తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనుంది. రెండు మూడు రోజుల్లోనే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి నియోజకవర్గాల వారీగా కీలక నేతల సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. అయితే ఇతర పార్టీల కంటే ముందుగా తెలుగుదేశం తన అభ్యర్థిని ప్రకటించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి ని మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పనబాక లక్ష్మి పార్టీ అధినేత చంద్రబాబు ను కలిశారు. ఆమెతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంట ఉన్నారు.
ఎన్నికల కార్యాలయాన్ని ఈ వారంలోనే ప్రారంభించనున్నట్లు పనబాక లక్ష్మి పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ శ్రేణులు పని చేయాలని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపల్ వార్డులకు ఇన్ ఛార్జీలను నియమించాలని ఆదేశించారు. పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి నరసింహ యాదవ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి తెలుగుదేశం ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టమౌతుంది.
.

Discussion about this post