సురేష్ పిళ్లె :: సోషల్ ఫైటర్స్ బీ అలర్ట్!

217

ఏ విషయంలో అయినా సరే తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఇప్పుడు మీడియా అక్కర్లేదు. మీడియా అంటే పేపర్లు, టీవీ ఛానెళ్లు అక్కర్లేదు. వాటికి సమాంతరంగా సోషల్ మీడియా ఉంది. మన సోషల్ మీడియా ప్లాట్ ఫాంల మీద యథేచ్ఛగా మన అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. మన ఫాలోయర్స్ గా సాధారణంగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు గనుక.. వారందరికీ మీ అభిప్రాయం చేరుతుంది. వారిలో దానిని పూర్తిగా నమ్మిన వాళ్లు, నచ్చిన వాళ్లు షేర్ చేస్తారు. వారిద్వారా మరికొందరికి వెళుతుంది. ఆ రకంగా లైక్ మైండెడ్ అనే కేటగిరీలో  మీ ప్రతి ఒపీనియన్ కూడా కొన్ని లక్షల మందికి చేరే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ లోని మీడియాకంటె ఎక్కువగా.. సోషల్ మీడియా పనిచేస్తుంది.

అయితే ఈ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు చెప్పడంలో పరిమితులు లేవా? ఏది పడితే అది చెప్పేయచ్చా..? ఫలానావాడు దొంగ, ద్రోహి, హంతకుడు అని నిందలు వేసేసి ప్రచారంలో పెట్టొచ్చా. అది కరక్టేనా? దీనికి అడ్డుకట్ట ఎలాగ? భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఏమైనా అనేయవచ్చా? అంటే కుదర్దు. ఏదో ఒక పద్ధతి ఉండాలి. ఒక నియంత్రణ ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి ఒక చట్టం తీసుకువచ్చింది. అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియా పోస్టులపై పోలీసు కేసులు నమోదు చేసే చట్టం అది. తాజాగా అది చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే.. విచారణలు, అరెస్టులు, కేసు నమోదులు చురుగ్గా జరుగుతున్నాయి.

గుంటూరుకు చెందిన పూదోట రంగనాయకమ్మ అనే మహిళను సీఐడీ పోలీసులు విచారించారు. ఆమె వయస్సు 60 ఏళ్లు పైమాటే. ఆ వయస్సు వారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకూడదనే నిబంధన లేదు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి సంబంధించి ఆమె ఫేస్ బుక్ లో పోస్టుచేసిన వ్యాఖ్యలు అరెస్టుకు కారణం. నిజానికి ఈ పోస్టు అంటే ఈ వ్యాఖ్యలు ఆమె సొంతంగా చేసినవి కాదు. మల్లాది రఘునాధ్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఆ పోస్టుకు షేర్ ఆప్షన్ కూడా లేకుండా చేశాడు. అయితే రంగనాయకమ్మ వాటిని కాపీ చేసి మరీ తన టైంలైన్ లో పోస్ట్ చేసింది. రఘునాధ్ మీద కూడా కేసు ఉంది. ఎందుకు అరెస్టులు జరగలేదు.. మిగిలిన స్టైరిన్ గ్యాస్ ను ఎందుకు దక్షిణకొరియాకు పంపేలా అనుమతించారు. వంటి 20 ప్రశ్నలు ఆమె పోస్టులో ఉన్నాయి.

పోలీసులు విచారించడం, ప్రజాభిప్రాయాన్నే చెప్పాను తప్ప, ప్రభుత్వ వ్యతిరేకత తన ఉద్దేశం కాదని ఆమె చెప్పడం.. ప్రస్తుతానికి పోలీసులు విడిచి పెట్టడం జరిగింది. ఇలాంటి కేసుల్లో అరెస్టయిన ఎవ్వరైనా సరే అదే సమాధానం చెప్తారు. అదే సమయంలో మరో ఇద్దరి మీద కూడా ఇలాంటివే కేసులు నమోదయ్యాయి. రంగనాయకమ్మ గతంలో తన ఫేస్ బుక్ అకౌంట్ లో చేసిన ఇతర పోస్టుల మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులు ఒకటి విషవాయువు, ఒకటి కరోనా, మూడోది రైతు ధర్నాలు.. అని ఆమె కామెంట్ చేసిన పోస్ట్ కూడా వెలుగులోకి వస్తోంది. ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా ఆమె విమర్శలు విచారణార్హం అవుతున్నాయి.

