సాధారణంగా వేతన సవరణ కమిటీ నివేదిక ప్రకారం వేతన పెంపు చేయడం సహజం. అయితే తాజాగా ఈ వేతన సవరణ కమిటీ సిఫారసులను గమనిస్తే వేతన పెంపు విషయాన్ని పక్కనపెడితే వేతన కోత మాత్రం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఉద్యోగులు భారీగా పెరుగుతుందని ఊహిస్తూ వస్తోన్న వేతన పెంపు సిఫారసు తుస్సుమంది.
వేతనపెరుగుదలను ఎదురుచూసిన ఉద్యోగులు వేతన కోత ఎదురుకావడంతో ఖంగుతిన్నారు. ముఖ్యంగా సి.పి.ఎస్ ఉద్యోగులైతే మరింతగా కుదేలవుతున్నారు. అసలే తమకు పెన్షన్ పథకం ఉండదు. ఉన్నదల్లా తమ వేతనంలోనే ఎంతోకొంతమేర కోత. దీంతో చేసేదిలేక ప్రభుత్వ ఉద్యోగం ఉంది చాల్లేమనుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నారు. పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలకోసం ఎన్నో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి, బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్న తరువాత ఆ ఉద్యోగాన్ని నిర్వహించడానికి నానాతిప్పలూ పడుతూ తమ జీవనాన్ని సాగించుకుంటూ వస్తున్న సగటు సిపిఎస్ ఉద్యోగులు వేతన సవరణ కమిటీ నివేదికను చూసి దిమ్మెరపోయారు. తమకు వేతనం పెరగాల్సిందిపోయి, వేతనంలో మరింత కోత పెరగుదలను సిఫారసుచేయడంతో కుతకుతలాడుతున్నారు.
ఒక సగటు సిపిఎస్ ఉద్యోగి తన వేతనంలో పదిశాతం మేర ప్రభుత్వం వద్ద అట్టేపెట్టాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం పలు రకాలుగా పెట్టుబడులు పెట్టడం కద్దు. దీంట్లో లాభం సంగతి దేవుడెరుగు… నష్టం మాత్రం వచ్చే దాఖలాలే ఎక్కువని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్, తదితర పెట్టుబడులు ఎప్పుడూ లాభాల బాటలోనే పయనించవు కదా…! దీంతో తమ వేతనం నుండి ప్రభుత్వం మినహాయించుకున్న మొత్తం పెరుగుతుందో లేదో తెలియదుకానీ… తరగకుంటే చాలనుకుంటారు సిపిఎస్ ఉద్యోగులు. ఇక వేతనకోత తర్వాత చేతికొచ్చే వేతనం అంతంత మాత్రమే. వచ్చిన దాన్ని ఎలాగోలా నెల మొత్తం సర్దుకుంటూ సాగించాల్సి వుంటుంది. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగం వెలగబెడుతున్నా…. ఆర్ధికంగా ఒక సగటు బజ్జీలు, చాట్స్ బండి నడిపే వారికన్నా కూడా అథమంగా ఉంటూ వస్తున్నారు. అయినా ప్రభుత్వ ఉద్యోగం అనే ధీమాతో, సమాజంలో లభిస్తున్న గౌరవానికి(!?) చాలీచాలని వేతనంలో సర్దుకుపోతూ, ముందుకు సాగుతున్నారు.
నిజానికి సిపిఎస్ ఉద్యోగులు తమకన్నా కూడా పానీపూరీ లేదా బజ్జీలు వేసుకుంటూ బతికే వారి జీవితాలు, జీతాలు నయమని భావిస్తున్నారు. వారు ఉండడానికి రోడ్డుపైనే ఉన్నాకూడా… వారికి ఆదాయం అధికం. అంతేకాదు… తమకు ఇష్టముంటే పని లేదంటే సెలవు. కానీ ఉద్యోగి అలాకాదు… తనకు ఇష్టం ఉన్నా లేకున్నాకూడా ఉద్యోగం చేయాల్సిందే. లేకుంటే ఇల్లు గడవడం కష్టం. అంతేకాదు… తమపై ఎందరో అధికారుల పర్యవేక్షణ… నిఘానేత్రాలు… ఇన్నింటి మధ్య విధులను నిర్వహించడం. నిజంగా ఉద్యోగులకు ఒకరకంగా ఇది ఎంతో శ్రమాధిక్యతతో కూడుకున్నది. అయినాకూడా నెలపెట్టగానే మొదటి వారంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక నిలకడైన వేతనం లభిస్తుంది అనే ధైర్యంతో ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. తాజాగా వేతన పెంపుకోసం నియమించిన వేతన సవరణ సంఘం ఉద్యోగుల ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగుల వేతనాలను పెంచడం పక్కనపెడితే, వారి వేతనంలో కోత మాత్రం పెంచిందనే చెప్పాలి.
ఈ కమిటీ ప్రభుత్వానికి 7.5 శాతం ఫిట్మెంట్ ను సూచించింది. ఇది నిజంగా చాలా తక్కువ పెంపు అని చెప్పకతప్పదు. ఇందులో సిపిఎస్ ఉద్యోగి విషయానికి వస్తే అసలే పదిశాతం వేతనకోత. వేతన పెంపులో ఏమన్నా పెరుగుదల ఉంటుందేమో, దానితో ఊరట చెందుదామనుకుంటే, కమిటీ సిఫారసు చూసి ఖంగుతినడం సిపిఎస్ ఉద్యోగి వంతయింది. సూచించిన ఫిట్మెంట్ 7.5శాతం. ఇందులో మళ్లీ కోత 4శాతం అంటే మొత్తంతమ వేతన పెరుగుదల 3.5శాతం. మరోవైపు హెచ్.ఆర్.ఎ.ను తగ్గించాల్సిందిగా కమిటీ సిఫారసు చేసివుంది. దీని ప్రభావం వల్ల వేతనంలో జరిగే కోత 1.5శాతం ఉంటుంది. ఇక మిగిలింది కేవలం 2 శాతం మాత్రమే. ఈ మాత్రం పెరుగుదల ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే… అని సిపిఎస్ ఉద్యోగులు వాపోతున్నారు. తమకన్నా రోడ్డుపై బండి పెట్టుకుని, ఎవరికీ అణిగివుండాల్సిన అవసరం లేకుండా జీవనాన్ని సాగించుకునే ఛాట్స్ బండివాడి జీవితం నయమంటూ సిపిఎస్ ఉద్యోగులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇలా ఉద్యోగులకు బాధ కలిగించే నిర్ణయాలు కొనే విషయంలో, ఆలోచిస్తే బాగుంటుంది.
తమకు వేతనాలు పెంపు చేయడానికి ఖాళీ ఖజానాని చూపే ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్.పి.టి.సిలు, ఎంపీటీసీలకు వేతనాలు పెంపు చేయడానికి మాత్రం జబర్దస్త్ గా నిర్ణయాలు తీసుకుందని, ఇది మంచిది కాదని, ఒక సాధారణ ఉద్యోగి స్థాయికి వచ్చి ఆలోచిస్తే బాగుంటుందని పలువురు ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
.. అపరాజిత