికి టిడిపి కార్యకర్తలు సిద్ధంగా వున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి, దౌర్జన్యాలు చేయడానికి జగన్ సిద్దపడుతున్నారని ఆరోపించారు.
అయితే ఇవన్నీ కలలుగానే మిగిలిపోతాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపి అఖండ మెజారిటీ సాధిస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ తండ్రి, తాత దిగి వచ్చినా కుప్పంలో చంద్రబాబు వెంట్రుక కూడా పీకలీరని అన్నారు. ఎన్నికలకు ముందే జగన్ జైలుకు వెళ్ళక తప్పదని జోస్యం చెప్పారు.
దోచుకోవడానికే జిల్లా అభివృద్ధి మండళ్ల చైర్మన్లుగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించి వారికి కేబినెట్ హోదా కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు ఉండగా జిల్లా అభివృధ్ది మండళ్ల అవసరం ఏమిటని నిలదీశారు.
మే నెల నుంచి వైకాపా గడపగడపకూ వెళితే జనం ఛీకొడతారని చెప్పారు. అధికారులు, పోలీసులు వెంట రాకుండా ఎమ్మెల్యేలు పల్లెల్లో తిరగలేరని అన్నారు. జగన్ రెడ్డి కలలు కనడం, కుట్రలు చేయడం మాని సక్రమంగా పాలన చేయాలని సుధాకర్ రెడ్డి హితవు చెప్పారు.
Discussion about this post