అభిప్రాయాల వెల్లడికి సోషల్ మీడియా అద్భుతమైన వేదిక కావొచ్చు. ఇక్కడ అభిప్రాయాలు వెల్లడించడం ద్వారా.. గదిలోంచి బయటకు అడుగుపెట్టకుండానే.. సెలబ్రిటీలు అయిపోవచ్చు. కానీ.. రాజకీయవిమర్శలు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. బహుశా రంగనాయకమ్మ పోస్టులోనే మూడు రాజధానుల గురించిన మాట.. ‘మూడు రాజధానుల్లో ఒక చోట విషవాయువు అమాయకుల్ని కబళించింది.. ఒకచోట కరోనా మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి, మూడో చోట 150 రోజులుగా రైతుల ఆక్రందనలు వినిపిస్తున్నాయి’ అని ఉంటే గనుక.. దానిపై కేసు నమోదు కుదరకపోవచ్చు. అది వాస్తవాల నివేదన అయ్యేది. ఆమె చెప్పదలచుకున్న వ్యాఖ్య, వ్యంగ్యం, ఎత్తిపొడుపు అన్నీ చదివిన ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతాయి. కానీ, తన మాటల్లోనే ఆ వ్యంగ్యం చేర్చడం వల్ల.. ఇవాళ పోలీసులు కూపీ లాగుతున్నారు.

సోషల్ మీడియా అభిప్రాయాలను విస్తృతంగా పంచుకోడానికి అద్భుతమైన వేదిక. అదే సమయంలో రాజకీయంగా ఘోరమైన దుర్వినియోగం జరుగుతోంది. సోషల్ ప్లాట్ ఫామ్స్ మీద.. ప్రతి పోస్టును ప్రతి వార్తను కులం కళ్లలోంచి మాత్రమే చూసే సంకుచితమైన యువతరం.. విచ్చలవిడిగా అసభ్య, బూతు కామెంట్లు పెట్టడం కామన్ అయిపోయింది. సరైన నియంత్రణ అన్నదే లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు తమ సొంతానికి పాజిటివ్ ప్రచారం చేసుకోడానికి వీటిని వాడుకోవడం మంచి పరిణామం. అదేసమయంలో.. తమ వైరిపక్షాలపై బురద చల్లడానికి వాడుకోవడమే ఘోరం. అందులో శృతిమించిన వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని కట్టడి చేయడానికే జగన్ సర్కారు చట్టం తెచ్చింది. ప్రస్తుతం నమోదయ్యే కేసులన్నీ అవే. వైకాపాకు వ్యతిరేకంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలే కేసులు అవుతున్నాయి. అయితే ఇలాంటి విషప్రచారాలు తెలుగుదేశానికి వ్యతిరేకంగా కూడా జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు పాలనకాలంలో కూడా జరిగాయి. అప్పుడు ఇంత కఠిన చట్టాలు మాత్రం లేవు. వారిమీద  ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ నమోదైన కేసులు తక్కువ. జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టం.. ఎవ్వరి మీద ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు వచ్చినా సరే.. అంటే తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీలోని మహిళా నేతలకు వ్యతిరేకంగా పోస్టులు చేసిన వారిపై కూడా సమానంగా పనిచేస్తే.. ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి.

ఆ సంగతి పక్కన పెడితే.. అసలు ఇలాంటి కేసుల్ని నమోదు చేస్తున్న చట్టాలేమిటి? సెక్షన్లు ఏమిటి? వాటి లోతు ఎంత? వాటి పరిధిలోకి రాకుండా, కేసుల్లో ఇరుక్కోకుండా తమ అభిప్రాయాలను వెల్లడించడం ఎలాగ? అనేది మనం, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాళ్లు తెలుసుకోవాలి. ఇవాళ్టి రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు మాత్రమే కేసులు అవుతున్నాయి. అంతకు మించిన దుర్మార్గమైన పోస్టులు.. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు అనేకం వెల్లువలా వస్తున్నాయి. అలాంటివాటిమీద ఎవరు కేసు పెట్టినా.. ఈసెక్షన్ల కింద పోలీసు యంత్రాంగం ఇంతే వేగంగా పనిచేస్తేనే.. సోషల్ మీడియా దుర్మార్గాలని అరికట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నమ్మచ్చు.

ఈ పరిణామాలను చూసి సోషల్ ఫైటర్స్ అలర్ట్ కావాలి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ, అతి చేయకుండా జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే.. సోషల్ మీడియాను పాశుపతాస్త్రంలాగా వాడదలచుకున్న వ్యక్తులు.. ముందు ఈ చట్టాల గురించి తెలుసుకోవడం కూడా అవసరం.   ముందుముందు ఆ చట్టాల గురించి కూడా విపులంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

 

Facebook Comments