కోట్లు కొల్లగొడుతున్న ఇసుక మాఫియా: డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపణ
శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాలకు చెందిన వైకాపా నేతలు కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రమంతా ఇసుక మాఫియా చెలరేగి పోతోందన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది, సత్యవేడు నియోజకర్గంలోని అరుణా నదిలో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వపు ఇసుక రీచ్ లలో అవసరమైన వారికి ట్రాక్టర్ ఇసుక రూ.2150, పది చక్రాల ట్రిప్పర్ ఇసుక రూ.8,900 ఇస్తున్నారని తెలిపారు. అయితే ఇసుక మాఫియా రాత్రి పూట అక్రమంగా ఇసుక తలలించి, స్థానికులకు ట్రాక్టర్ ఇసుక రూ.4వేలకు… ట్రిప్పర్ ఇసుక రూ.20వేలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. చెన్నైలో లారీ ఇసుక 50 నుంచి 75 వేల రూపాయల వరకు రేటు పలుకుతోందన్నారు. కొంత మంది తెలివిగా ప్రభుత్వ రీచ్ ల నుంచి కొంత ఇసుక కొని దానికి నాలుగైదు రెట్లు దొంగతనంగా సేకరించి అమ్ము కుంటున్నారని చెప్పారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల నుంచి రోజుకు వంద టన్నులకు పైగా ఇసుక తరలి పోతున్నదన్నారు. అలాగే సత్యవేడు నియోజక వర్గంలోని సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాల నుంచి మరో వంద లోడ్ల ఇసుక మాయమవుతున్నదని తెలిపారు. ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి బీ ఎన్ కండ్రిగ, కేవీబీపురంలో డంప్ చేసి… అక్కడి నుంచి చెన్నై, ఇతర ప్రాంతాలకు లారీలలో పంపు తుంటారని చెప్పారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అండదండలతోనే ఇసుక మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అధికార బలం, లంచాలకు లొంగిన అధికారులు చేతులు ముడుచుకుని ఉన్నారని సుధాకర్ రెడ్డి అన్నారు.
.

Discussion about this post