విరిసే సంతోషాలతో మురిసే పుడమి
మరింత దృఢంగా పెనవేసుకుంటున్న బంధాలు!
సమూహంలో ఒంటరిగా నేను!
ఈ ముడులన్నీ కూడా అవే అనే
ఓదార్పు మాటలను చిలకరించుకుంటూ..
హస్తభూషణంలోని అనంత వెల్లువల జడిని
వడివడిగా విదిలించుకుంటూ..
క్షితి ఉపరితలం నుంచి
నిటారుగా లోపలకు తల దూర్చేస్తూ
దాన్ని దాచడానికి పాతాళాన్ని వెతుకుతున్న నేను..!
అది కనపడకుండా..
ఏదీ వినపడకుండా..!
ఆ చీకటి కుహరంలో
ఈ పూటకి ఇరుక్కుపోతే.. అదొక నిశ్చింత!
బరువును మోయలేని ప్రతీ సందర్భంలో
పారిపోవడానికి, నాకు
ఆస్ట్రిచ్ బాట ఆరాధ్యం అనిపిస్తుంది!
పాతిపెట్టేస్తుంటాను-
శిరస్సునూ
శితమనో పరితాపపు వేదననూ
సిత తీయదనాలై కాల్చే ఊహల్నీ
సమస్తంగా సమూలంగా పాతిపెట్టేస్తుంటాను!
శ్రిత వత్సలుడిని పదే పదే నిందిస్తుంటాను
స్మిత బాసిన భావోద్వేగాల బారిన పడుతుంటాను
తనను తాను శిరోమాత్రంగా ఎంచి
ఆ అస్తిత్వాన్ని భూగర్భంలో దాచేసి
భయాన్ని దూరం చేసుకుంటున్న..
భ్రమలో బతికేస్తూ ఉండే..
ఆస్ట్రిచ్ పదేపదే గుర్తొస్తుంటుంది.
బాహ్యప్రపంచంతో నిస్తంత్రీ బంధాలను కత్తిరించి
బహిర్ వ్యవహారాలు యావత్తుకూ పాతర వేసేసి
గుండె తలుపులు మూసేసి- గొళ్లెం పెట్టేస్తుంటాను
ఇక భద్రం అనుకుంటాను..
భయం అంటదనే, బాధ సోకదనే
శోకం సాంతం మింగగలననే
భ్రమల్ని ఒళ్లంతా పులుముకుంటాను!
ఆస్ట్రిచ్ కి తర్వాత ఏమై ఉంటుందో..?
ఉపశమనం కలిగిందో లేదో..?
నాకు మాత్రం..
ఊరడిల్లేలోగా చిటపట చప్పుళ్లు..
ఫెటిల్మనే చిరు విధ్వంసారావాలు..
ఉక్కు తలుపులు నెర్రెలు బారుతుంటాయి..
లోపలి కీలలు
నెమ్మదిగా బయటికి పాకుతుంటాయి.!
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
22 ఆగస్టు 2021
Discussion about this post