అతిశయోక్తిగా, ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! పెట్రోలు డీజిల్ మీద దేశంలో ఏటా వసూలు అవుతున్న పన్నుల మొత్తమే 5 లక్షల కోట్లు! అమ్మకపు ధరమీద 60 శాతం రకరకాల పన్నులరూపేణా వసూలు అవుతోంది. ఈ వివరాలన్నీ స్వయంగా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పార్లమెంటులోనే ప్రకటించారు.
పెట్రోలును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను మాత్రమే అమలవుతుంది. దానినే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పంచుకోవాలి. కానీ వినియోగదారుడికి పెట్రోలు చవగ్గా లభిస్తుంది. అప్పటికీ.. ఈ దేశంలో అమలు కాగల అత్యధిక పన్నును విధించినప్పటికీ.. పెట్రోలు చవగ్గా దొరుకుతుంది. కానీ.. ఇలా జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. రాష్ట్రప్రభుత్వాలు కోల్పోయే మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు. ఇది స్వయంగా సుశీల్ కుమార్ మోదీ వెల్లడించిన గణాంకాలు.
పెట్రోలు పేరుతో ప్రజల నెత్తురు తాగుతున్న ప్రభుత్వాలు.. దానిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడంలేదో.. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా దోచుకుంటున్నాయని అర్థం అవుతోంది. జీఎస్టీ గురించి అందరూ మాట్లాడే వాళ్లే గానీ.. జీఎస్టీ కౌన్సిల్ ముందు అధికారికంగా ఎవ్వరూ ప్రతిపాదనలు చేయడంలేదనేది సుశీల్ మోదీ వాదన. ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్రాల వారు కూడా ఇలా చేయడం లేదని ఆయన అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ప్రతిపాదన తెస్తే, ఈసారి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తీసుకురావడంపై చర్చిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. ఆమె కూడా చర్చకు సిద్ధం అంటున్నారే తప్ప.. రాష్ట్రప్రభుత్వాలు ప్రతిపాదన తెస్తే.. దానిని ఆమోదిస్తామనే పదం వాడడం లేదు.
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రకరకాల నాటకీయమైన మాటలతో పెట్రోధరల విషయంలో ప్రజలను దోచుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
.

Discussion about this post