రాజధాని అంటే ఒక రాష్ట్ర పరిపాలనకు గౌరవానికి కూడా సంబంధించిన విషయం! అయితే శోచనీయమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు.. ‘రాజధాని’ అనే పదమే ఒక రాజకీయ వ్యవహారంలాగా మారిపోయింది!
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ.. ఏం చెప్పిందో? ఏ సలహాలు ఇచ్చిందో? ఏ ప్రాతిపదికన రాష్ట్రంలోని వివిధ నగరాలను ప్రాంతాలను పరిశీలించిందో? ఎవరికీ తెలియదు, స్పష్టత లేదు! అయితే తొలిసారిగా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మాత్రం విజయవాడ- గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసి అమరావతి నగరాన్ని నిర్మించడానికి సంకల్పించారు. అయితే ఆ దిశగా పనులను చురుగ్గా చేపట్టడంలో ముందుకు వెళ్లలేక పోయారు. కృత్యాద్యవస్థ అన్నట్టుగా ఏదైనా పని ప్రారంభించే సమయంలో.. ఎక్కువ ఆలస్యం జరగడం సహజమే అయినప్పటికీ పూర్తి నగరంలో కొంత శాతమైనా పూర్తి కాకపోయినప్పటికీ.. ఒక దశ వరకు పనులను తీసుకువచ్చి ఉంటే ఒకటి రెండు భవనాలైనా పూర్తయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది!
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ‘రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే రాజధాని అనేది ఒకే చోట ఉండడం ఎప్పటికీ కరెక్ట్ కాదు’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నిజానికి హైదరాబాదులో అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, విభజన గురించి తెలంగాణ వాదులు డిమాండ్ చేసినప్పుడు తతిమ్మా సీమాంధ్రులంతా దారుణంగా వ్యతిరేకించాలని.. బాధపడ్డారని కూడా ఒక వాదన ఉంది. హైదరాబాదుతో సమానంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో అదివరకటి ప్రభుత్వాలు విఫలమయ్యాయి.. అనే వాదన కూడా ఉంది. అలాంటి తప్పు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజధాని అనేది మూడు రకాలుగా విభజించి, మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనగా తెరమీదకి వచ్చింది.
ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే! జగన్ నిర్ణయం తర్వాత అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్లి మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు తీసుకువచ్చారు. జగన్ తాజాగా దానిమీద సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు.
అయితే రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైనదంటే.. తటస్థులు ఎవ్వరూ కూడా రాజధాని అనే పదం ఉచ్చరించడానికి అవకాశం లేకుండా పోతోంది. రాజధాని గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తంచేసినా.. ఏదో ఒక పార్టీతో అక్రమ సంబంధాన్ని ముడి పెట్టేసి అవకాశమే కనిపిస్తోంది! రాజధాని అనేది ప్రపంచమంతా మన వైపు చూసే అతి పెద్ద సమున్నతమైన నగరంగా ఉండాలి.. శ్రమకోర్చి అయినా అలాంటిది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.. చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించినది మాయాజాలమే అనుకున్నప్పటికీ కూడా, ఆ మాయా నగరానికి సమీపంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది.. అని ఎవరైనా ఒక్క మాట అంటే వారు తెలుగుదేశం తొత్తులుగా ముద్ర పడిపోతుంది!
రాష్ట్ర అభివృద్ధికి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి.. తెలంగాణ విడిపోతున్నప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ఇతర ప్రాంతాల్లో రేగాయో అలాంటి సమస్య భవిష్యత్తులో మళ్లీ ఉత్పన్నం కాకూడదు.. మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండడమే మంచిది.. అని ఎవరైనా అంటే గనుక వారి మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తైనాతీలు అనే ముద్ర పడిపోతుంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు తటస్థులు ఎవరికైనా సరే రాజధాని అనేదే ఒక అంటరాని పదం అయిపోయింది. తటస్థంగా ఉండే తాము రాజధాని అనే మాట తర్వాత ఏ అభిప్రాయం వెలిబుచ్చినా.. తమకు రాజకీయ రంగు పులుముతారనే భయం పెరిగిపోయింది. ఇది చాలా శోచనీయమైన పరిణామం. ప్రజలు తమకు కావలసిన రాజధాని గురించి అభిప్రాయాలు కూడా చెప్పుకోలేని స్థితికి.. రాజకీయ పార్టీల విద్వేషపూరిత ఏకపక్ష ప్రచారాలు పరిస్థితులను దిగజార్చేశాయని చెప్పాలి!
Discussion about this post